కలెక్టరేట్‌లో పోలింగ్‌ కేంద్రాల మూడో దశ ర్యాండిమైజేషన్‌ ప్రక్రియ

May 11,2024 17:41 #collecter, #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : సాధారణ ఎన్నికలు -2024 నిర్వహణలో భాగంగా పోలింగ్‌ కేంద్రాల మూడో దశ ర్యాండిమైజేషన్‌ ప్రక్రియను శనివారం కలెక్టరేట్‌ ఎన్‌ఐసీ సెంటర్‌లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌, జిల్లా పరిశీలకులు ఎస్‌.గణేశ్‌, రాజేశ్‌ జోగ్‌ పాల్‌ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సూచనలకు అనుగుణంగా కాకినాడ పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మూడో దశ ర్యాండిమైజేషన్‌ ప్రక్రియ ద్వారా ఈ నెల 13న జరిగే ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొనే పోలింగ్‌ సిబ్బందికి మొత్తం 1,640 పోలింగ్‌ కేంద్రాలకు కేటాయింపు చేశామన్నారు. పీవో, ఏపీవో, ఓపీవో, మైక్రో అబ్జర్వర్లు ఇతర సిబ్బందికి 12న ఆయా నియోజకవర్గాల డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ లో పోలింగ్‌ సామాగ్రితో పాటు ఏ పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వర్తించాలో తెలియజేయడం జరిగుతుందన్నారు. పోలింగ్‌ సిబ్బంది అంతా ఆదివారం నిర్ణియించిన సమయానికి ఆయా డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లకు చేరుకోవాలన్నారు. ఎవరైనా ఎన్నికల విధులకు గైర్హాజరు అయినట్లయితే వారిపై ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు తగు చర్యలు తిసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్‌ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పోలింగ్‌ ప్రక్రియ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, జిల్లాలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు 13వ తేదీన తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ కోరారు. కార్యక్రమంలో సీపీవో పీ.త్రీనాథ్‌, ఎన్‌ఐసీ ఐటీ డైరెక్టర్‌ సీహెచ్‌.సుబ్బారావు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

➡️