ఈసారి గట్టిపోటీయే

May 10,2024 21:39

గతంలా అంత సులువు కాదు సుమా!

కురుపాంలో త్రిముఖపోటీ

చీపురుపల్లిలో హోరాహోరీ

విజయనగరంలో గీత ప్రభావం ఎంతో?

ఎమ్మెల్యే స్థానాలను బట్టే ఎంపీల భవితవ్యం

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి’ :  ఈసారి గట్టిపోటీయే… గతంలా అంత సులువు కాదు సుమా..! కురుపాంలో త్రిముఖపోటీ నెలకొంది. చీపురుపల్లిలో ఇద్దరు రాజకీయ ఉద్దండుల మధ్య పోటీ నువ్వానేనా? అన్నట్లు ఉండడంతో ఎవరు గెలుస్తారో అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయనగరంలో గీత ప్రభావం ఎంతో?.. ఆమెకు వచ్చిన ఓట్లను బట్టే వైసిపి, టిడిపి అభ్యర్థుల భవితవ్యం కూడా ఉంటుంది. ఎమ్మెల్యే స్థానాల్లో వివిధ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల గెలుపు, మెజార్టీలను బట్టే ఎంపీల భవితవ్యం ఉంటుంది’. ఇది జిల్లాలో సాగుతున్న రాజకీయ చర్చ. విజయనగరంలో ప్రధాన పోటీ టిడిపి, వైసిపి లభ్యర్థుల మధ్య ఉన్నప్పటికీ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు వచ్చే ఓటన్లు బట్టి వారి గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయన్న చర్చ జరుగుతోంది. గీత ఎన్ని ఓట్లు ప్రభావితం చేస్తారనేదానిపై ఆసక్తికర చర్చనడుస్తోంది. టిడిపి నుంచి అశోక్‌ గజపతిరాజు అభ్యర్థి కాకపోతే వైసిపికి అవకాశాలుంటాయన్న నాటి చర్చ ఇప్పుడు లేదు. ఇరు పార్టీల మధ్య గట్టిపోటీ ఉంది. గజపతినగరంలో క్రమంగా టిడిపి అభ్యర్థికి సానుకూలత పెరిగింది. వైసిపి ఎమ్మెల్యే ఇటీవల పలు చోట్ల భూ వ్యవహారాలతో నిలదీతకు గురికావడం, ప్రజలపై నిర్లక్ష్యం, నాయకుల్ని కూడా పట్టించుకోరనే ప్రచారం ప్రతికూల పరిస్థితులకు దారితీస్తోంది. బొబ్బిలిలో టిడిపి తిరుగులేని గెలుపు సాధిస్తుందని తొలుత భావించినప్పటికీ, ఇటీవల కాలంలో వైసిపి తిరిగి పుంజుకున్నట్టు కనిపిస్తోంది. కానీ, వైసిపికి చెందిన స్థానిక ఎమ్మెల్యే కొన్ని తరగతులపై దురుసుగా మాట్లాడుతుండడం, జ్యూటు మిల్లు, తోటపల్లి నీరు తదితర హామీలు పూర్తిగా అమలు చేయలేకపోవడం ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపే పరిస్థితులు ఉన్నాయి. టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబీ నాయనకు పదవి లేకపోయినప్పటికీ సుదీర్ఘకాలంగా జనాన్ని అంటిపెట్టుకుని సమస్యలపై పనిచేయడం కొంత సానుకూలత ఉంది. ఎస్‌.కోటలో టిడిపి మధ్య ఉన్న గ్రూపుల పోరు పైకి సమసిపోయినట్టు కనిపిస్తున్నప్పటికీ లోలోపల విభేదాలు లేకపోలేదని ఆ నియోజకవర్గంలో చర్చనడుస్తోంది. ఇది వైసిపికి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు క్రాస్‌ ఓటింగ్‌ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చీపురుపల్లిలో ఇద్దరు సీనియర్‌ నాయకుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. టిడిపి అభ్యర్థి, మాజీ మంత్రి కళావెంకటరావుకు ఆసల్యంగా సీటు వచ్చినప్పటికీ చంద్రబాబు జోక్యంతో పార్టీ ఇన్‌ఛార్జిగావున్న నాగార్జునను కలుపుకుని ముందుకు సాగుతుండడంతో బలం పెరిగింది. ఇటు వైసిపి అభ్యర్థి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు ఆయనకు మద్ధతుగా కొడుకు సందీప్‌, మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు చెరోవైపు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తమ కేడర్‌ను నిలబెట్టుకుంటూనే ప్రత్యర్థిపార్టీలోని అసంతృప్తులను ఆకట్టుకుంటున్నారు. దీంతో, ఓటరు నాడిపై ఉత్కంఠ నెలకుంది. నెల్లిమర్లలో టిడిపి ఓట్లు శతశాతం ఓట్లు జనసేనకు బదిలీ అయితే తప్ప ఉమ్మడి అభ్యర్థి గెలిచే పరిస్థితి లేదు. దీనికితోడు వైసిపి అభ్యర్థి నియోజకవర్గంలోని మెజార్టీ సామాజికవర్గానికి చెందినవారు. సామాజిక తరగతిని బట్టి ఓట్లుపడే అవకాశం ఉంటే జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థి ప్రతికూలత ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మేరకు వైసిపి అభ్యర్థికి సానుకూలత వచ్చే అవకాశం ఉంటుంది. రాజాంలో తొలి నుంచీ టిడిపికి అనుకూలత కనిపిస్తోంది. అభ్యర్థి ఇప్పటికే రాజకీయాల్లో ఉండడం, ఇరు పార్టీలతోనూ ఉన్న సంబంధాలు, గ్రూపులు కూడా కలిసిపోవడం, ఇందుకు దోహదపడ్డాయి. వైసిపి అభ్యర్థి కొత్తవారు కావడంతోపాటు ధీటైన ప్రచారం చేసే నాయకత్వం లేకపోవడం వంటి కారణాలు ఇబ్బందికరంగానే ఉన్నాయి. మన్యం జిల్లా పరిధిలో సాలూరులో టిడిపిలోని గ్రూపుల పోరు మరోసారి వైసిపికి సానుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసిపి అభ్యర్థి హడావుడి లేకుండా ముమ్మర ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి ఏడాది క్రితం నుంచే గడపగడపకూ వైసిపి ప్రభుత్వం పేరిట విస్తృతంగా జనాల్లోకి వెళ్లారు. పార్వతీపురంలో పది రోజుల క్రితం వరకు వైసిపి అభ్యర్థికి సానుకూలంగా ఉన్నట్టు చర్చజరిగినప్పటికీ తాజాగా పరిస్థితులు తలకిందులయ్యాయన్న చర్చ నడుస్తోంది. టిడిపి అభ్యర్థి పార్టీలోని వెన్నుపోటు దారులను పక్కనబెట్టిన అసలైన కేడర్‌తో ముందుకు సాగుతున్నారని పలువురి విశ్లేషణ. వైసిపి అనైతిక చర్యలను ఎప్పటికప్పుడు బయటపెట్టి తిప్పికొడుతున్నారని, ఇదంతా టిడిపికి కొంత సానుకూల అంశాలేననే చర్చ వినిపిస్తోంది. కురుపాంలో టిడిపి, సిపిఎం, వైసిపి అభ్యర్థుల మధ్య త్రిముఖపోటీ నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరి, నిర్లక్ష్యం, హామీలు అమలు చేయకపోవడం వంటి కారణాలవల్ల వైసిపికి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. టిడిపిలో గ్రూపులు కలిసినప్పటికీ సిపిఎం కూడా గట్టిపోటీ ఇస్తుస్తోంది. దీంతో, టిడిపి, వైసిపిల మధ్య విధానాల పరంగా పెద్ద తేడా లేదన్న విషయం గిరిజనుల నోట వినిపిస్తోంది. దీనికితోడు సిపిఎం చేపట్టిన ప్రజా ఉద్యమాలు, ఫలితాలు, గత చరిష్మా, తాజాగా కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ మద్ధతు వంటివాటివల్ల సొంత బలానికి అదనపు బలం తోడైంది. వైసిపి, టిడిపి విధానాలు నచ్చనివారు, అసంతృప్తులు సిపిఎం పట్ల ఆకర్షితులవుతున్నారు. అటు పాలకొండలో జనసేన – టిడిపి ఉమ్మడి అభ్యర్థికి ఆసారి సానుకూలంగా ఉంటుందనే చర్చనడుస్తోంది. వైసిపి ఎమ్మెల్యే వరుసగా రెండుసార్లు ఎన్నిక కావడం, అదే రెండు దఫాలుగా ఆమె చేతిలో జనసేన అభ్యర్థి ఓటమి చవిచూడడం వల్ల ప్రజలు ఒక అవకాశాన్ని ఇవ్వాలన్న సానుభూతిఓ ఉన్నారని చర్చనడుస్తోంది. ఇప్పటికిలా ఉన్నప్పటికీ రానున్న రెండు రోజులే అత్యంత కీలకం. మిగిలిన సమయం అభ్యర్థుల తలరాతలను మార్చేలేదని చెప్పలేం. అందుకు తగ్గట్టే టిడిపి, వైసిపి పార్టీలు అన్ని నియోజకవర్గాల్లోనూ జనాన్ని మభ్యపెట్టేందుకు భారీగా మద్యం, డబ్బు సిద్ధం చేశాయి. నేటితో ప్రచారం ముగియనుండడంతో వాటితో జనాన్ని లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ ఏమేరకు ప్రభావం చూపుతాయో? పరిస్థితులు ఎలా తారుమారు అవుతాయో? వేచిచూడాల్సిందే.

➡️