అపాచీ… తూచ్‌!-శంకుస్థాపనకే పరిమితం-నిరుద్యోగులకు మిగిలింది నిరాశే

అపాచీ... తూచ్‌!-శంకుస్థాపనకే పరిమితం-నిరుద్యోగులకు మిగిలింది నిరాశే

అపాచీ… తూచ్‌!-శంకుస్థాపనకే పరిమితం-నిరుద్యోగులకు మిగిలింది నిరాశేప్రజాశక్తి- తిరుపతి బ్యూరో శ్రీకాళహస్తి ప్రాంతంలో ‘అపాచీ’ ఆశ కల్పించారు. ప్రత్యక్షంగా మూడు వేల మందికి, పరోక్షంగా ఐదు వేల మందికి సొంతూళ్లోనే ఉపాధి కల్పిస్తామని ఆశ చూపారు. రైతుల నుంచి 275 ఎకరాల డికెటి భూములను తీసుకున్నారు. అయితే, పరిశ్రమ ఏర్పాటు కాలేదు. దీంతో, ఈ ప్రాంత నిరుద్యోగులకు, కంపెనీకి భూములిచ్చిన రైతులకు నిరాశే మిగిలింది. శ్రీకాళహస్తి రూరల్‌ మండలం ఇనగలూరు, గోవిందరావుపల్లి, పోలి, భీమవరం పంచాయతీల పరిధిలో 16 గ్రామాలు ఉన్నాయి. డిగ్రీ, ఐటిఐ, ఇంటర్‌ చదివిన విద్యార్థులు వెయ్యిమందిపైనే ఉన్నారు. చదువుకున్నా ఉద్యోగం రాక ఉపాధి పనులకు వెళ్తున్నారు. మరికొంతమంది పక్కనున్న శ్రీకాళహస్తి, తిరుపతి, వెంకటగిరి, సూళ్లూరుపేట, రేణిగుంట ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో రోజు కూలీలుగా పని చేస్తున్నారు. కొందరు ఉపాధి కోసం వలస వెళ్లారు. రైతులు సాగు చేసుకుంటున్న డికెటి భూముల్లో పరిశ్రమ ఏర్పాటుకు అపాచీ కంపెనీ ముందుకొచ్చింది. చెప్పులు, బూట్లు, బెల్ట్‌లు, పర్సులు, బ్యాగ్‌లు, కార్ల కవర్లు వంటివి తయారు చేయనున్నట్లు తెలిపింది. పరిశ్రమ కోసం భూములిస్తే ఎకరాకు రూ.5 లక్షలు ఇస్తామని రైతులకు ప్రభుత్వ అధికారులు మొదట్లో చెప్పారు. రైతులు నిరాకరించడంతో ‘స్థానిక’ అధికార ప్రజాప్రతినిధి వద్ద మధ్యవర్తిత్వంతో ఎకరాకు రూ.17.50 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ పరిశ్రమలో స్థానికులకు ఉపాధి కల్పిస్తామని ఆ కంపెనీ ప్రతినిధులు, అధికారులు హామీ ఇచ్చారు. దీంతో, ఇనగలూరు రైతులు 70 మంది, గోవిందరావుపల్లి రైతులు 70 మంది, పోలి, భీమవరం రైతులు 17 మంది తమ డికెటి భూములను ఇచ్చారు. అయితే, తమకు రూ.14.50 లక్షలు చొప్పున మాత్రమే ముట్టాయని, మధ్యవర్తిత్వం వహించిన ప్రజాప్రతినిధి ఎకరాకు మూడు లక్ష రూపాయల చొప్పున కమీషన్‌ తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అపాచీ పరిశ్రమకు 2022 జూన్‌ 23న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేశారు. పది రోజుల్లో నిర్మాణ పనులు చేపడతామని, ఏడాదిలో ఉత్పత్తి ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ఆపాచీ ప్రకటించింది. అయితే, నేటికీ పనులు ప్రారంభించలేదు. పైగా, ఏర్పాటు చేసిన బోర్డును, పునాది రాయిని సైతం తొలగించింది. అపాచీ కంపెనీకి గూడూరు, తడలో బ్రాంచులు ఉన్నాయి. చిన్న పిల్లలను వదిలి దూరంగా ఉంటున్నాను వెంకటగిరి ప్రభుత్వ కాలేజీలో ఐటిఐ చదివాను. ఫిట్టర్‌ పాసయి నాలుగేళ్లయింది. నా కోర్సుకు సంబంధించి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. డ్రైవింగ్‌ నేర్చుకుని తిరుమలలో ఆప్టింగ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. రోజుకు రూ.1,200 వస్తోంది. వసతి, భోజనం పోను రోజుకు రూ.700 మిగులుతోంది. నాకు అమ్మ, నాన్న, భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. నెలకోసారి ఇంటికి వచ్చి వారిని చూసుకుంటున్నాను. అపాచీ పరిశ్రమ వచ్చి ఉంటే ఇక్కడే ఉద్యోగం లభించేది. -రాఘవ, ఇనగలూరు పెయింటిగ్‌ పనులకు వెళ్తున్నాను డిగ్రీ పూర్తయి ఆరేళ్లయింది. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అపాచీ పరిశ్రమ వస్తుందని ఆశపడ్డాను. స్థానికంగా ఉద్యోగం చేసుకోవచ్చని అనుకున్నాను. పరిశ్రమ రాలేదు. ఉద్యోగం రాక వెంకటగిరిలో పెయింటింగ్‌ పనికి వెళ్తున్నాను.-లోకేష్‌, గోవిందరావుపల్లి

➡️