ఆ ఐదు స్థానాల్లో ఉత్కంఠ

Feb 25,2024 22:10
ఆ ఐదు స్థానాల్లో ఉత్కంఠ

శ్రీ రెండో జాబితాలోనూ వారి పేర్లు ఉంటాయా..?శ్రీ టిడిపి అధినేత ఆలోచన ఏమిటో..!ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో జనసేన, టిడిపి ఉమ్మడి పొత్తులో టిడిపి పోటీ చేసే స్థానాలు తొలి జాబితా శనివారం ప్రకటించే విషయం తెలిసిందే.. చిత్తూరు జిల్లాలో ఐదుగురికి, తిరుపతి జిల్లాలో ఇద్దరికి టిడిపి అభ్యర్థి స్థానాలు ఇస్తూ ప్రకటించారు. చిత్తూరు ఐదు స్థానాల్లో చిత్తూరు టిడిపి అభ్యర్థిగా గురజాల జగన్మోహన్‌రావు, జీడి నెల్లూరు నియోజకవర్గం అభ్యర్థిగా విఎం.థామస్‌ను కొత్తవారిని ప్రకటించారు. కుప్పం, పలమనేరు, నగిరి నియోజకవర్గాల్లో పాత వారే పోటీ చేస్తున్నారు. ఇక తిరుపతి జిల్లాలో గూడూరు పాశం సునీల్‌ కుమార్‌ పేరును ప్రకటించారు. సూళ్లూరుపేటలో అనూహ్యంగా నిలబడ్డ విజరుశ్రీని కొత్త అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు, వెంకటగిరి స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే తామే అభ్యర్థులమని శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాల కష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్‌ రెడ్డి ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలాగే వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే రామకష్ణ నాయుడు ప్రచారం చేస్తున్నారు. తిరుపతి టిడిపి స్థానానికి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టిడిపి సీనియర్‌ నాయకులు నరసింహ యాదవ్‌, ఊక విజరు కుమార్‌, డాక్టర్‌ కోడూరు బాలసుబ్రమణ్యం, జేబీ శ్రీనివాస్‌లు పోటీలో ఉన్నారు. ఎవరిని అభ్యర్థిగా మీరు ఎన్నుకుంటారు చెప్పాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫోన్లో మెసేజ్‌ పంపి మరీ సర్వే చేశారు. అయితే తిరుపతి ఓటర్లు ఎవరికి మెజార్టీ ఇచ్చారో తెలీదు. ఇక్కడ జనసేన, టిడిపి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కోరినట్లు తెలుస్తోంది. జనసేన కు ఈ స్థానం ఇస్తే కొణిదెల నాగబాబు, డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌, కిరణ్‌ రాయల్‌ పోటీ పడుతున్నారు. ఈస్థానం ఎవరికి దక్కుతుందో చూడాలి మరి. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో ఇప్పటికే పులివర్తి నాని నియోజకవర్గంలో గడపగడప తిరిగేసారు. పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రగిరి నుంచి టిడిపి తరపున పులివర్తి నాని, డాలర్‌ దివాకర్‌ రెడ్డి, బడి సుధా యాదవులు ముమ్మరంగా పోటీపడుతున్నారు. మొదటి జాబితాలో పేరు ప్రకటించకపోవడంతో ఈ నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తల్లో ఉత్కంఠత నెలకొంది. సత్యవేడు లోనూ ముగ్గురు తీవ్రంగా పోటీ పడుతున్నారు. వారిలో మాజీ ఎమ్మెల్యే హేమలత కూతురు డాక్టర్‌ హెలెన్‌, 2019లో పోటీ చేసి ఓడిపోయిన జెడ్డా రాజశేఖర్‌, వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిమూలం ఇటీవలే ఎదురు తిరిగి టిడిపి పక్షాన చేరబోతున్నారు. వీరి ముగ్గురు టిడిపి సీటు ఆశిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు చల్లా రామచంద్రారెడ్డి ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల బిఎస్‌వైపి పార్టీ స్థాపించిన రామచంద్ర యాదవ్‌ కూడా పొత్తులో భాగంగా టికెట్‌ ఆశిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని టిడిపి శ్రేణుల్లో టెన్షన్‌ మొదలైంది. పూతలపట్టు నియోజకవర్గంలో ప్రముఖ జర్నలిస్టు డాక్టర్‌ మురళి మోహన్‌ ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయారు. ఊరు వాడఅంతా తిరిగే చేస్తున్నారు. పూతలపట్టు బహిరంగ సభలోను డాక్టర్‌ మురళీమోహన్‌ని ఆశీర్వదించాలని స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయినా మొదటి జాబితాలో మురళి పేరు రాకపోవడం ఉత్కంఠ నెలకొంది.. ఏదేమైనాప్పటికీ ఈ ఐదుచోట్ల టిడిపి శ్రేణుల్లో, పార్టీ మద్దతు దారుల్లో టెన్షన్‌ నెలకొంది.

➡️