ఎన్నికల బదిలీలు షురూ..!

Jan 25,2024 22:42

కమిషన్‌ ఆదేశాలతో ప్రత్యేక కసరత్తుఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీగానేరెండు, మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తిఅధికార యంత్రాంగం అప్రమత్తంప్రజాశక్తి -తిరుపతి టౌన్‌సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బదిలీల హడావిడి మొదలయ్యింది. అధికారయంత్రాంగంలో మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ప్రత్యేకించి ఎన్నికల నిర్వహణకు వీలుగా అధికార యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్‌ అప్రమత్తం చేసింది. ఇప్పటికే ఓటర్ల జాబితా వెలువడింది. ఇక తదుపరి చర్యల్లో భాగంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు ఒకేచోట మూడేళ్లు పనిచేస్తుంటే వారిని తక్షణం వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియ దాదాపు పూర్తయింది. కీలక విభాగాలైన కొన్నింటిలో మాత్రం ఈనెల 25లోపే ఈ తతంగాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే యంత్రాంగం ఒక స్పష్టతతో ఉన్నందున నేడో రేపో కీలక కార్పులు వెలువడతాయి. ఒక విశేషం ఏమిటంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రామాణికంగానే బదిలీలు ఉంటాయి. సొంతంలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని ఎన్నికలలతో సంబంధం ఉండే అధికారుల బదిలీ తప్పనిసరి. సాధ్యమైనంత మేర ఈ రెండు, మూడు రోజుల్లోనే ఈ బదిలీ ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఇప్పటికే పోలీసుశాఖలో ఈ తాజా నిబంధనలకు అనుగుణంగానే గడిచిన పక్షం రోజులుగా బదిలీ ప్రక్రియ కొనసాగించారు. రేంజ్‌ పరిధిలో ఉన్న వారందరినీ గమనించి ఆ మేరకు ఎస్‌ఐ దగ్గర నుంచి సీఐల వరకు స్థానచలనం చేశారు. ఇప్పటికే వీరంతా తమకు కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరారు. ప్రత్యేకించి పోలీసు విభాగంలో ఎన్నికల వేళ ప్రతిసారీ ముందస్తుగానే బదిలీలు ఉంటాయి. అందుకనే ఇప్పటికే టికెట్‌ ఖాయమైన కొందరు అధికార పక్ష సిట్టింగులైతే సాధ్యమైనంత మేర తమకు అనుకూలురు నియోజక”వర్గంలో పోస్టింగ్‌ వచ్చేలా జాగ్రత్తపడే అవకాశాలున్నాయి. దీనిని అవకాశంగా తీసుకుని ఒత్తిడి చేసి ఒకవేళ పోస్టింగ్‌ తీసుకున్నా వారిపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా తక్షణం ఎన్నికల కమిషన్‌ రియాక్షన్‌ ఉంటుంది. అయినా అనుకూలురు వచ్చేలా పావులు కదుపుతూనే ఉన్నారు. తాజాగా కొత్త జిల్లాలకు ఈ మధ్యనే బదిలీ అయినా అటువంటి వారికీ ఒకే ప్రాంతంలో మూడేళ్ల విధుల షరతు వర్తిస్తుంది. ప్రత్యేకించి ఈ లెక్కన ఎంపీడీవోలు, తహసీల్దార్లు, జిల్లాస్థాయి అధికారులు డజన్ల సంఖ్యలో బదిలీ కావడానికి ఆస్కారం. ఉమ్మడి జిల్లాలో దాదాపు సగానికి సగం మంది తహశీల్దార్లపైన బదిలీ ప్రభావం పడుతుంది. అత్యధికంగా మూడేళ్ళపాటు ఉమ్మడి జిల్లాలో పనిచేసినవారే ఎక్కువ. ఈ తరుణంలో వీరందరినీ స్థానచలనం చేస్తారు. ఎంపిడిఒల్లో కొంతమందిని ఈ మధ్యన బదిలీ చేశారు. కొందరికేమో ప్రమోషన్‌ ఆధారంగా బదిలీలు అయ్యాయి. ఎన్నికల విధుల్లో వీరిలో చాలామంది కొనసాగే అవకాశం ఉన్నందున బదిలీ కాబడే జాబితాలో ఎంపీడీవోల సంఖ్య అత్యధికంగానే ఉండే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి కిందిస్థాయి సిబ్బంది బదిలీలేవీ పెద్దగా ఉండకపోవచ్చు.జిల్లాస్థాయి అధికారులకు స్థానచలనమేజిల్లాస్థాయిలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు బదిలీ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. జిల్లాలో చాలాకాలం నుంచి విధులు నిర్వహిస్తున్న వారంతా సీనియర్లు కావడం, వీరందరిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవాల్సి ఉన్నందున ఇక బదిలీ తప్పకపోవచ్చు అంటున్నారు. ఈ లెక్కన డీఆర్డీఏ, ద్వామా ప్రాజెక్టు, హౌసింగ్‌, సివిల్‌ సప్లయి, డీఈవో, జిల్లా మైనార్టీ, ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులను బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఆర్‌డబ్ల్యుఎస్‌, సెట్విన్‌, మెప్మా సంబంధిత శాఖాధిపతులు బదిలీ జాబితాలో చేరే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఈ శాఖల్లో విభాగాధిపతులుగా పనిచేస్తున్న కొందరు ఇప్పటికే మూడేళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసుకున్నారు. ఎన్నికల నిబంధన ప్రకారం వీరందరినీ ఆయా ప్రాంతాల నుంచి విధిగా బదిలీ అవుతారు. ప్రత్యేకించి అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారు లుగా పనిచేయబోయే వారందరినీ గుర్తించారు.ఎన్నికల ఏర్పాట్లు చకచకరాబోయే ఎన్నికల నిర్వహణకు వీలుగా ఇప్పటికే పెద్దఎత్తున చర్యలకు దిగుతున్నారు. ఎక్కడికక్కడ ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలించడానికి వీలుగా ప్రత్యేక ఎలక్షన్‌ సెల్‌ ఏర్పాటైంది. తమ అభ్యంతరాలు, ఫిర్యాదులను ఈ సెలుకు నివేదించాల్సి ఉంది. మరోవైపు పోలింగ్‌ కేంద్రాల నిర్దారణ దాదాపు పూర్తయింది. ఇప్పుడేమో ఆయా కేంద్రాల్లో ఉన్న సౌకర్యాల మేర పూర్తిగా దష్టిపెట్టారు. విద్యుత్‌ సరఫరా, తక్షణం ఉన్న సౌకర్యాలు, సమకూర్చాల్సిన సౌకర్యాలు, తాగునీరు, దివ్యాంగులను నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు రావడానికి అనువుగా ర్యాంపుల నిర్మాణం వంటి చర్యలన్నింటిపైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తాజాగా సమీక్షించింది. ప్రత్యేకించి ఎక్కడా లోపాలు తలెత్తకుండా ముందస్తుగానే జాగ్రత్తపడుతున్నారు. త్వరలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు వీలుగా తీసుకుంటున్న చర్యలపై ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతుంది.

➡️