జోరుగా రాజకీయ పార్టీల సర్వేలు

Feb 15,2024 23:53
జోరుగా రాజకీయ పార్టీల సర్వేలు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిఎన్నికల ప్రకటనకు ముందే ఎన్నికల సందడి మొదలైంది. ఒక వైపు అధికార పార్టీ దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రచార జోరు ఊపందుకుంది. మరోవైపు ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీల అధినేతలు జోరుగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. అధికార వైసిపి పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షాలైన, టిడిపి, బిజెపిలు రహస్యంగా ఇప్పటికే పలు దఫాలు సర్వేలు నిర్వహించిన విషయం విదితమే. అభ్యర్థుల ఎంపికతో మొదలై ఫలితాల వరకూ పూర్తిగా సర్వేల రిపోర్టుపైనే ఆధారపడటం సిట్టింగ్‌లు, ఆశావహులకు మింగుడు పడటంలేదు. ప్రజల నాడి తెలుసుకునేందుకు అంటూ కొన్ని సంస్థలు పల్లెలను, పట్టణాలలో వేర్వేరుగా జల్లెడ పట్టాయి. ఫోన్‌ల ద్వారా, రాతపూర్వక పద్ధతుల్లో సర్వేలు జరిగాయి. ఎన్నికలకు కేవలం నెల మాత్రమే ఉందనే సంకేతాలు విన్పిస్తున్న నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు సిట్టింగ్‌లు తాము ఎక్కడున్నాం. ప్రత్యర్థి ఎవరు.. ఏ రీతిలో ముందుకు వెళ్లాలనే ప్రశ్నలతో ఏజెన్సీలను ఆరా తీస్తున్నారు. వైసిపి ఇప్పటికే ఐ ప్యాక్‌ సంస్థ ద్వారా సర్వే పూర్తి చేసిన విషయం విదితమే. ఆ ఫలితాలతో ఏకీభవించని నేతలు ప్రత్యేకంగా ఎవరికి వారే ఇతర ఏజెన్సీలను రంగంలోకి దింపి గెలుపోటములపై సర్వే చేయిస్తున్నారు. టిడిపి సైతం అదే విధానం అమలు చేస్తోంది. వాయిస్‌ కాల్స్‌ ద్వారా సర్వే ప్రారంభించింది. టిడిపి కార్యాలయం నుంచి తొలుత కాల్‌ చేస్తున్నారు. కొద్ది సేపట్లో తమ పార్టీ అధినేత చేస్తారని కాలర్‌ను సిద్ధంగా ఉండాలని కోరుతున్నారు. ఆపై కొంత సమయానికి అధినేత ఫోన్‌ ద్వారా అభ్యర్థి పేరు తెలిపి ఏకీభవిస్తున్నారా..? వ్యతిరేకిస్తున్నారా..? అంటూ ప్రజాభిప్రాయం కోరుతున్నారు. అదే విధంగా జనసేన, బిజెపి స్థానిక నేతలు ఇప్పటికే సీట్ల కోసం సిగపట్లు మరింత ఊపందుకున్నాయి. అధినేతల ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అధికార పార్టీ రెండోసారి అధికారంలోకి రావటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న విషయం విదితమే. అందులో భాగంగా డోకా లేదు అనుకున్న ఎంఎల్‌ఎలకు ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌ఛార్జిల పేరుతో సీటు ఖరారు చేసింది. కొందరిని పిలిపించి సర్వే రిపోర్టులను వారికి అందించింది. మరొక నియోజకవర్గం తప్పదనడంతో పలువురు సిట్టింగ్‌లు అంగీకరించక తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో ఇబ్బందే.. ఏ మాత్రం పనికిరారు అనుకున్న అభ్యర్థులకు సంబంధించి వారికి ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. తాజాగా అధికార పార్టీ సంక్షేమ పథకాల వేగం పెంచింది. ప్రతిపక్ష టిడిపి తొలిదశ మేనిఫెస్టో ప్రకటించింది. దీంతో గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితి కొంత మెరుగుపడినట్లు ఆయా పార్టీల ప్రతినిధులు భావిస్తున్నారు.

➡️