ఫీల్డ్‌ అసిస్టెంట్లే ‘టార్గెట్‌’లక్ష్యాల పేరిట తొలగింపువేతనాల్లోనూ కోతఎగవేత వేతనాలతో ఉన్నతాధికారుల విలాసాలు!కుంటుపడుతున్న ‘ఉపాధి హామీ’ లక్ష్యం

ఫీల్డ్‌ అసిస్టెంట్లే 'టార్గెట్‌'లక్ష్యాల పేరిట తొలగింపువేతనాల్లోనూ కోతఎగవేత వేతనాలతో ఉన్నతాధికారుల విలాసాలు!కుంటుపడుతున్న 'ఉపాధి హామీ' లక్ష్యం

ఫీల్డ్‌ అసిస్టెంట్లే ‘టార్గెట్‌’లక్ష్యాల పేరిట తొలగింపువేతనాల్లోనూ కోతఎగవేత వేతనాలతో ఉన్నతాధికారుల విలాసాలు!కుంటుపడుతున్న ‘ఉపాధి హామీ’ లక్ష్యంప్రజాశక్తి- శ్రీకాళహస్తి ప్రతి నిరుపేద కుటుంబానికి చేతినిండా పని.. మూడు పూటలా తిండి పెట్టడమే లక్ష్యంగా 2005లో ఉపాధి హామీ పథకం చట్టం చేసుకుంది.. 2006 ఫిబ్రవరి 2వ తేదీన లాంఛనంగా దేశంలోనే మొదటి ఫైలెట్‌ ప్రాజెక్టు కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి హామీ పథకం ప్రారంభమైంది.. పథకం ప్రారంభమై దాదాపు 20 ఏళ్లు పూర్తి కావస్తున్నా ఎక్కడా నిరాదరణకు గురికాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రతి నిరుపేద కుటుంబం ఉపాధి పనులకెళ్లి పొట్టపోసుకుంటున్నారు. ఏడాదికి 100 రోజులు కాదు 200 రోజుల పని కావాలన్న డిమాండ్లు పేదల నుంచి అధికమవుతున్నాయి. ఇంతలా పేదల ఆదరణ పొందిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ను క్షేత్ర స్థాయిలో నడుపుతున్న రథసారథులు మాత్రం ఫీల్డు అసిస్టెంట్లే అని చెప్పక తప్పదు. ఏసీ గదుల్లో కూర్చుని డ్వామా అధికారులు టార్గెట్లు నిర్ధేశించినా కూలీలతో సమానంగా ఎండనక.. వాననక క్షేత్రస్థాయిలో పనులు చేయిస్తోందీ.. చేస్తోంది మాత్రం క్షేత్ర సహాయకులే. ఇంతలా ఉపాధి పథకం నిరుపేదల దరిచేరేలా కృషి చేస్తున్న ఫీల్డు అసిస్ట్టెంట్లు పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహిరిస్తున్న తీరు అభ్యంతరకరమనే చెప్పాలి. వారి చేత గొడ్డు చాకిరీ చేయించుకుంటూ తీరా లక్ష్యాల పేరి నిర్ధాక్షిణ్యంగా తొలగించేస్తున్న పరిస్థితి. కొంతమందిని హోల్డ్‌లో పెట్టి వేతనాలు ఎగ్గొట్టుతున్న వైనం. తొలగించిన ఫీల్డు అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలంటే పాత ‘బకాయి అడగను’ అని ఒప్పంద పత్రం రాయించుకుంటున్న పరిస్థితి తిరుపతి జిల్లాలో కనిపిస్తోంది. ‘ఒక పక్క నిరుద్యోగం..ఇంకో పక్క కుటుంబ పోషణ’ వెరసి ఫీల్డు అసిస్టెంట్లు వేతనాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పాత బకాయి అడగమంటూ ఒప్పంద పత్రం రాసి తీరా విధుల్లోకి చేరుతున్న దుస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వేతనాలు లేక కొంతమంది ఫీల్డు అసిస్టెంట్టు అడ్డదారులు తొక్కుతున్నారనీ, ఫలితంగా ‘ఉపాధి హామీ’ లక్ష్యం పక్కదారి పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. లక్ష్యాల పేరిట తొలగింపు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సుమారు 830 మంది ఫీల్డు అసిసెంట్లు పనిచేస్తున్నారు. పథకం ప్రారంభం నుంచి 2014 వరకు పని చేసిన వారిని ఫిక్స్‌డ్‌ టెన్యూర్‌ అసిస్టెంట్లు (రూ.10 వేలు జీతం), 2014 పైబడి పని చేసేవారిని ఫీల్డు అసిస్టెంట్లు (రూ.8 వేలు), కొత్తగా చేరుతున్న వారిని సీనియర్‌ మేట్‌ (రూ.6వేలు)లుగా గుర్తించి డ్వామా అధికారులు ఉపాధి పథకాన్ని ముందుకు నడుపుతున్నారు. అయితే ఫీల్డు అసిస్టెంట్లను మూడు విభాగాలుగా విభజించినా కూడా వీరంతా ఏడాది 7500 పనిదినాలు ఉపాధి కూలీలకు కల్పించి ఉంటేనే వేతనానికి అర్హులు. మరో ఏడాది కూడా ఫీల్డు అసిస్టెంట్‌గా కొనసాగే అవకాశం ఉంటుంది. లేకుంటే నిర్ధాక్షిణ్యంగా తొలగించేస్తున్న పరిస్థితి. ఈనేపథ్యంలో ఉపాధి హామీ టార్గెట్లు చేరుకునేందుకు ఫీల్డు అసిస్టెంట్లు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవకాశం లేని చోట లక్ష్యాలు చేరేందుకు అపసోపాలు పడుతూ తీరా ప్రాణం పైకి తెచ్చుకుంటున్నారు. కొందరైతే లక్ష్యానికి చేరువై చివర్లో భంగపడి వేతనాలు, ఉద్యోగాలు కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. గడిచిన రెండేళ్ల కాలంలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది ఫీల్డు అసిస్టెంట్లను టార్గెట్ల పేరిట తొలగించినట్లు సమాచారం. ఇదంతా ఏడాదికి రూ.4వేల కోట్ల మేర కేంద్ర ఇస్తున్న ప్రోత్సాహక నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తున్న పనిదోపిడీగా ఫీల్లు అసిస్టెంట్లు ఆరోపిస్తున్నారు. తమ చేత ఏడాదికి రూ.10వేల కోట్ల మేర పనులు చేయించి తద్వారా కేంద్రం ద్వారా రూ.4వేల కోట్లు మెటీరియల్‌ నిధులు తెప్పించుకుని వాటిని ఉపాధి హామీ యేతర పనులకు మళ్లిస్తున్నారని ఫీల్డు అసిస్టెంట్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఎగవేత వేతనాలతో ఉన్నతాధికారుల విలాసాలు! గతంలో ఉపాధి హామీ పథకం కూలీల వేతనాల కోసం టాటా కన్సెల్టెన్సీ సెర్వీసు ద్వారా కార్యకలాపాలు సాగాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుండటంతో నిధులు దారి మళ్లుతున్నాయంటూ కేంద్రం దాన్ని నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌కు అప్పజెప్పింది. అయినా కూలీలు వేతనాల చెల్లింపులో గానీ, ఇతరేతర పనుల్లో గానీ పారదర్శకత కనిపించిన పరిస్థితి. ఇకపోతే సాప్ట్‌వేర్‌ అఫ్డ్‌షేన్ల కోసం బ్లూప్రాగ్‌ అనే కంపెనీకి కోట్లు ధారపోస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఫీల్డు అసిస్టెంట్ల అంశానికి వస్తే డ్వామా పీడీ లాగిన్‌లోని అడ్మిన్‌ కాస్ట్‌ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే ఏడాదికి 7500 పనిదినాలు చేరుకోలేని ఫీల్డు అసిస్టెంట్లను తొలగిస్తున్న వారికివ్వాల్సిన వేతనాలను అడ్మిన్‌కాస్ట్‌ లాగిన్‌లో అలానే ఉంచుతున్నట్లు సమాచారం. ఒక వేళ తొలగించిన ఫీల్డు అసిస్టెంట్‌ తిరిగి విధుల్లోకి రీ జాయిన్‌ కావాలంటే ‘నేను పాత బకాయిని అడగను’ అని ఒప్పందం చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సుమారు 250 మంది ఫీల్డు అసిస్టెంట్లకు వేతనాలు నిలిపేసినట్లు సమాచారం. కొందరికి ఏడాది కాలంగా, మరికొందరికి ఆర్నెళ్లుగా, ఇంకొందరికి మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదని ఫీల్డు అసిస్టెంట్లు వాపోతున్నారు. ఇలా ఫీల్డు అసిస్టెంట్లకు వేతనాల రూపంలో ఎగ్గొట్టిన సొమ్మును ఉన్నతాధికారులు అడ్మిన్‌ కాస్ట్‌ ద్వారా కార్లు కొనుగోలు, అలవెన్సులు, మెయింటినెన్సులు, సాప్ట్‌వేర్‌ అప్డేడ్ల కోసం వినియోగిస్తున్నట్లు తెలిసింది. ‘సొమ్మొకరిది..సోకరిది’ అన్న రీతిలో డ్వామా అధికారులు వ్యవహరిస్తుండటంతో జిల్లాలో ఫీల్డు అసిస్టెంట్ల పరిస్థితి అగమ్యచోరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకుంటున్నారు. ఇకనైనా సంబంధిత ఉపాధి హామీ పథకం ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పథకాన్ని ముందుండి నడిపిస్తున్న క్షేత్ర సహాయకులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ పథకం లక్ష్యాన్ని కాపాడాల్సిన ఆవశ్యకతా చాలా ఉంది. వెంటనే వేతనాలు చెల్లించాలి- పెనగడం గురవయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఫీల్డు అసిస్టెంట్లకు వెంటనే పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి. లక్ష్యాల పేరిట తొలగించిన ఫీల్డు అసిస్టెంట్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. ఎగవేసిన ఫీల్డు అసిస్టెంట్ల వేతనాలను అడ్మిన్‌ కాస్ట్‌ ద్వారా విలాసాలకు వాడుకోవడం బాధాకరం. ఫీల్డు అసిస్టెంట్ల పట్ల డ్వామా అధికారులు, ప్రభుత్వ వైఖరి మారకుంటే సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం.

➡️