రేపు చంద్రగిరిలో ‘వైఎస్సార్‌ మెగా జాబ్‌ మేళా’

రేపు చంద్రగిరిలో 'వైఎస్సార్‌ మెగా జాబ్‌ మేళా'

రేపు చంద్రగిరిలో ‘వైఎస్సార్‌ మెగా జాబ్‌ మేళా’ప్రజాశక్తి – క్యాంపస్‌ : చంద్రగిరి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సంకల్పించామని తుడా ఛైర్మన్‌, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ బుధవారం చంద్రగిరి బాలుర ఉన్నత పాఠశాల వేదికగా ”వైఎస్సార్‌ మెగా జాబ్‌ మేళా” నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ జాబ్‌ మేళాలో 33 మల్టీ నేషనల్‌ కంపెనీలు పాల్గొంటాయన్నారు. 3,500 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి సూచనల మేరకు మెగా జాబ్‌ మేళా కు విచ్చేసే యువతకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మేళాలో పదవ తరగతి నుండి ఇంటర్‌, బీటెక్‌, ఎంబీఏ విద్యార్హత కలిగిన ప్రతి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. వేతనం రూ.15 వేల నుండి రూ.50 వేల వరకు ఇచ్చే ఉద్యోగ అవకాశాలు కలవన్నారు. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ సౌకర్యం కల్పించే అవకాశం ఉన్న కంపెనీలను మాత్రమే ఆహ్వానించినట్లు వివరించారు. ఈ జాబ్‌ మేళాను సద్వినియోగం చేసుకొని నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే వైఎస్సార్‌ మెగా జాబ్‌ మేళాకు అర్హత ధ్రువపత్రాలతో తరలిరావాలని కోరారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వైఎస్సార్‌ మెగా జాబ్‌ మేళాను జయప్రదం చేయాలన్నారు.

➡️