రైతన్నల ఖాతాల్లో రూ.3.93 కోట్లు జమ : జెసి

Feb 28,2024 22:22
రైతన్నల ఖాతాల్లో రూ.3.93 కోట్లు జమ : జెసి

ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: 2023-24 సంవత్సరంకు గాను వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పిఎం కిసాన్‌ కింద వరుసగా ఐదో ఏడాది మూడవ విడత నగదు బదిలీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించి బటన్‌ నొక్కి నేరుగా బుధవారం అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో 1,80,763 మంది రైతులకు, కౌలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ సాగు రైతులకు రూ.36.29 కోట్ల లబ్ది, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కింద రూ. 3.93 కోట్ల రూపాయల లబ్ది చేకూరిందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ శుభం బన్సల్‌ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగా తిరుపతి జెసి, వ్యవసాయశాఖ, ఉద్యాన శాఖ, సెరికల్చర్‌ తదితర అనుబంధ శాఖల అధికారులు రైతులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోనే 2019 నుండి 2022 వరకు 176345 రైతు కుటుంబాలకు 927 కోట్లు వారి ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం 2023-24 తిరుపతి జిల్లాలో మూడవ విడతలో సొంత భూమి కలిగిన రైతులు 178646 మందికి రూ.35.73 కోట్లు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ 430 మంది రైతులకు రూ0.086 కోట్లు, కౌలు రైతులకు 1687 మందికి 0.47 కోట్లు వెరసి మొత్తం 1,80,763 మంది రైతులకు రూ.36.29 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. అలాగే డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ పంట రుణాలు పథకం రబీ 2021కు సంబంధించి 12,166 మంది లబ్దిదారులకు రూ.2.44కోట్లు, ఖరీఫ్‌ 2022కు సంబంధించి 6084 మంది లబ్ధిదారులకు రూ.1.49కోట్లు వెరసి మొత్తం 18,250 మంది లబ్ధిదారులకు 3.93 కోట్ల రూపాయల వడ్డీ రాయితీ నగదు లబ్ది చేకూరిందని తెలిపారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం రూ.36.29 కోట్ల మెగా చెక్కును, సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కింద రూ.3.93 కోట్ల మెగా చెక్కును రైతులకు అందచేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, జిల్లా సెరికల్చర్‌ అధికారిని గీతారాణి, వ్యసాయ సలహా మండలి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

➡️