వాహన రాకపోకలకు ఇబ్బందిగా..రోడ్డుపైనే విద్యుత్‌ స్తంభాలుగ్రామస్తుల మాట ఖాతరు చేయని గుత్తేదారు

వాహన రాకపోకలకు ఇబ్బందిగా..రోడ్డుపైనే విద్యుత్‌ స్తంభాలుగ్రామస్తుల మాట ఖాతరు చేయని గుత్తేదారు

వాహన రాకపోకలకు ఇబ్బందిగా..రోడ్డుపైనే విద్యుత్‌ స్తంభాలుగ్రామస్తుల మాట ఖాతరు చేయని గుత్తేదారుప్రజాశక్తి – రామచంద్రాపురం అసలే ఆ రహదారి ప్రమాదాలకు నిలయం.. ఎల్లపుడూ మట్టి, గ్రావెల్‌ తరలిస్తూ వేగంగా వాహనాలు వెళుతుంటాయి. ఈ రోడ్డులో గతంలో ఎన్నో ప్రమాదాలు ఈ వాహనాల వల్ల చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. పదుల సంఖ్యలో మృతులు ఉండగా, పెద్ద సంఖ్యలోనే క్షతగాత్రులు ఉన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన రహదారిలో ‘నిరంతర’ విద్యుత్‌ పేరుతో స్తంభాలను రోడ్డును ఆనుకుని నాటుతుండటం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఏమాత్రం వాహనాలు వాటిని గుద్దుకున్నా పెద్దఎత్తున ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గ్రామస్తులు గుత్తేదారును ప్రశ్నిస్తున్నా, లెక్కచేయకుండా తాము ‘పెద్దిరెడ్డి’ మనుష్యులమని, రోడ్డుపక్కనే స్తంభాలు నాటుతామంటూ బేఖాతర్‌ చేయడం గమనార్హం. గంగుడుపల్లి సబ్‌ స్టేషన్‌ పరిధిలో బొప్పరాజు పల్లి ఫీడర్‌ పరిధిలోని బొప్పరాజు పల్లి, అనుపల్లి, నూతుగుంటపల్లి, నెమ్మల్లగుంటపల్లి బీర మాకుల కండ్రిగ గ్రామాలలో ఆర్‌ అండ్‌ బి రోడ్డుపైనే విద్యుత్‌ స్తంభాలను నాటి విద్యుత్‌ వైర్లను ఏర్పాటు చేస్తున్నారు. బొప్పరాజు పల్లి నుండి వెదురుకుప్పం వరకు సింగల్‌ రోడ్డు ఉంది. ఈ రోడ్డుపైనే విద్యుత్‌ స్తంభాలు నాటితే భవిష్యత్తులో డబుల్‌ రోడ్డు వేయాలంటే చాలా కష్టమవుతుంది. ఈ రోడ్డు మార్గంలో నిరంతరం కంకరు, మట్టి, పునాదిరాళ్లు ( కాసురాళ్ళు ) లోడ్లతో టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లో, కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలు తిరుగుతూ ఉంటాయి. కానీ గుత్తేదారు విద్యుత్‌ శాఖ నిబంధనల మేరకు విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా ఆర్‌ అండ్‌ బి రోడ్డుపై ఏర్పాటు చేసి బిల్లులు మంజూరు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రోడ్డుపై విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయకుండా రోడ్డుకు దూరంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అడిగితే…… ‘మీకు దిక్కున చోట చెప్పుకోండి……. మేము విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రాపురెడ్డి మనుషులం’ అని బెదిరిస్తున్నారని గ్రామస్తుల ఆవేదన. ఆర్‌ అండ్‌ బి రోడ్డుపై గుత్తేదారు ఇష్టం వచ్చినట్లు విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసినా ఆర్‌ అండ్‌ బి శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు అంటున్నారు. ఇకనైనా విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి కాంట్రాక్ట్‌ నిబంధన మేరకు విద్యుత్‌ స్తంభాలను గుత్తేదారు ద్వారా ఏర్పాటు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పాటు చేస్తున్న విద్యుత్‌ స్తంభాలను ఆపివేయాలని యువత కోరుతోంది.

➡️