సమయపాలన పాటించకుంటే చర్యలు – ఆకస్మిక తనిఖీలో ఎస్వీయూ విసి

సమయపాలన పాటించకుంటే చర్యలు - ఆకస్మిక తనిఖీలో ఎస్వీయూ విసి

సమయపాలన పాటించకుంటే చర్యలు – ఆకస్మిక తనిఖీలో ఎస్వీయూ విసి ప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు సమయపాలన కచ్చితంగా పాటించాలని లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఉప కులపతి ఆచార్య వి. శ్రీకాంత్‌ రెడ్డి హెచ్చరించారు. బుధవారం వర్సిటీ పరిపాలన భవనంలోని ఫైనాన్స్‌ బ్రాంచ్‌, స్పెషల్‌ సెల్‌లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ సిబ్బందితో ముచ్చటిం చారు. పరిపాలనా భవనంలోని వివిధ విభాగాలలో పనిచేసే ఉద్యోగులందరూ సమయపాలన కచ్చితంగా పాటించాలని, ఎక్కడా పెండింగ్‌ ఫైల్స్‌ ఉండకూడదని సూచించారు. ఉద్యోగుల హాజరుపై, పనితీరుపై నేరుగా వివరాలు తీసుకున్నారు. సిటీలోని పరిపాలన భవనం, వివిధ డైరెక్టరేట్‌లు, ప్రిన్సిపల్‌ ఆఫీసు భవనాల చుట్టూ, ఆఫీసుల చుట్టూ విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగులను తిప్పుకోవద్దని, ఖచ్చితమైన సమాచారం వారికి అందించాలని అన్నారు. నెలలో ప్రతివారం ఒక్కో విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేస్తామని తెలిపారు. ఎస్వీయూ అన్ని ప్రిన్సిపల్‌ ఆఫీసులలో సమయపాలన పాటించాలని, ఆఫీసులలో ఖాళీ సీట్లు కనబడ కూడదని, ఏ ఫైల్‌ కూడా 12 గంటల కంటే ఎక్కువ సమయం ఉద్యోగుల టేబుల్‌ పై ఉండకూడదని, సమయపాలన విషయంలోనూ ఖచ్చితంగా వుండాలని ఉద్యోగులకు మార్గదర్శకాలు ఇచ్చారు. తప్పుచేస్తే క్రమశిక్షణ చర్యలు కింద తక్షణం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగుల నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్య సమాధానాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని హెచ్చరించారు.

➡️