నేటితో ప్రచారానికి తెర

ప్రజాశక్తి – కడప ప్రతినిధిఈ నెల 13 తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు శనివారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం ముగుస్తోంది. పోలింగ్‌ ముగిసే వరకు 48 గంటల పాటు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎటువంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి అభ్యర్థులు బహిరంగ సభలు, ఊరేగింపులు, రోడ్‌షోలు నిర్వహించరాదు. ఏప్రిల్‌ 18న ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జిల్లా అధికార యంత్రాంగం సుమారు 23 రోజులపాటు నామినేషన్ల ఘట్టం దగ్గర నుంచి స్క్రూటినీ, ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన వరకు ఎన్నికల షెడ్యూల్‌ను నిర్వహించింది. కడప, అన్నమయ్య జిల్లాలోని రాజకీయ పార్టీల తరుపున బరిలో నిలిచిన వందలాది మంది అభ్యర్థులు తనదైన శైలిలో ఎన్నికల ప్రచారాలను హోరెత్తించారు. 13న నిర్వహించే పోలింగ్‌కు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. పోలింగ్‌ ప్రక్రియ ఊపందుకున్న నేప థ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన వందలాది మంది అభ్యర్థులు పోలింగ్‌కు సంబంధించిన కస రత్తుపై దృష్టి సారించాల్సి ఉంది. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు పోలింగ్‌ బూతుల్లో ఏజెంట్లు నియామకం దగ్గర నుంచి పోలింగ్‌ పోలరైజేషన్‌పై దృష్టి సారించాల్సి ఉంది.ఇందులోభాగం గానే శుక్రవారం సాయంత్రం కడపలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రోడ్‌షో, శనివారం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కడప మున్సిపల్‌ మైదానంలో ఎన్నికల ప్రచారానికి హాజరు కానున్నారు. రాహుల్‌ సభ అనంతరం ఎన్నికల కమిషన్‌ నిబంధన మేరకు పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాల్ని నిలిపేయాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం తెరవెనుక అసలైన రాజకీయం నడవనుంది. ప్రలోభాలు, బజ్జగింపులు, బెదిరింపులు మొదలగు కార్యకలాపాలకు తెరపైకి రానున్న సంగతి తెలిసిందే. జిల్లా అధికార యంత్రాంగం పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సామగ్రి, సిబ్బంది, పర్యవేక్షణ, బందోబస్తు వంటి పాలనాపరమైన చర్యలు తీసుకునే పనుల్లో నిమగం కావడం గమనార్హం. పోలింగ్‌ అనంతరం జూన్‌ నాలుగున కౌంటింగ్‌ ప్రక్రియతో ఎన్నికల క్రతువు ముగియనుంది.నోట్లతో ఓట్లకు ఎర జిల్లా వ్యాప్తంగా బరిలో ఉన్న ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఓటర్లకు నోట్లతో ఎర చూపుతున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులు తమ అనుచరులతో ఇంటింటి ప్రచారం చేయిస్తూ పోలింగ్‌ స్లిప్పులతో పాటు నోట్లు కూడా పంచుతున్నట్లు తెలిసింది. పోలీసు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ యథేశ్ఛగా పంపిణీ కానిస్తున్నారని తెలిసింది. ఏ మాత్రం బయపడకుండా పెద్ద ఎత్తున సొమ్మును పంచడంలో అభ్యర్థులు పోటీలు పడుతున్నారు. ఓటుకు వెయ్యి నుంచి రూ.2, రూ.3 వేల వరకు పంచుతున్నారు. పోలింగ్‌ ముందు రోజు అయితే ఎక్కువగా పోలీసులు మోహరించి ఉంటారనే కారణంగా ముందుగానే ఓటర్లను అభ్యర్థులు ప్రసన్నం చేసుకుంటున్నారు. చీటీల రూపంలో నగదు బదిలీ చేస్తున్నారు.

➡️