పోస్టల్‌ బ్యాలెట్‌ సరళిపై ఎన్నికల సంఘం ఉద్యోగులకు శిక్షణ

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : మంచి పాలకులను ఎంచుకునేందుకు ప్రతి ఓటు కీలకమైన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలతోపాటు అవగాహన కల్పిస్తున్నామని తద్వారా నూరు శాతం ఓట్లు పోలయ్యేలా సిబ్బంది కృషి చేస్తున్నారని జిల్లా ఎన్నికల అధికారి సుమిత్‌ కుమార్‌ గాంధీ అన్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట ఎంవీఆర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ సరళిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … జిల్లాలో సాధారణ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ నిబద్ధత, నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. ఈనెల 13న జరిగే పోలింగ్‌లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించే బాధ్యత అందరిపై ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పక్షాలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే విధానం పై అవగాహన కల్పించారు. అనంతరం అక్కడ ఫోటో దిగి విద్యార్థులను ఓటు హక్కు విషయంలో చైతన్యపరిచారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వి.స్వామి నాయుడు, అధికారులు పాల్గొన్నారు.

➡️