పారదర్శకంగా ఓటరు దరఖాస్తుల పరిష్కారం

  • స్పష్టం చేసిన ఈఆర్వో జే.వెంకటరావు
  • రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

ప్రజాశక్తి కాకినాడ : ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా రానున్న ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా తమ వంతు తోడ్పాటు అందించాలని కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్ఓ, నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు కోరారు. కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమ య్యారు. ఈ సందర్భంగా ఓటర్ల తుది జాబితా ప్రచురణ అనంతరం తాజాగా ఫారం 6,7,8 ద్వారా వచ్చిన దరఖాస్తుల ప్రగతిని వివరించారు. ఇప్పటివరకు 10,482 దరఖాస్తులు రాగా 1005 తిరస్కరించామని, 6127 దరఖాస్తులను ఆమోదించామన్నారు. ఇంకా 3330 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. వీటిని కూడా నిర్ణీత కాలవ్యవధిలో పుష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను ఈఆర్వో నివృత్తి చేశారు. ఓటర్ల జాబితా పై పత్రికలలో వచ్చిన కథనాలను కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నామినేషన్ల తేదీకి పది రోజుల ముందు వరకూ కొత్త ఓట్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి జిల్లా ఎన్నికల అధికారి ద్వారా ఎన్నికల కమిషన్ ఆదేశాల అనంతరమే తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు రావూరి వెంకటేశ్వరరావు ( వైఎస్ఆర్సిపి), తుమ్మల రమేష్ ( టిడిపి), అప్పారావు ( బీఎస్పీ), ఏఈఆర్వో లు దొర, సీతాపతిరావు, మురళీకృష్ణ, గుంటూరు శేఖర్, హరిదాసు, నాగశాస్త్రులు, జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️