గిరిజన నేస్తం విప్పపువ్వు

May 23,2024 21:33

గిరిజనుల మొహాలు పువ్వుల్లా వికసించే కాలమిది. గుమ్మలక్ష్మీపురం మన్యంలో ఏ గిరిజన గూడేనికి వెళ్లినా విప్పపూల పరిమళం వెదజల్లుతోంది. అందమైన ప్రకృతి ఒడిలో ఉదయంపూట నడుస్తూ ఉంటే పాదాలకు మెత్తని పూలు తాకుతుంటాయి. తల పైకెత్తి చూస్తే దట్టమైన పువ్వులు దర్శనమిస్తాయి. గిరి పుత్రికలు రాలిన పూలకు అంటిన మట్టిని సుతారంగా తుడిచి జాగ్రత్తగా వెదురు బుట్టల్లో వేస్తుంటారు.

ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : విప్పపువ్వు అటవీ ప్రాంత ప్రజల బతుకుదెరువు. విప్ప పువ్వులో దివ్యౌషధ గుణాలున్నాయి. విప్పపువ్వు వినియోగించేవారు విశేషమైన ఆరోగ్య లాభాలు పొందుతారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, శరీర పట్లు, వాతాలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. విప్పచెట్లకు ఓ జీవన చక్రం ఉంటుంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌ వరకు ఆకురాలే కాలం. ఆ సమయంలోనే ఘాటైన పరిమళంతో పూలు వికసిస్తూ ఉంటాయి. మార్చి నుండి మే వరకు పూలు రాలే కాలం. ఒక చెట్టు నుండి సుమారు 100 కిలోల పూలు రాలుతాయి. ప్రతి పువ్వును గిరిజనులు జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ల బతుకంత విప్పపువ్వుతోనే ముడిపడి ఉంటుంది. పిల్లాపాపలతో గిరిజనులు పూల సేకరణ కోసం తెల్లవారుజామున అడవికి బయలుదేరి వెళ్తారు. ఒక్కొక్కరు 5 నుంచి 10 కిలోల వరకూ సేకరిస్తుంటారు. వాటిని ఎండబెట్టి తర్వాత బుట్టలలో నింపి ఇంటి గుమ్మంలో దాచుకుంటారు. విప్పపువ్వుతో నానబెట్టిన బియ్యాన్ని కలిపి అన్నం వండుకుంటారు. బెల్లం కలిపి ఉండలు చేసుకుని, తింటారు. విప్పపువ్వును దగ్గు, శ్వాసకోస వ్యాధులకు వాడుతుంటామని గిరిజనులు చెబుతున్నారు. విప్పకాయలను పొడిచేసి పాలలో కలుపుకుని గిరిజన మహిళలు తాగుతారు. దీనివల్ల బాలింతల చనుబాలు వృద్ధి అవుతాయని అంటారు. విప్పపువ్వులను గిరిజనులు గ్రామదేవతలకు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. ఈ వేసవి కాలంలో విప్పపూలను సేకరించి జిసిసికి విక్రయించి, ఆదాయం పొందుతుంటారు. ఈ ఏడాది జీడి పంట సరైన దిగుబడి లేకపోవడంతో గిరిజనుల ఆశలన్నీ విప్పపువ్వు మీదే ఉన్నాయి. విప్ప పువ్వుతో ఆయుర్వేద మందులు, నూనె లడ్డు, హల్వా, కేకులు తయారు చేస్తుంటారు. దీంతో విప్పపువ్వుకు బాగా డిమాండ్‌ పెరిగింది. బయట మార్కెట్లో కిలో విప్పపువ్వు రూ.25 వరకు ధర పలుకుతోంది.

➡️