అందరి చూపు బొబ్బిలి వైపు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఎన్నికలు దగ్గర పడుతుండడం, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో అందరి చూపు బొబ్బిలి రాజకీయాల వైపు తిరుగుతున్నాయి. ఇంతకీ వైసిపి తరపు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? స్థానిక ఎమ్మెల్యే మార్పు అనివార్యమేనా? అలా అయితే కొత్త ముఖం ఎవరు? ఇదీ ప్రస్తుతం జిల్లా వాప్తంగా సాగుతున్న చర్చ. వైసిపిలో చాలా వరకు స్థానిక ఎమ్మెల్యేలను మార్చాలని, వారి సేవలు పార్టీలో అనివార్యమనుకుంటే మరో అసెంబ్లీ స్థానానికి బదిలీ చేయడం వంటి చర్యలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో బొబ్బిలి, రాజాం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను తప్పిస్తారని, మరో ఇద్దరు ఎమ్మెల్యేలను బదిలీ చేస్తారనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బొబ్బిలిలో వైసిపి తరపున ఎవరు పోటీచేస్తారో? అన్న చర్చ గట్టిగా సాగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా అంతటా వైసిపి గాలికి టిడిపి కొట్టుకుపోయినప్పటికీ బొబ్బిలి నియోజకవర్గంలో మాత్రం గట్టిపోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా టిడిపి బొబ్బిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన కేడర్‌ను అంటిపెట్టుకుని ముందుకు సాగుతున్నారు. మరోవైపు పార్టీని నడపడంలోనూ, ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై స్పందించడంలోనూ స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు విఫలమయ్యారు. దీనికితోడు బొబ్బిలిలో ఒక్కగానొక్క జ్యూట్‌ మిల్లును తెరిపిస్తానన్న ఆయన చివరకు దాన్ని రియల్‌ ఎస్టేట్‌కు విక్రయించేందుకు సహాయపడ్డారు. స్థానిక గ్రోత్‌ సెంటర్‌కు గ్రోత్‌ లేకుండా పోయింది. అటు టిడిపిలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపే అవకాశం ఉండడం, ఇటు ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుండడంతో శంబంగిని మారుస్తారని చర్చ నడుస్తోంది. ఒకవేళ ఆయన్ను మారిస్తే ఆ స్థానంలో ఎవరు వస్తారనే చర్చ కూడా సాగుతోంది. జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు ప్రచారం నడుస్తోంది. మంత్రి బొత్స, సోదరులను వారి స్థానాల నుంచి తప్పించే పరిస్థితి లేదు. నెల్లిమర్లలో ఆయన సమీప బంధువు సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజాంలో రిజర్వేషన్‌ అనుకూలించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మజ్జి శ్రీనివాసరావు బొబ్బిలిలో పోటీ చేస్తారని చర్చ నడుస్తున్నప్పటికీ టిడిపి అభ్యర్థిని ఎదుర్కోవాలంటే ఆ నియోజకవర్గంలోని మెజార్టీ సామాజికవర్గం నుంచే ఉండాలని వైసిపి అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. లేదంటే ఆ సామాజికవర్గం ప్రభావం జిల్లా అంతటా చూపించే ప్రమాదం లేకపోలేదని పలువురు రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది వైద్యులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని, వారు అంతగా ఆసక్తి చూపడం లేదని కూడా చర్చ నడుస్తోంది. ఈ అవకాశం ఎవరికి దక్కుతుందో కొద్దిరోజులు వేచిచూడాల్సిందేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

➡️