ఎన్నికలకు ముందే తాయి’లాలిస్తూ’..

Mar 3,2024 20:49

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : ఔను…! సిద్ధమయ్యారు… ఎన్నికలకు ముందే ఆత్మీయ సమావేశాల నిర్వహణకు, ఆ పేరిట కానుకల పంపిణీకి అధికార పార్టీ సిద్ధమైంది. అక్కడక్కడా ప్రతిపక్షమూ అటువంటి దారిలో నడిచేందుకు ఇప్పుడిప్పుడే బయలుదేరినట్టుగా కనిపిస్తోంది. సుమారు పది రోజులుగా అధికార పార్టీ అభ్యర్థులు, ఇన్‌ఛార్జులు ఆధ్వర్యాన విందులు, వినోదాలు ప్రారంభమయ్యాయి. అందులోనే చీరలు, సారెలు తదితర కానుకల పంపిణీ సాగుతోంది. ఎన్నికల్లో వివిధ తరగతులను లోబరుచుకోవడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు సాగుతున్నాయని జనం చర్చించుకుంటున్నారు. బహుషా ఎన్నికల కోడ్‌కు ముందే ఇటువంటి కార్యక్రమాలన్నీ పూర్తవుతాయేమో!!. గతంలో పరిమితమైన స్థానాల్లో మినహా ఎన్నికల నోటిఫికేషన్‌ వరకు అభ్యర్థులు జాబితా విడుదలయ్యేది కాదు. అటు టిడిపి, ఇటు వైసిపి ఏడాది క్రితం నుంచి ఎన్నికల వాతావరణం సృష్టించడంతో ఇరు పార్టీల్లోనూ దాదాపు సగం మంది అభ్యర్థుల పేర్లు ఖరారైపోయాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అధికార పార్టీ తరపున దాదాపు సిట్టింగులేనని లోలోపల ఖరారు చేసినట్టుగా సమాచారం. ఇటు టిడిపి కూడా మూడు చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్లా అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ, దానికి ముద్దతుగా మరో సంస్థ ఓ అడుగు ముందుకు వేసి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, వృద్ధులు, వికలాంగులు, ఉపాధ్యాయులతో సభలు, సమావేశాలు నిర్వహించి అందులో విందులు, వినోదాలతో ముంచెత్తుతున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు గజపతినగరం, విజయనగరం, పార్వతీపురం, శృంగవరపుకోట తదితర చోట్ల బహిరంగంగానే జరుగుతున్నాయి. పార్వతీపురంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత ఏకంగా చీరలతోపాటు డబ్బులు కూడా పంపిణీ చేశారు. విజయనగరంలో నెల రోజుల క్రితం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన నేత, నేడో రేపో ఏకంగా ఉపాధ్యాయల కుటుంబాలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అందులో కానుకలు కూడా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితర విభాగాలకు వైసిపి తరుపున ఓ సంస్థ కూడా బహుమతులు ప్రదానం చేస్తున్నట్టుగా చర్చ నడుస్తోంది. నోటిఫికేషన్‌ తరువాత ఇటువంటి కార్యక్రమాలు, పంపిణీ వంటివి నిర్వహిస్తే ఎన్నికల నిబంధనావళి అడ్డువస్తుందనే ఆలోచనతో ముందస్తుగానే సిద్ధమౌతున్నట్టుగా అర్థమౌతోంది. విందులు, కానుకలతో ఎన్నికల్లో గట్టెక్కాలని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఓటర్లు మాత్రం అందుకు సిద్ధం కాబోరని, ఇచ్చినవన్నీ తీసుకుని బాగా ఆలోచించే ఓటేస్తారని ఆశిద్దాం.

➡️