బిందు సేద్యంపై అవగాహన కలిగించాలి

Mar 1,2024 20:26

ప్రజాశక్తి-విజయనగరం : వరి పంట తప్ప మిగిలిన అన్ని పంటలనూ బిందుసేద్యం ద్వారా సాగు చేయవచ్చని, రైతులకు ఈ విషయంపై అవగాహన కలిగించి డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా విస్తీర్ణం పెంచాలని సంయుక్త కలెక్టర్‌ కె.కార్తీక్‌ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన జెసి మాట్లాడుతూ బిందు సేద్యం కింద 5ఎకరాల లోపు వ్యవసాయం ఉన్న రైతులకు 90 శాతం వరకు , 5ఎకరాల పై బడి ఉన్న వారికీ 50 శాతం వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని తెలిపారు. ఇ క్రాప్‌ నమోదు, ఇకెవైసి శత శాతం పూర్తి చేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వెంకటేశ్వరావు మాట్లాడుతూ ధాన్యం దిగుబడిని పెంచడానికి సైంటిస్ట్‌లతో రైతులకు అవగాహన కలిగించాలని తెలిపారు. జెసి స్పందిస్తూ ఆర్‌బికె స్థాయిలో పొలంబడి నిర్వహించి రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. మట్టి నమూనాల పరీక్షలు నిర్వహిస్తున్న ప్పటికీ పోషకాల లోపాలను రైతులకు తెలియజేయడం లేదని, డిఎఎబి చైర్మన్‌ తెలపగా, జిల్లా వ్యవసాయ అధికారి తారక రామా రావు స్పందిస్తూ ప్రస్తుతం నిధులు లేనందున మట్టి నమూనాల విశ్లేషణ చేయడం లేదని తెలిపారు. సమావేశంలో డిసిసిబి చైర్మన్‌ వి.చిన్న రామునాయుడు, డిఎఎబి సభ్యులు పాల్గొన్నారు.

➡️