విజయం కోసం కలిసి పనిచేద్దాం

Feb 19,2024 21:19

ప్రజాశక్తి-విజయనగరం కోట : వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కలిసి పనిచేద్దామని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌గజపతిరాజు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక అశోక్‌ బంగ్లాలో అవనాపు విజరు, పిల్లా విజరుకుమార్‌, గాడు అప్పారావు ఆధ్వర్యాన పలువురు నాయకులు వైసిపిని వీడి టిడిపిలో చేరారు. ఆయా డివిజన్‌ కేంద్రాల నుంచి కార్యకర్తలతో కలిసి వారు భారీ ర్యాలీగా బయల్దేరి అశోక్‌ బంగ్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి అశోక్‌తోపాటు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు పార్టీ కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. అనంతరం అశోక్‌ మాట్లాడుతూ మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నుంచి తనను తప్పించడానికి ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి పెట్టారని, ఆ సందర్భంలో 470 మంది పిల్లలకు 16 నెలలు భోజనాలు అందకుండా చేసిన ఘనత ఇక్కడి ఎమ్మెల్యేదేనని విమర్శించారు. సిగ్గువిడిచి తాగుబోతులు, దొంగ వ్యాపారాలు చేసేవారు నేడు నీతులు చెబుతున్నారని ఎద్దేవాచేశారు. వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్న అరుణ జ్యూట్‌మిల్‌, సర్వరాయి టెక్స్‌టైల్స్‌ను తానే కొని తిప్పుతానన్న పెద్దమనిషి ఈరోజు వ్యాపారాలు చేసుకుంటున్నారని చెప్పారు. అనంతరం కళావెంకట్రావు మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వ్యక్తులను పట్టించుకోకుండా, నిర్లక్ష్యం చేసిన వారు ఇంతకంటే ఏం దిగజారి పోతారని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాలు నచ్చక వైసిపిని వీడే వారి సంఖ్య పెరుగుతోందని చెప్పారు. అనంతరం టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు కిమిడి నాగార్జున, విజయనగరం, బొబ్బిలి, గజపతినగరం నియోజకవర్గ ఇన్‌ఛార్జులు అదితి గజపతిరాజు, బేబినాయన, కె.ఎ.నాయుడు మాట్లాడారు. టిడిపి పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, మండల అధ్యక్షులు బొద్దల నర్సింగ్‌ రావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, బిసి సెల్‌ నాయకులు వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు, కనకాల మురళీమోహన్‌, కర్రోతు నర్సింగరావు, విజ్జపు ప్రసాద్‌, ముద్దాడ చంద్రశేఖర్‌, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️