సక్రమంగా రేషన్‌ పంపిణీ

Jan 2,2024 21:45

ప్రజాశక్తి-విజయనగరం : కార్డుదాలందరికీ సక్రమంగా రేషన్‌ సరుకులను ఇంటింటికీ పంపిణీ చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ఆదేశించారు. విజయనగరం పట్టణంలోని కణపాక ప్రాంతంలో ఎండియు-6 వాహనం ద్వారా చేపడుతున్న రేషన్‌ పంపిణీ ప్రక్రియను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం, గోధుమ పిండి, కందిపప్పు పంపిణీని పరిశీలించారు. సరుకుల నాణ్యత, నెలనెలా పంపిణీపై కార్డుదారులను ఆరా తీశారు. ప్రభుత్వం ఇస్తున్న సరుకులు సరిపోతున్నాయా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని ప్రతిఒక్కరూ వినియోగించాలని సూచించారు. ఎండియు వాహన ఆపరేటర్‌తో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలో జిల్లా పౌర సరఫరా అధికారి కె.మధుసూదనరావు, డిటిలు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️