అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు

Apr 7,2024 21:27

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ప్రీస్కూల్‌ విద్యతోపాటు బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించి సమాజానికి భావితరాలను అందించడంలో అంగన్వాడీ కేంద్రాలు ఎంతో తోడ్పడుతున్నాయి. అలాంటి అంగన్వాడీ కేంద్రాల భవన నిర్మాణ పనులు గత కొన్ని నెలలుగా సాగుతున్నాయి. దీంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనాలు, కమ్యూనిటీ హాళ్లలో, పాత పాఠశాల భవనాలలో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలకు వచ్చేందుకు చిన్నారులు, బాలింతలు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఐసిడిఎస్‌ పరిధిలో విజయనగరం, చీపురుపల్లి, శృంగవరపుకోట, గజపతినగరం, బొబ్బిలి సెక్టార్ల పరిధిలో 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 2480 మంది అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పని చేస్తున్నారు. ఈ కేంద్రాల్లో 7 నెలల నుంచి మూడేళ్లలోపు ఉన్న చిన్నారులు 44,425 మంది ఉన్నారు. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 30,825 మంది ఉన్నారు. 9809 మంది బాలింతలు, 7659 మంది గర్భిణులు ఉన్నారు.అసౌకర్యాల నెలవు నేటికీ జిల్లాలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించకపోవడం ఆ ప్రాంతాల చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు శాపంగా మారింది. మరుగుదొడ్లు, కిటికీలకు తలుపులు లేకపోవడం కారణంగా వేడి, చలి గాలులకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో సొంత భవనాలు 782 కాగా, 1293 అద్దె భవనాల్లో, 424 అద్దె ఫ్రీ భవనాల్లో కేంద్రాలు నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో చాలా కేంద్రాలకు సొంత భవనం లేకపోవడం, అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రం నడుస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా 70 అంగన్వాడీ కేంద్రాలకు భవన నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. నత్తనడకన భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. పూర్తికాకపోవడంతో అద్దె భవనాలు, కమ్యూనిటీ హాలుల్లోను అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తుండటంతో కేంద్రాలకు వచ్చేందుకు చిన్నారులు, బాలింతలు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి భవన నిర్మాణ పనులు పూర్తి చేయడంతోపాటు అన్ని కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పిం చాలని చిన్నారుల తల్లిదండ్రులు, బాలింతలు, గర్భిణులు కోరుతున్నారు.
వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలి
ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అంగన్వాడీ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. కొన్ని కేంద్రాల్లో కనీస సౌకర్యాలు మరుగుదొడ్లు, కిటికీలకు తలుపులు లేవు. దీనివల్ల ఆ ప్రాంతాల అంగన్వాడీల్లో విద్యార్థులు, బాలింతలు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. వసతుల కల్పనకు అధికారులు చర్యలు చేపట్టాలి.
– వి.లక్ష్మి, జిల్లా గౌరవ అధ్యక్షులు, ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌

➡️