పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్‌

May 12,2024 21:17

విజయనగరం టౌన్‌, కోట : జిల్లాలో సోమవారం జరగనున్న లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల పోలింగ్‌ సాఫీగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి చెప్పారు. జిల్లాలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలకు పోలింగ్‌ సిబ్బంది ఆదివారం చేరుకున్నారని, భోజన విరామం అనంతరం వారంతా ఎన్నికల మెటీరియల్‌తో తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారని తెలిపారు. జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాలన్నింటిలో నీడ, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌ దీపాల ఏర్పాటు వంటి కనీస వసతులను కల్పించడం జరిగిందన్నారు. ఆదివారం ఎన్నికల సామాగ్రి పంపిణీని పరిశీలించే నిమిత్తం చీపురుపల్లి, రాజాం, బొబ్బిలి, గజపతినగరం, విజయనగరంలోని డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలను పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో సామాగ్రి అందిస్తున్న తీరును తెలుసుకున్నారు. ఆయా సిబ్బందితో మాట్లాడి పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన సామాగ్రి అంతా స్వీకరించిందీ లేనిదీ ఆరా తీశారు. పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను తనిఖీ చేసిన తర్వాతే తీసుకువెళ్లాలని సూచించారు. సిబ్బంది తమకు కేటాయించిన వాహనాల్లో జాప్యం చేయకుండా ఆయా పోలింగ్‌ కేంద్రాలకు త్వరగా చేరుకొని పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో చేస్తున్న ఏర్పాట్లపై రిటర్నింగ్‌ అధికారి, జె.సి. కార్తీక్‌ కలెక్టర్‌కు వివరించారు.ఈ సందర్భంగా విజయనగరంలోని పోలీస్‌ శిక్షణ కళాశాలలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 362 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు గుర్తించి ఆయా కేంద్రాల్లో వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్‌, మైక్రో అబ్జర్వర్ల నియామకం వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సహాయ కలెక్టర్‌ వెంకట్‌ త్రివినాగ్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల వద్ద జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, జిల్లాలోని ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పంపిణీ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్‌ జిల్లాలో ఇవిఎంలు, ఇతర ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను (డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్స్‌) జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదివారం పరిశీలించారు. గరివిడి మండలం శ్రీరాంనగర్‌లోని దుర్గాప్రసాద్‌ సరాఫ్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన చీపురుపల్లి నియోజకవర్గ పంపిణీ కేంద్రం, రాజాంలోని ప్రభుత్వ ఐటిఐ, బొబ్బిలి గ్రోత్‌ సెంటర్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, గజపతినగరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, విజయనగరం పోలీసు శిక్షణా కళాశాలలో ఏర్పాటు చేసిన ఆయా నియోజకవర్గాల పంపిణీ కేంద్రాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. కౌంటర్లను పరిశీలించారు. కేంద్రాల్లోని సిబ్బంది పనితీరు, వసతులను ఆరా తీశారు. పోలింగ్‌ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారు ఎక్కడా ఇబ్బంది పడకుండా చూడాలని, అన్ని విధాలా వారికి పూర్తి సహకారాన్ని అందించాలని నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు బి.శాంతి, ఎల్‌.జోసెఫ్‌, ఎ.సాయిశ్రీ, ఎం.వి.సూర్యకళ, జెసి కె.కార్తీక్‌లకు కలెక్టర్‌ సూచించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతీ పంపిణీ కేంద్రంలో పక్కా ఏర్పాట్లు చేశారు. ముందుగా రిజిష్ట్రేషన్‌ కౌంటర్లలో సిబ్బంది హాజరును తీసుకున్నారు. వారికి డ్యూటీ ఆర్డర్లను అందజేశారు. ఇవిఎంలు, ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయడానికి ఒక్కో చోట పదికి పైగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. వచ్చినవారికి వచ్చినట్లే, ఎటువంటి క్యూలైన్లు లేకుండా వెంటవెంటనే ఎన్నికల సామగ్రిని అందజేశారు. ఎన్నికల సిబ్బందికి సహాయం కోసం హెల్ప్‌ డెస్కులను ఏర్పాటు చేశారు. మైక్‌ల ద్వారా నిరంతరం పలు సూచనలు చేశారు. అలాగే మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌ కాస్టింగ్‌, వీడియో గ్రాఫర్స్‌, ట్రైనింగ్‌ సెంటర్‌, రిజర్వ్‌ స్టాప్‌ కౌంటర్‌, వాహనాల కేటాయింపు కోసం కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతీ పంపిణీ కేంద్రం వద్దా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, అవసరమైన వారికి వైద్య సేవలను అందించారు. పోలింగ్‌ సిబ్బంది తమకు ఇచ్చిన ఇవిఎంలు, ఇతర ఎన్నికల సామగ్రితో, బృందాలుగా తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు పయనమయ్యారు.

➡️