ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు

May 12,2024 21:18

విజయనగరం : విశాఖపట్నం రేంజ్‌ పరిధిలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారాజు, అనకాపల్లి జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు భద్రతపరమైన అన్ని చర్యలు చేపట్టామని విశాఖపట్నం రేంజ్‌ డిఐజి విశాల్‌ గున్ని తెలిపారు. ఎన్నికల భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జిల్లాకు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. గత రెండు నెలలుగా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు విస్తతంగా చర్యలు చేపట్టి, ఎన్‌ఫోర్సుమెంటు కేసులు ఎక్కువగా నమోదు చేసామన్నారు. విశాఖపట్నం రేంజ్‌ పరిధిలో 47,000 లీటర్ల ఐడి లిక్కర్‌, రూ.4.5 కోట్ల నగదు, 16 కిలోల బంగారం, 113 కిలోల వెండి, రూ.11.5 కోట్ల విలువైన గిఫ్టులను స్వాధీనం చేసుకున్నామన్నారు. 18వేల మందిని బైండోవరు చేసామన్నారు. రేంజ్‌ పరిధిలో 1250 లొకేషన్‌ల ను క్రిటికల్‌గా పరిగణించి, ఎన్నికల కమిషను ఇచ్చిన ఆదేశాలు ప్రకారం కేంద్ర బలగాలు, ఇతర భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సివిల్‌, ఆర్మ్‌ డ్‌ రిజర్వు, కేంద్ర బలగాలు, హోంగార్డును బందోబస్తు, రూట్‌ మొబైల్స్‌లో వినియోగిస్తున్నా మన్నారు. వీరితోపాటు ఎన్‌సిసి, ఎక్స్‌ఆర్మీ, ఎన్‌ఎస్‌ఎస్‌, ఉద్యోగ విరమణ చేసిన యూనిఫాం ఉద్యోగుల సేవలను వాలంటరీగా వినియోగిస్తున్నా మన్నారు. రాజ్యాంగ బద్దమైన ఓటు హక్కును వినియోగించు కొనేందుకు ప్రజలు నిర్భయంగా బయటకు వచ్చి ఓటు వేయాలన్నారు. ఎటువంటి ప్రలోభాలకు, భయాలకు లొంగాల్సిన అవసరం లేదని, స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వచ్చిన వారికి పోలీసుశాఖ అండగా ఉంటుందని తెలిపారు. పోలింగు కేంద్రాలు పరిశీలనఅనంతరం విజయనగరం పట్టణంలోని కనపాక యూత్‌ హాస్టల్‌ లోని పోలింగు కేంద్రాన్ని, భాష్యం స్కూలు దగ్గరలోని వినాయకనగర్‌ మున్సిపల్‌ హై స్కూలులోని పోలింగు కేంద్రాలను డిఐజి విశాల్‌ గున్నీ, జిల్లా ఎస్‌పి ఎం.దీపిక పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. వారి వెంట ట్రాఫిక్‌ డిఎస్‌పి విశ్వనాధ్‌, ఎఆర్‌ డిఎస్‌పి యూనివర్స్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, టౌన్‌, రూరల్‌ సిఐలు పాల్గొన్నారు.

➡️