పోస్టల్‌ బ్యాలెట్ల తరలింపుపై అనుమానం

May 19,2024 20:56

ప్రజాశక్తి-విజయనగరంకోట : పోస్టల్‌ బ్యాలెట్ల తరలింపు వ్యవహారంపై అనుమానాలు వ్యక్తమవ ుతున్నాయని, అధికారుల తీరే అందుకు బలాన్నిస్తోందని టిడిపి విజయనగరం ఎమ్‌పి, ఎమ్మెల్యే అభ్యర్థులు కలిశెట్టి అప్పలనాయుడు, అదితి గజపతిరాజు తెలిపారు. ఆదివారం స్థానిక అశోక్‌ బంగ్లాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 16న వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి అల్లుడు ఈశ్వర్‌ కౌశిక్‌, ఎంపిపి మామిడి అప్పలనాయుడు ఆధ్వర్యాన పోస్టల్‌ బ్యాలెట్లను తరలించడంపై అధికారులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని తెలిపారు. అధికారులు అడ్డంగా దొరికిపోయి, పొంతన లేని సమాధానాలిస్తూ గందరగోళానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తన తరపున మామిడి అప్పలనాయుడు, ఈశ్వర్‌ కౌశిక్‌ హాజరవుతారంటూ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోలగట్ల రాసినట్లు ఓ లేఖను చూపుతున్నారని, పోస్టల్‌ బ్యాలెట్లను తరలించిన రోజు ఎందుకు చూపలేదని అధికారులను ప్రశ్నించారు. కొత్తగా ఈ లేఖను సృష్టించలేదని నమ్మకం ఏమిటి? అని నిలదీశారు. వైసిపికి తప్ప మిగతా పార్టీల అభ్యర్థులకు, స్వతంత్రులకు కనీస సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. వీటన్నింటినీ పరిశీలిస్తే పోస్టల్‌ బ్యాలెట్ల తరలింపు, అధికారుల తీరుపై తమకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఈ విషయాలను మరోసారి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌బాబు, పట్టణ అధ్యక్షులు పి.లకీëవరప్రసాద్‌, మండల అధ్యక్షులు బి.నర్సింగరావు పాల్గొన్నారు.

➡️