సిటియులో వికసిత్‌ భారత్‌

Apr 29,2024 21:40

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో వికసిత్‌ భారత్‌ యువమంతన్‌ కార్యక్రమంలో భాగంగా ‘పర్యావరణం కోసం జీవనశైలి’ అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని ‘నమూనా ఐక్యరాజ్యసమితి’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పంజాబ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ కులపతి ప్రొఫెసర్‌ రాఘవేంద్ర పి.తివారి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇతర దేశాలలో జరిగే సమకాలీన ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని ఆయాదేశాలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలు వాటికిగల కారణాలు, అభివృద్ధికి విఘాతం కలిగించే వివిధ కారణాలను అవగాహన చేసుకోవడానికే ఈ మోడల్‌ యునైటెడ్‌ నేషన్‌ కార్యక్రమం అని విద్యార్థులకు వివరించారు. అనంతరం సిటియు వైస్‌-ఛాన్సలర్‌ వి.కటిమని మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే ప్రతీ అంశాన్ని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తున్నామని తెలిపారు. అనంతరం నిర్వహించిన ‘నమూనా యునైటెడ్‌ నేషన్స్‌ కార్యక్రమం, నమూనా ఆలిండియా పొలిటికల్‌ పార్టీల మీటింగ్‌’ లలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమకు కేటాయించిన దేశాలు పార్టీల తరఫున వివిధ అంశాలను రసవత్తరంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో టూరిజం ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన డాక్టర్‌ కుసుమ్‌ కోఆర్డినేటర్‌ గా వ్యవహరించగా, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ టి.శ్రీనివాసన్‌, డీన్‌ ప్రొఫెసర్‌ శరత్చంద్రబాబు, డాక్టర్‌ ప్రేమ చట్టర్జీ, డాక్టర్‌ ఎన్‌విఎస్‌ సూర్యనారాయణ, డాక్టర్‌ ప్రసాద్‌ మన్నాల, ఇతర అధ్యాపకులు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️