కార్మిక నేత అప్పలరాజుకు అశ్రు నివాళి

Jun 19,2024 01:01 #appalarajicitu, #autocitu
అప్పలరాజు పార్థివ దేహం వద్ద నివాళ్లర్పిస్తున్న లోకనాథం, తదితరులు

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ :

అనారోగ్యంతో సోమవారం కన్నుమూసిన విశాఖ జిల్లా ఆటో వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రి అప్పలరాజు అంత్యక్రియలు మంగళవారం అశ్రు నయనాల నడుమ సాగాయి. తొలుత అప్పలరాజు పార్థివ దేహం వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గు నాయుడు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, కార్యదర్శులు బి.జగన్‌, పి.మణి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, మాజీ కార్పొరేటర్‌ బొట్టా ఈశ్వరమ్మ, సిపిఎం నాయకులు వై.రాజు, ఎం.సుబ్బారావు, తదితరులు నివాళ్లర్పించారు. అనంతరం సిపిఎం జగదాంబ జోన్‌ కార్యదర్శి ఎం.సుబ్బారావు అధ్యక్షతన సంతాప సభ జరిగింది. నాయకులు మాట్లాడుతూ అప్పలరాజు జగదాంబ ఏరియా 31వ వార్డు కృష్ణా గార్డెన్‌లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేశారన్నారు. 25 ఏళ్లుగా సిఐటియు, సిపిఎం సభ్యునిగా సంఘం, పార్టీ విస్తరణకు శ్రమించారని గుర్తుచేశారు. డివైఎఫ్‌ఐలో పనిచేస్తూ అనేక మంది యువకులను పార్టీలోకి తీసుకొచ్చారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆటో యూనియన్‌ను విస్తరించడానికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన భార్య వరుణ మహిళా సంఘంలో పనిచేసారని, తమ్ముడు గణేష్‌ ప్రస్తుతం విశాఖ జిల్లా ఉపాధ్యక్షునిగా, సిపిఎం జగదాంబ జోన్‌ కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నారని తెలిపారు. కుటుంబం మొత్తం ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి సాగించిందని అన్నారు. అప్పలరాజు మృతి ఆటో కార్మికులకే కాకుండా మొత్తం కార్మికవర్గానికి, పీడిత ప్రజానీకానికి తీరని లోటని తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

 

➡️