తూర్పు తీరంలో టైగర్‌ ట్రయంఫ్‌

  •  25 నుంచి 31 వరకు విన్యాసాలు

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : భారత్‌, అమెరికా మధ్య టైగర్‌ ట్రయంఫ్‌ – 2024 విన్యాసాలు తూర్పు తీరంలో ప్రారంభమయ్యాయి. ద్వైపాక్షిక త్రివిధ దళాల సహాయం, పరస్పర స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకునే క్రమంలో వీటిని చేపట్టినట్టు ఇరు దేశాల అధికారులు వెల్లడించారు. నావెల్‌ డాక్‌యార్డ్‌లోని ఐఎన్‌ఎస్‌ జలాశ్వలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమెరికా తరుపున భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి, తూర్పు నౌకాదళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌, కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌ పాల్గొన్నారు. విన్యాసాల ప్రారంభ నేపథ్యంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. రెండు శక్తివంతమైన దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలను ఇటువంటి ద్వైపాక్షిక విన్యాసాలు మరింత బలోపేతం చేస్తాయని ఎరిక్‌ గార్సెట్టి తెలిపారు. రోజురోజుకూ ఆర్థిక, రక్షణ రంగాల్లో భారత్‌ ఉన్నత స్థాయికి చేరుకుంటోందని చెప్పారు. మిలాన్‌కు కొనసాగింపుగా ఈ టైగర్‌ ట్రయంఫ్‌ విన్యాసాలు జరుగుతున్నట్టు రాజేష్‌ పెంధార్కర్‌ వెల్లడించారు. విశాఖ కేంద్రంగా ఈ నెల 25 వరకూ, సీ ఫేజ్‌కు సంబంధించి కాకినాడ తీరంలో ఈ నెల 26 నుంచి 31 వరకు ఈ విన్యాసాలు జరుగుతాయని తెలిపారు. తాజా విన్యాసాల్లో ఇండియన్‌ నేవీకి చెందిన నౌకలు జలాశ్వ, ఐరావత్‌, కేసరి, సహ్యాద్రిలతో పాటు ఇండియన్‌ నేవీ ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ వాహనాలు పాలుపంచుకున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌ విమానాలు సి – 130 జె, హెలికాప్టర్లు ఎంఐ-17 పాల్గొన్ననున్నాయి. ఇండియన్‌ ఆర్మీ సిబ్బంది, ర్యాపిడ్‌ యాక్షన్‌ మెడికల్‌ టీమ్‌లు ఈ విన్యాసాల్లో భాగస్వాములయ్యాయి. వీటితో పాటు ఇండియన్‌ – యుఎస్‌ మెరైన్‌ కార్ప్స్‌, యుఎస్‌ ఆర్మీకి చెందిన ఎంబార్డ్‌ దళాలు, యుఎస్‌ నేవీ నౌకలు, యుఎస్‌ నేవీ ఎయిర్‌ క్రాఫ్ట్స్‌ పి8ఎ, సి-130 పాల్గొన్నాయి. ఇరు దేశాల దళాల మధ్య వేగవంతమైన సమన్వయం కోసం హెచ్‌ఎడిఆర్‌ కార్యకలాపాల నిర్వహణ, స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ మెరుగుదల ఈ విన్యాసాల లక్ష్యంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

➡️