దుర్మార్గపు పాలనకు చమరగీతం పాడాలి

May 2,2024 22:08

ఎన్నికల ప్రచార సభల్లో సినీనటుడు బాలకృష్ణ

ప్రజాశక్తి-చీపురుపల్లి/విజయనగరం కోట  : రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గపు పానకు చమరగీతం పాడాలని సినీనటుడు, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం చీపురుపల్లి, విజయనగరంలో జరిగిన సభల్లో కూటమి ఎంపి, ఎంఎల్‌ఎ అభ్యర్థులు అయిన కలిశెట్టి అప్పలనాయుడు, కిమిడి కళావెంకటరావు, పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజులతో కలసి ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో జగన్‌మోహన్‌రెడ్డి అధోగతి పాల్జేశాడని విమర్శించారు. మడం తిప్పనన్న జగన్‌మోహన్‌రెడ్డి మెడలు తిప్పుకున్నాడని ఎద్దేవా చేశారు. తెలుగు వారి ఉనికి కోసం ప్రపంచ దేశాలు అబ్బుర పోయేటట్లు ఆనాడు ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. మహిళలో పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చెప్పారు. గురుకులాలు తీసుకొచ్చింది కూడా టిడిపి హయాంలోనేని అన్నారు. అలాంటింది విద్య అంటే ఏమిటో తెలియని బొత్స సత్యన్నారాయణ విద్యాశాఖా మంత్రి అయ్యారని బాలకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో 12,383 పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారని, వారు ఏ విధంగా విద్యార్ధులకు పాఠాలు చెప్పగలరని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు లేని పాఠశాలలకు రంగులు వేసి మేడి పండులా చూపిస్తున్నారే తప్ప అక్కడ ఎటువంటి విద్య విద్యార్దులకు అందలేదని అన్నారు. రాష్ట్రంలో 20 వేల వరకు ఉపాధ్యాయ పోష్టులు ఖాలీగా ఉన్నా ఇంత వరకు ఒక్క డిఎస్‌సి కూడా జగన్మోహన్‌రెడ్డి తీయలేదని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఏడుసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారని, ఆర్‌టిసి ఛార్జీలు ఐదుసార్లు పెరిగాయని దుయ్యబట్టారు.

టిడిపి అమలు చేసిన సూపర్‌ సిక్స్‌తోపాటు మెగా మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. నేడు రాష్ట్రంలో పిచ్చివాడు పాలిస్తున్నాడని విమర్శించారు. బాబారును చంపి, చెల్లిన పక్కనపెట్టిన దానికి సమధానం చెప్పడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయకుండా యువతతోను, కల్తీ మద్యంతో మహిళల జీవితాలతోను ఆటలాడుకున్నారని అన్నారు. ఇలా అన్ని వర్గాల వారిని మోసం చేశారన్నారు. ఒక్క అవకాశం అని వచ్చి కోడి కత్తి, బాబారు హత్య, ఇప్పుడు గులక రాయితో సానుభూతి పొందాలని చూస్తున్నారని అన్నారు. ల్యాండ్‌ టైటిల్‌ యాక్టుతో రైతుల భూములను లాక్కోవాలని చూస్తున్నారని అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి బిక్షాగాడి నుంచి చిరువ్యాపారులు వరకు వడ్డీలకు అప్పులిచ్చి దోచుకుంటున్నారని విమర్శించారు. చీపురుపల్లి సభలో బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రా ఫెర్రోఎల్లాయిస్‌ పరిశ్రమను మూసివేసే దిశగా తీసుకు రావడమే కాకుండా ఆ కంపెనీ యాజమాన్యాన్ని భయపెట్టి అక్కడున్న 45 ఎకరాల భూమిని బొత్స బంధువులు దోచుకున్నారని ఆరోపించారు.

రైతులకు అందుబాటులో ఉన్న ఆర్‌ఇసియస్‌ను బోర్డులో విలీనం చేసి అందులో దొంగతనంగా ఉద్యోగాలు వేసిన ఘనత బొత్స సత్యన్నారాయణదని అన్నారు. కూటమి అధికారంలోనికి రాగానే ఆర్‌ఇసియస్‌ని తిరిగి బోర్డు నుంచి బయటకు తెస్తామని భరోసా కల్పించారు. మైనింగ్‌లు ద్వారా కోట్లాది రూపాయలను బొత్స కొల్ల గొట్టారని బాలకృష్ణ ఆరోపించారు. సూపర్‌ సిక్స్‌తోపాటు మెగా మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. భవిష్యత్‌ తరాల కోసం, ప్రజల బాగుగోసం టిడిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సభల్లో పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌గజపతిరాజు, జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, మాజీ ఎంఎల్‌ఎ గద్దే బాబూరావు, కె.త్రిమూర్తుల రాజు, జనసేన నాయకులు పాల్గొన్నారు.
➡️