ఆక్రమణదారులపై కేసు నమోదు చేయండి

అధికారులకు ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ ఆదేశం
శ్మశానవాటిక దారి ఆక్రమణల ఫిర్యాదు వాండ్రంలో పర్యటన
ప్రజాశక్తి – ఉండి
శ్మశానవాటిక ఆక్రమణదారులపై వెంటనే కేసు నమోదు చేయాలని రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ ఛైర్మన్‌ మారుమూడి విక్టర్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. మండలంలోని వాండ్రం గ్రామంలో శ్మశానవాటిక దారిని కొంతమంది ఆక్రమించి రహదారి నిర్మిస్తున్నారని దళిత నాయకులు మంగళవారం ఎస్‌సి, ఎస్‌టి, విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పొన్నమండ బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. బాలకృష్ణ రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ ఛైర్మన్‌ మారుమూడి విక్టర్‌ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విక్టర్‌ప్రసాద్‌ బుధవారం మండలంలోని వాండ్రంలో పర్యటించి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్మశానవాటిక వెళ్లే దారిని ఆక్రమించిన వారు ఎవరైనా వెంటనే వారిపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్మశానవాటిక లేని దళితవాడలకు వారి సంఖ్యను బట్టి శ్మశానవాటికను కేటాయించి ఆక్రమణకు గురి కాకుండా చుట్టూ కంచె వేయాలని సిఎం జగన్‌ జిఒ జారీ చేశారని తెలిపారు. దళితవాడకు వెళ్లేందుకు ఉన్న 18 అడుగుల రహదారిని సైతం ఆక్రమించారని విక్టర్‌ప్రసాద్‌ దృష్టికి దళితవాడ నాయకులు తీసుకొచ్చారు. దీంతో శ్మశానవాటిక స్థలాన్ని సర్వే చేసి దళితులకు అప్పగించాలని అధికారులను విక్టర్‌ప్రసాద్‌ ఆదేశించారు. శ్మశానవాటిక, రహదారి ఆక్రమించిన వారిపై కేసులు నమోదు చేయాలని, వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్‌డిఒ కె.శ్రీనివాసరాజులును ఆదేశించారు. ఎన్‌ఆర్‌పి అగ్రహారం గ్రామానికి చెందిన యువకుడు మేడిద సాయి జగన్నాథ్‌ తమ గ్రామానికి శ్మశానవాటిక లేదని, వెంటనే కేటాయిం చాలని కలెక్టర్‌కు గతంలో స్పందనలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు ఇప్పటివరకు పట్టించుకోలేదని, వెంటనే తమ గ్రామంలోని దళితవాడకు శ్మశానవాటిక కేటాయించేలా చర్యలు తీసుకోవాలని విక్టర్‌ప్రసాద్‌కు వినతి పత్రం అందించారు. భీమవరం డిఎస్‌పి నారాయణస్వామి రెడ్డి అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విక్టర్‌ప్రసాద్‌ డిఎస్‌పికి మెమో జారీ చేయాలని సిఫార్సు చేశారు. ఈ పర్యటనలో ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు పొన్నమండ బాలకృష్ణ, చీకటిపల్లి మంగరాజు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజు, గోడి పెద్దిరాజు, మాల మహానాడు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతపాలకొల్లు : విద్య, వైద్య, గృహ రంగాలకు సిఎం జగన్‌ పెద్దపీట వేశారని రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ప్రసాద్‌ చెప్పారు. పాలకొల్లులోని అంబేద్కర్‌ భవన్‌లో బుధవారం నిర్వహించిన సభలో ఆయన మాటా ్లడారు. రాజ్యాంగంలో ఎస్‌సి, ఎస్‌టిలకు ఎన్ని చట్టాలుఉన్న ఇంకా దళితులపై దాడులు పెరుగుతూనే ఉన్నాయన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుమ్మాపు వరప్రసాద్‌, నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థి ఉమాబాల, వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ పాల్గొన్నారు.

➡️