పల్స్‌ పోలియో విజయవంతం

Mar 3,2024 22:34

కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌
ప్రజాశక్తి – భీమవరం
జిల్లాలో ఆదివారం చేపట్టిన పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ప్రారంభించిన పల్స్‌పోలియోపై స్థానిక కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులతో ఆయన మాట్లాడారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేస్తున్నారని, తద్వారా పిల్లలకు బంగారు జీవితం అందించిన వారమవుతామని అన్నారు. జిల్లాలో 1,85,953 మంది పిల్లలున్నారని గుర్తించి వారికి పోలియో చుక్కలు వేసే కార్యక్రమం చేపట్టారన్నారు. 20 మండలాలు, ఆరు మున్సిపాల్టీల పరిధిలో 5,260 మంది అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని వివరించారు. 1,315 పబ్లిక్‌ బూత్‌లు, 45 మొబైల్‌ బూత్‌లు, 34 ట్రాన్సిస్ట్‌ బూత్‌లను ఏర్పాటు చేసి 5,520 మంది వ్యాక్సినేటర్లను ఏర్పాటు చేశామన్నారు. జన సంచారం ఎక్కవగా ఉండే ప్రాంతాల్లోనూ, ఆర్‌టిసి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మురికివాడలు, ఇటుకబట్టీల వద్ద పల్స్‌పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఏదైనా కారణాల వల్ల పోలియో చుక్కులు వేయించని చిన్నారుల కోసం సోమ, మంగళవారాల్లో రెండు రోజులు మిగిలి ఉన్న ఇళ్లకు సంబంధించి ఇంటింటికీ వైద్య సిబ్బంది వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారన్నారు. తాడేపల్లిగూడెం: పోలియో నిర్మూలనకు పల్స్‌పోలియో దోహదం చేస్తుందని డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. మండలంలోని దండగర్ర పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఆయన పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా కొట్టు మాట్లాడుతూ పోలియోరహిత సమాజం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేళ్లుగా పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నాయన్నారు. పోలియో నిర్మూలనకు చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ ముప్పిడి సంపత్‌కుమార్‌, మాధవరం పిహెచ్‌సి వైద్యాధికారి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తణుకు: చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడం ద్వారా వారికి నిండు జీవితాన్ని ఇచ్చినట్లేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం పట్టణంలోని బ్యాంక్‌ కాలనీలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో చిన్నారికి పోలియో చుక్కలు వేసి పల్స్‌పోలియో ప్రారంభించారు. ఈ సందర్భంగా కారుమూరి నాగేశ్వరరావు, నోడల్‌ ఆఫీసర్‌ బి.దుర్గామహేశ్వరరావు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌సి వంక రవీంద్రనాథ్‌, అర్బన్‌ పిహెచ్‌సి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కె.పృథ్వీరాజ్‌, డాక్టర్‌ రాజా నాగభూషణం, డాక్టర్‌ ఎం.డానియల్‌రాజు, హెల్త్‌ సిబ్బంది పాల్గొన్నారు. నరసాపురం: నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో అవసరమని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పట్టణంలోని పార్క్‌ రోడ్డులో కొప్పర్తి వేణుగోపాలరావు కాంప్లెక్స్‌లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ పిల్లల జీవితాల సంపూర్ణ రక్షణకు పోలియో చుక్కలు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బర్రె వెంకటరమణ, కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పాలకోడేరు: పోలియోరహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ మహేశ్వరరావు అన్నారు. మండల కేంద్రమైన పాలకోడేరులోని పల్స్‌ పోలియో బూత్‌ను డిఎంహెచ్‌ఒతోపాటు డిఐఒ దేవ సుధాలక్ష్మి, జిల్లా ప్రోగ్రామింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ భావన పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ మహేశ్వరరావు మాట్లాడుతూ పల్స్‌ పోలియో నిర్వహణ తీరును అభినందించారు. మోగల్లులో ఇటుకల బట్టీలో పని చేస్తున్న కార్మికుల కుటుంబాల్లోని 38 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశామన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ రంగంనాయుడు, డాక్టర్‌ స్వర్ణ నిరంజన్‌, డాక్టర్‌ లీల లక్ష్మి, సిహెచ్‌ఒ సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

➡️