మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకే ‘ఆడుదాం ఆంధ్రా’

బహుమతుల ప్రదానంలో పివిఎల్‌
ప్రజాశక్తి – ఉండి
మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడమే ఆడుదాం ఆంధ్రా ముఖ్య ఉద్దేశమని డిసిసిబి ఛైర్మన్‌, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. ఉండి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా నియోజకవర్గస్థాయి ఆటల పోటీల ముగింపు ఉత్సవాల్లో పివిఎల్‌ పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు జిల్లాస్థాయిలో చక్కటి ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి విజేతలుగా నిలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే నగదు బహుమతికి రెండింతలు తాను అందించి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నానని పివిఎల్‌ చెప్పారు. అనంతరం ఉండి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన క్రికెట్‌, వాలీబాల్‌, ఖోఖో, బ్యాడ్మింటన్‌, కబడ్డీ తదితర పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జట్లకు రూ.35 వేల చెక్కును, జ్ఞాపికను, ప్రశంసా పత్రాలను, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్లకు రూ.15 వేల చెక్కును, జ్ఞాపికను ప్రశంస పత్రాలను, తృతీయ స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.ఐదు వేల చెక్కును, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, ఆకివీడు ఎంపిపి కఠారి జయలక్ష్మి కేశవరావు, రాష్ట్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ గులిపల్లి అచ్చారావు, పాలకోడేరు వైస్‌ ఎంపిపి ఆదాల లక్ష్మీతులసి, ఆకివీడు మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ పుప్పాల సత్యనారాయణ, ఎంపిటిసి సభ్యులు గిరడా రమణ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️