మాజీ ఎంఎల్‌ఎ శివ రూటెటు..?

Mar 13,2024 22:48

కుదిరితే వైసిపి.. లేకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి
ఇప్పటికే శివ కార్యాలయంలో టిడిపి ఫ్లెక్సీల తొలగింపు
కంచుకోటలో టిడిపికి ఎదురు దెబ్బేనా..!
రసవత్తరంగా ఉండి రాజకీయం
ప్రజాశక్తి – భీమవరం
టిడిపికి కంచుకోటగా పేరొందిన ఉండి నియోజకవర్గంలో ఆ పార్టీకి ఈసారి ఎదురుదెబ్బ తగలనుందా.. మాజీ ఎంఎల్‌ఎ వేటుకురి వెంకట శివరామ రాజు వైసిపి నుంచి పోటీ చేస్తారా.. లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా.. అసలు శివరామరాజు ఏ మేరకు ప్రభావం చూపుతారు.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే టిడిపి, వైసిపిల్లో ఎవరికి నష్టం అనే అంశాలపై జిల్లాలోనే విస్తృత చర్చ సాగుతోంది. ఇప్పటికే శివరామరాజు తన కార్యాలయంలో టిడిపి ఫ్లెక్సీ బ్యానర్లను తొలగించడం, ఆపై వచ్చే ఎన్నికల్లో కచ్ఛితంగా పోటీ చేస్తానని ప్రకటించంతో ఉండి రాజకీయం ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌గా మారింది. టిడిపి ఆవిర్భావం నుంచి ఉండి నియోజకవర్గంలో ఒక్కసారి మినహా మిగిలిన ఆరుసార్లు టిడిపినే గెలుపొందింది. శివ తిరుగుబావుటాతో ఈసారి కంచుకోటలో టిడిపికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 2009, 2014ల్లో టిడిపి ఎంఎల్‌ఎగా గెలుపొందిన శివ 2019లో అధిష్టానం ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. రామరాజు, శివల మధ్య తొలుత మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కాలక్రమంలో ఇరువురి మధ్య దూరం పెరిగింది. దీంతో వేర్వేరు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగడంతో టిడిపి శ్రేణుల్లోనూ ఒకింత గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే టిడిపికి చెందిన పలువురు వైసిపి గూటికి చేరారు. ఈ క్రమంలో టిడిపి అధిష్టానం సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ మంతెన రామరాజుకే మరోసారి టిక్కెట్‌ ప్రకటించ డంతో శివ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బహిరంగం గానే అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శివరామరాజు టిడిపికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు, వైసిపిలో చేరుతున్నట్లు ప్రచారం సాగింది. అయితే తాను వచ్చే ఎన్నికల్లో ఉండి నుంచి పోటీ చేస్తానని, ఏ పార్టీ తరఫున అనేది శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటిస్తాననడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శివ వైసిపి నుంచి పోటీ చేస్తారా లేక టిడిపి రెబల్‌ అభ్యర్థిగా బరిలో ఉంటారా అనే దానిపై చర్చ పెద్దఎత్తున సాగుతోంది. ఇప్పటికే వైసిపి అధిష్టానం సూచన మేరకు జిల్లాకు చెందిన కొంతమంది నేతలు శివరామరాజుతో మంతనాలు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇదే వాస్తవమైతే డిసిసిబి ఛైర్మన్‌, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నర్సింహరాజు పరిస్థితి ప్రశ్నార్థకమవుతోంది. పదేళ్లుగా పార్టీని ముందుకు నడిపిస్తున్న పివిఎల్‌ వచ్చే ఎన్నికల్లో తానే బరిలో ఉంటానని ఇటీవల ప్రకటించారు. ఏదేమైనా శివరామరాజు బరిలో నిలిస్తే టిడిపికే ఎక్కువ నష్టం చేకూరుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శివ అడుగులు ఎటువైపు అనేది శనివారం సాయంత్రం వరకూ వేచిచూడాల్సిందే.పోటీలో ఉంటా.. ఏ పార్టీ అనేది త్వరలో ప్రకటిస్తాఉండి మాజీ ఎంఎల్‌ఎ వి.శివరామరాజు కాళ్ల : వచ్చే ఎన్నికల్లో తాను ఉండి నియోజకవర్గం నుంచే పోటీలో ఉంటానని మాజీ ఎంఎల్‌ఎ వేటుకూరి వెంకట శివరామరాజు (కలవపూడి శివ) స్పష్టం చేశారు. భీమవరంలోని శివరామరాజు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా శివ స్వచ్చంద సంస్థ ద్వారా సేవలందిస్తూ 2009, 2014 ఎన్నికల్లో ఉండి ఎంఎల్‌ఎగా టిడిపి తరఫున గెలుపొందానని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో టిడిపి అధిష్టానం ఆదేశాల మేరకు తాను నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాయనన్నారు. తాను ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నానని, ఆ విషయం తెలిసి కూడా టిడిపి అధిష్టానం తనకు టిక్కెట్‌ కేటాయించకపోవడం దారుణమన్నారు. కనీసం తనతో సంప్రదించకుండానే సిట్టింగ్‌ ఎంఎల్‌ఎను అభ్యర్థిగా ప్రకటించడం కలిచివేసిందన్నారు. తాను పోటీలో ఉండాలని నియోజకవర్గంలో ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దీని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఉండి నుంచి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చానని తెలిపారు. ఏ పార్టీ తరఫున పోటీ చేస్తాననేది త్వరలోనే తెలియజేస్తానన్నారు.

➡️