పాల దంతాల పట్ల జాగ్రత్త అవసరం

స్టార్‌ డెంటల్‌ ఆసుపత్రి డాక్టర్‌ శ్రీహర్ష

ప్రజాశక్తి – ఏలూరు

పిల్లలకు ముందుగా వచ్చి ఊడిపోయే దంతాలను పాల దంతాలు, డెసిడ్యూమస్‌ దంతాలు అంటారని, వీటి పట్ల అశ్రద్ధ తగదని స్టార్‌ డెంటల్‌ ఆసుపత్రి డాక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. ఆయన ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఈ దంతాలు ఎలాగూ ఊడిపోయేవే అని చాలామంది అశ్రద్ధ చేస్తారని, అవి పాడైపోవడానికి, శాశ్వత దంతాలు, వాటి అమరికకు వచ్చే లోపాలే ప్రధాన కారణమని తెలిపారు. పాల దంతాలు చిన్న వయస్సులో ఆహారం నమలడానికి, శాశ్వత దంతాల అమరిక, దవడ ఎముక, నోటిలోని ఇతర కండరాలు సాధారణంగా పెరగడానికి, పిల్లల భాష, ఉచ్ఛరణ మెరుగ్గా ఉండడానికి దోహదపడతాయని తెలిపారు. చాక్లెట్లు, జిగురుగా ఉండే పదార్థాలు, చక్కెర ఎక్కువగా ఉండే చిరుతిండ్లు మొదలగు వాటికి పిల్లలను సాధ్యమైనంత వరకూ దూరంగా ఉంచాలని సూచించారు. లేకుంటే వాటి బలాన్ని తగ్గిస్తాయని తెలిపారు. ఆహారం తీసుకున్న వెంటనే నోటిని శుభ్రం చేసుకోవడం చిన్నతనం నుంచి అలవాటు చేయాలన్నారు. రాత్రి పడుకునే ముందు బ్రష్‌ చేయడం వారి దినచర్యలో భాగమయ్యేలా చూడాలన్నారు. చిన్న వయసులో పాల సీసాను పిల్లల నోటికి సరిగ్గా అందించకపోవడం, రాత్రంతా నోటిలో ఉంచేయడం వల్ల మొదటిగా దంతాలు పుచ్చడం ప్రారంభమవుతాయని తెలిపారు. దీన్ని బేబీ బాటిల్‌ కేరిస్‌ అంటారని తెలిపారు. దీనిద్వారా మిగతా అన్నింటికీ సోకి దంత సమస్యలు తీవ్రమవుతాయని వివరించారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లలకు పాల సీసాను పట్టించిన వెంటనే తాగునీరు, తడిపిన దూదితో నోటిని శుభ్రం చేయాలని డాక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు చిగుళ్లు మసాజ్‌ చేయడం ద్వారా ఎముక ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. నోట్లో వేలు పెట్టడం, నాలుకతో దంతాలను తోయడం, నోటితో గాలి పీల్చడం వంటివి ముందుగానే గుర్తించి వాటిని మాన్పించాలని సూచించారు. పిల్లల్లో పాల దంతాలు, శాశ్వత దంతాల అమరిక, వచ్చే సమయాలు ఒకేలా ఉండవన్నారు. సాధారణంగా శాశ్వత దంతాలు ఆరు లేదా ఏడు సంవత్సరాల వయస్సులో వస్తాయని, కొన్ని సందర్భాల్లో కొంతమందికి కొంచెం లేటుగా లేదా తొందరగా వస్తాయని తెలిపారు.పాల దంతాలు.. చికిత్స విధానాలు పిల్లలకు పుచ్చు దంతాలకు మొదటిగా ఫిల్లింగ్స్‌ చేయించుకోవాలని తెలిపారు. అవి ఇంకా ఎక్కువగా ఉంటే వాటికి రూట్‌కెనాల్‌ చేయించుకోవాలన్నారు. రూట్‌కెనాల్‌ చేసే స్టేజ్‌ దాటిపోయే స్థాయిలో ఉంటే దంతాలు తీయించుకుంటే స్పేస్‌ మెంట్‌మేనర్స్‌ వాడాలని తెలిపారు. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు చూసుకుని ఆరు నెలలకోసారి దంత వైద్యుడిని సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

➡️