నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు పూర్తిచేయాలి

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌

పోస్టల్‌ బ్యాలెట్‌, ఇటిపిబిఎస్‌ ఓట్ల లెక్కింపు నిబంధనలకు అనుగుణంగా సజావుగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ వశిష్ట కాన్ఫరెన్స్‌ హాల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌, సర్వీస్‌ ఓటర్ల ఇటిపిబిఎస్‌ (ఎలక్ట్రానికల్‌ ట్రాన్స్మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌) ఓట్ల లెక్కింపుపై జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ సంబంధిత నియోజకవర్గాల ఆర్‌ఒలకు, ఎఆర్‌ఒలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. తొలుత పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా లెక్కింపు ప్రక్రియను క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ఎంతో ముఖ్యమైందన్నారు. పొరపాట్లకు తావులేకుండా ఓట్ల లెక్కింపు పూర్తి చేయాలన్నారు. ఏడు నియోజకవర్గాలకు సంబంధించి 51 మంది ఎఆర్‌ఒలను ఓట్ల లెక్కింపు విధులకు కేటాయించామని, తొమ్మిది మంది ఎఆర్‌ఒలు పార్లమెంట్‌ నియోజకవర్గానికి, 42 మంది ఎఆర్‌ఒలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాల విధుల్లో పాల్గొంటారని తెలిపారు. జూన్‌ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఇవిఎంలలో ఓట్ల లెక్కింపు కంటే ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి టేబుల్‌కూ నలుగురు సిబ్బందిని నియమించడం జరుగుతుందని, వారిలో ఒక కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌, ఇద్దరు కౌంటింగ్‌ అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారని తెలిపారు. మూడు దఫాలుగా రాండమైజేషన్‌ ప్రక్రియ చేసిన అనంతరం కేబుల్‌ వారీగా సిబ్బంది కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. డిక్లరేషన్‌ వ్యాలీడ్‌ కాకపోతే పోస్టల్‌ బ్యాలెట్‌ ఇన్‌ వ్యాలీడ్‌ అవుతుందన్నారు. అలాగే ఓటర్‌ సిగేచర్‌, గెజిటెడ్‌ అధికారి సంతకం, లేకపోవడం, తదితర నిబంధనలను పాటించని సందర్భంలో కూడా ఓటు చెల్లనిదిగా పరిగణించబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, జిల్లా, గ్రామ సచివాలయాల అధికారి, జిల్లా ఎన్నికల శిక్షణ అధికారి కెసిహెచ్‌.అప్పారావు, ఎపి టూరిజం జెడి ఆచంట నియోజకవర్గం ఆర్‌ఒ వి.స్వామినాయుడు, నరసాపురం ఆర్‌డిఒ, ఆర్‌ఒ ఎం.అచ్యుత్‌ అంబరీష్‌, భీమవరం ఆర్‌డిఒ, ఆర్‌ఒ కె.శ్రీనివాసులు రాజు తదితర నియోజకవర్గాలకు చెందిన ఆర్‌ఒలు పాల్గొన్నారు.

➡️