మోడీ విధేయులు గెలిచి ఏం చేస్తారు? : సిపిఎం

Apr 3,2024 23:23

దుగ్గిరాల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య
ప్రజాశక్తి – దుగ్గిరాల, తాడేపల్లి :
మోడీ కాళ్ల బేరానికి వెళ్లిన వాళ్లు గెలిచి ఏం చేస్తారని, వారిని గెలిపించి ప్రయోజనం ఏమిటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.కృష్ణయ్య అన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, నల్ల చట్టాలు, ప్రజల మధ్య చీలికలు తెస్తూ దేశ ప్రజలను ముప్పతిప్పలు పెడుతున్న బిజెపికి, దానికి వత్తాసు పలుకుతున్న పార్టీలకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని సిపిఎం సీనియర్‌ నాయకులు జొన్నా శివశంకరరావు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన దుగ్గిరాలలో సిపిఎం విస్తృత సమావేశం, తాడేపల్లిలోని పలు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారు. దుగ్గిరాల సమావేశానికి ఎన్‌.యోగేశ్వరరావు అధ్యక్షత వహించగా కృష్ణయ్య మాట్లాడుతూ గత పదేళ్లలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 250 బిల్లులను వైసిపి, టిడిపిలు రెండూ బలపరిచాయని, వీరిద్దరూ మోడీ వద్ద పడిగాపులు కాస్తున్నారని విమర్శించారు. దేశంలో ప్రధాన సమస్యగా ఉన్న నిరుద్యోగం బిజెపి పాలనలో 65 శాతానికి పెరిగినదని తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ ఆ విషయంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. ఎలక్ట్రోరల్‌ బాండ్ల విషయంలో బిజెపి అవినీతి బట్టబయలైందని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని బిజెపి నాశనం చేసిందని, దేశాన్ని దివాళా తీయిస్తున్న బిజెపి ఓటమికి అందరూ కలిసి రావాలన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన సిఎఎను రద్దు చేయాలని, దీనిపై 14న మంగళగిరిలో చర్చ ఉంటుందని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ బిజెపిని ఓడించకపోతే దేశానికి రక్షణ లేదన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య చీలికలు తెస్తోందని, రాజ్యాంగంలోని లౌకిక విధానానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. రాజకీయాల్లో మతాలను జొప్పించకూడదనే విషయాన్ని విస్మరించిన ప్రధాని మోడీ ఆయనే స్వయంగా దేవాలయాలను ప్రారంభించడం ఏమిటని నిలదీశారు. వివాదాస్పద ప్రాంతంలో మసీదును కూల్చి దేవాలయం నిర్మించారని, రిజర్వేషన్లకు ఎసరు పెట్టేందుకు పూనుకున్నారని చెప్పారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారని, దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ కక్షలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం నిత్యం పోరాడుతోందన్నారు. మంగళగిరి నియోజకవర్గలో ప్రధాన సమస్యలపై పోరాడిందన్నారు. 70 శాతం కౌలు రైతులున్న ఈ ప్రాంతంలో కౌలు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, హై లెవెల్‌ ఛానల్‌, గుంటూరు ఛానల్‌ కోసం ప్రజా సంఘాలతోపాటు సిపిఎం ఉద్యమించిందని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 40 వేల కుటుంబాలు ఆక్రమణ ప్రాంతాల్లో ఇళ్లేసుకుని ఉన్నారని, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న 15 వేల మందికి పట్టాలు ఇప్పించామని తెలిపారు. లోకేష్‌ మంత్రిగా ఉన్నప్పుడు పట్టాలివ్వకుండా ఇప్పుడు మాత్రం వాగ్దానాలు చేస్తున్నారని ఎద్దేవ చేశారు. వైసిపి, టిడిపికి ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లేనని ప్రజలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్‌, వామపక్షాల మద్దతుతో ఇండియా బ్లాక్‌ తరుపున పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకర్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జొన్న శివశంకర్‌, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇ.అప్పారావు, ఎన్‌.భావన్నారాయణ, నాయకులు బి.శ్రీనివాసరావు, మండల కార్యదర్శి జె.బాలరాజు, నాయకులు బి.శ్రీనివాసరావు, ఎం.శివసామిరెడ్డి, షేక్‌ హుస్సేన్‌, కె.బాబూప్రసాద్‌, వై.బ్రహ్మేశ్వరరావు, సిహెచ్‌ పోతురాజు, జి.యోహాను, బి.అమ్మిరెడ్డి పాల్గొన్నారు.తాడేపల్లిలోని ఉండవల్లి ప్రాంతంలో టెలిఫోన్‌ కాలనీ, ఎస్టీ కాలనీల్లో సమావేశాలు నిర్వహించగా జొన్న శివశంకరరావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత సిపిఎం మాజీ ఎమ్మెల్యే నిమ్మగడ్డ రామమోహన్‌రావుకు దక్కుతుందన్నారు. గతంలో మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక, కొలనుకొండ, కుంచనపల్లి, వడ్డేశ్వరం, ప్రాతూరు, కాజా, చినకాకాని, నూతక్కి గ్రామాల్లో సర్పంచులుగా సిపిఎం నేతలు ఎన్నికై గ్రామాల అభివృద్ధికి మారుపేరుగా నిలిచారని చెప్పారు. ప్రజా సమస్యలపై సిపిఎం ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో 20 వేల మంది పేదలతో వివిధ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, ఇల్లు వేయించి, ఆ ఇళ్లను నిలబెట్టిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ధరల భారాలు వేసినప్పుడల్లా ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సిపిఎం ఆందోళనలు నిర్వహించిందన్నారు. కరోనా కష్టకాలంలో సిపిఎం కార్యాలయాలన్నీ కరోనా బాధితుల కోసం క్వారంటైన్‌ కేంద్రంగా చేసి సిపిఎం కార్యకర్తలు ప్రాణాలకు తెగించి వాలంటీర్లుగా పని చేశారని గుర్తు చేశారు. కరోనా పేషెంట్లు ఉన్న ఇంటింటికి వెళ్లి ఆహారం అందజేశారని చెప్పారు. సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి మాట్లాడుతూ అభివృద్ధికి మారుపేరుగా నిలిచే సిపిఎం అభ్యర్థిని మంగళగిరి నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పంపించడం ద్వారానే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై నిస్వార్ధంగా పనిచేస్తున్న కమ్యూనిస్టుల గెలుపు అభివృద్ధికి మలుపని అన్నారు. సమావేశాల్లో నాయకులు యు.వెంకటేశ్వరరావు, కె.జగదీశ్వర్‌రెడ్డి, ఎస్‌.వెంకటనారాయణ, ఎస్కే ఎర్రపీరు, ఇమ్మానియేల్‌, రాజు, శ్రీనివాసరెడ్డి, టి.బక్కిరెడ్డి, కె.రామకృష్ణ, పార్థసారథి, బోస్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️