కొటియా ఓటర్లు ఎటువైపు?

May 10,2024 20:47

ఒకేరోజు ఒడిశా, ఎపి రాష్ట్రాల పోలింగ్‌

సందిగ్ధంలో కొటియా ప్రాంత గిరిపుత్రులు

ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఇరురాష్ట్రాల కసరత్తు

ప్రజాశక్తి – సాలూరు : రానున్న ఎన్నికల్లో వివాదాస్పద కొటియా గ్రామాల ఓటర్లు ఎటువైపు ఓటు వేస్తారనేది అంతు చిక్కడం లేదు. ఒడిశా, ఆంధ్రా రాష్ట్రాలకు ఒకేరోజున అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నెల 13వ తేదినే ఎపిలోని సాలూరు అసెంబ్లీ, అరకు పార్లమెంటు నియోజకవర్గాలు, ఒడిశాలోని పొట్టంగి అసెంబ్లీ, కొరాపుట్‌ ఎమ్‌పి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1996లో తొలిసారి ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అప్పుడు ఇదే విధంగా రెండు రాష్ట్రాలకు ఒకేరోజు పోలింగ్‌ జరగడంతో రెండు రాష్ట్రాల అధికారులు పరస్పర అవగాహనతో పోలింగ్‌ నిర్వహించారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఒడిశా, ఎపి రాష్ట్రాల మధ్య కొటియా గ్రామాల విషయంలో వివాదం ముదురుతోంది. కొటియా గ్రామాలు ఒడిశాకు చెందినవేనని ఆ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారులు మొండివాదనకు దిగుతున్నారు. ఆ గ్రామాల్లో రోడ్లు, పాఠశాల భవనాలు నిర్మించారు. ఉపాధి కల్పనా పథకాలు అమలు చేస్తున్నారు. కొటియా గ్రామాల గిరిజనులను మచ్చిక చేసుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మెజారిటీ గ్రామాల గిరిజనులు మాత్రం ఆంధ్రా వైపు మొగ్గు చూపుతుండడంతో ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధులకు మింగుడు పడటం లేదు. 2022లో ఎపిలో జరిగిన ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల సందర్భంగా కొటియా గ్రామాల ఓటర్లను పోలింగ్‌కు రాకుండా ఒడిశా అధికారులు, పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే ఆ గ్రామాల గిరిజనులు ఒడిశా అధికారులు, పోలీసుల నిర్బంధాన్ని ఎదురించి ఎపి స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్నారు. నేరెళ్లవలసలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల వద్దకు కొటియా ఓటర్లు రాకుండా ఒడిశా అధికారులు, పోలీసులు ఎక్కడికక్కడ రోడ్లపై బారికేడ్లను ఏర్పాటుచేశారు. వాటిని దాటుకుని గిరిజన ఓటర్లు పోలింగ్‌కు హాజరయ్యారు. ఆ ఎన్నికల సందర్భంగా నేరెళ్లవలసలో రెండు రాష్ట్రాల పోలీసులు పెద్దఎత్తున మొహరించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉప్పు నిప్పులా వాతావరణం నెలకొంది. ఇప్పటికీ ఎపికి చెందిన వైద్య సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు కొటియా గ్రామాల్లో సేవలందించేందుకు వెళ్తే ఒడిశా అధికారులు, పోలీసులు అడ్డుకున్న సంఘటనలు ఎదురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం గంజాయి భద్రలో గిరిజనుల ఇళ్లకు విద్యుత్‌ మీటర్లు వేయడానికి విద్యుత్‌ సిబ్బంది వెళితే కొటియాలోని ఒడిశా పోలీసులు అధికారులు అడ్డగించారు. సందర్భం వచ్చినప్పుడల్లా ఒడిశా అధికారులు పోలీసులు ఎపి ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి సాధారణ, అసెంబ్లీ ఎన్నికలొచ్చాయి. ఒకేరోజు రెండు రాష్ట్రాల కు పోలింగ్‌ జరుగనుంది. దీంతో ఎటు ఓటు వేయాలనే ది కొటియా గ్రామాల ఓటర్లను వేధిస్తున్న ప్రశ్న.కొండలపైనుంచి కిందకు దించుతారా? ఎన్నికల నేపథ్యంలో కొటియా గ్రామాల ఓటర్లను కొండల మీద నుంచి పోలింగ్‌ ముందు రోజు కిందకు దించి మరుసటి రోజు పోలింగ్‌లో పాల్గొనేలా మన్యం జిల్లా అధికారులు చేస్తారా? లేదా అనేది అంతుచిక్కడం లేదు. ఈ గ్రామాల విషయంలో అవసరమైతే ఓటర్లను కిందకు తీసుకొచ్చి పోలింగ్‌ కేంద్రాల సమీపంలో వసతి, భోజన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖలాలు లేవు. ఎపి ఎన్నికలకు సంబంధించి కొటియా గ్రామాల ఓటర్ల కోసం నేరెళ్లవలస, శిఖపరువు, కురుకుట్టి గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 21 గ్రామాలకు సంబంధించిన 2500 ఓటర్లు ఈ మూడు కేంద్రాల్లో ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే ఒడిశా ప్రభుత్వం మాత్రం కొటియా గ్రామాల్లోనే పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. పట్టుచెన్నూరు, పగుల చెన్నూరు గ్రామాలకు పట్టు చెన్నూరులోనే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసింది. కొటియా, ముడకారు, రణసింగి గ్రామాల్లో కూడా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొటియా గ్రామాల ఓటర్లకు దగ్గరలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఒడిశా అధికారులు వారికి అనుకూల వాతావరణం ఏర్పాటు చేశారు. స్థానిక ఒడిశా ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఆ విధంగా పోలీసులు కొటియా ఓటర్లపై ఒత్తిడి పెంచే అవకాశాలు మెండు గా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమ వుతోంది.పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తారా?27 ఏళ్ల క్రితం ఒడిశా, ఎపి రాష్ట్రాలకు ఒకేరోజు పోలింగ్‌ జరగడంతో అప్పుడు రెండు జిల్లాల అధికారులు ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహించారు. రెండు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌లో కొటియా గ్రామాల ఓటర్లు ఓటు వేశారు. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని రెండు రాష్ట్రాల అధికారులు కొనసాగిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా వుంది. ఒడిశా, ఎపి రాష్ట్రాల మధ్య దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి సమన్వయం, సుహద్భావ వాతావరణం ఇప్పుడు కనిపించడం లేదు. ప్రతి దానికీ ఒడిశా అధికారులు పోలీసులు, ప్రజాప్రతినిధులు కయ్యానికి కాలు దువ్వుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల అధికారులు, పోలీసుల మధ్య చర్చలు జరిగాయి. కొటియా ఓటర్లు స్వేచ్ఛ గా నిర్భయంగా ఓటు వినియోగించుకునేలా చూడాలని ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. పార్వతీపురం మన్యం, కొరాపుట్‌ జిల్లాల అధికారులు కొటియా గ్రామాల వ్యవహారంపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు. ఓటు అనేది రాజకీయ పార్టీలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఆ పార్టీల నాయకులు ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. గతంలోనూ ఒడిశా రాజకీయ పార్టీల ఒత్తిళ్ల వల్లే ఒడిశా అధికారులు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దూకుడుగా వ్యవహరించి ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యారు. గత అనుభవాలను దష్టిలో పెట్టుకొని ఒడిశా అధికారులు, పోలీసుల వైఖరి ని అంచనా వేయడం అంత సులువు కాదు. మన్యం జిల్లా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

➡️