ఎమ్‌పిగా పట్టం ఎవరికో..!

May 19,2024 20:51

ప్రజాశక్తి- చీపురుపల్లి : పార్లమెంటు ఎన్నికలలో గెలుపుపై అటు వైసిపి ఇటు టిడిపి పార్టీలు ధీమాగా ఉన్నాయి. 2019లో రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలలో ఏకంగా 22 స్థానాలను కైవసం చేసుకొని మంచి ఉత్సాహంతో ఈ సారీ కూడా తమదే గెలుపు అనే ధీమాతో వైసిపి భావిస్తోంది. ఈ ఐదేళ్లు తాము చేసినన్ని సంక్షేమ పథకాలు, అభివృధ్ది ఏ రాష్ట్రంలోనూ చేయలేదని, అభివృధ్ది అంటూ జరిగిందంటే తమ హయాంలోనే జరిగిందని వైసిపి ప్రచారం చేసుకుంటూ పోయింది. అధికారం కోల్పోయి ఐదేళ్లు గడిచిన సందర్బంగా అధికార పార్టీ వైఫల్యాలను ఎండ గడుతూ జగన్‌ పాలనలో రాష్ట్రం అదోగతి పాలైందంటూ ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, జనసేన పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తూ వైసిపిపై తిరుగుబాటు చేసి ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు సర్వశక్తులు ఒడ్డాయి. దీనికి తోడు కేంద్రంలో ఉన్న బిజెపిని కలుపుకొని కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో అధికారం తమకిస్తే ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృధ్ది చేస్తామని టిడిపి కూటమి ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఈ రెండు పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ప్రచారాన్ని హోరెత్తించాయి. ఈ నేపధ్యంలో ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారనే విషయమై ఉత్కంఠ నెలకొంది.విజయనగరం పార్లీమెంటు వైసిపి అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్‌ 2019లో సుమారు 44 వేల మెజార్టీతో టిడిపి అభ్యర్ధి పూసపాటి అశోకగజపతిరాజుపై గెలుపొందారు. అయితే పార్లమెంటుకు గెలిచిన అభ్యర్ధులెవరూ నియోజకవర్గంలోని ప్రజలను పట్టించుకోలేదని తాను గెలిచినప్పటి నుంచి ప్రజలలోనే నిరంతరం ఉంటూ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు అభివృధ్దికి కృషి చేసానని ఎమ్‌పి బెల్లాన చంద్రశేఖర్‌ తన ప్రచారంలో ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. చంద్రబాబునాయుడి ఆశీస్సులతో తాను ఎంపిగా పోటీ చేస్తున్నానని, టిడిపి అధికారంలోనికి వస్తే చేపట్టబోయో సంక్షేమ పథకాలు, అభివృద్దిని చెబుతూ టిడిపి అభ్యర్ధి కలిశెట్టి అప్పలనాయుడు ప్రజలలో విస్తారంగా ప్రచారం నిర్వహించాడు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని తద్వారా విజయనగరం పార్లమెంటు అభివృధ్ది చేసేందుకు అవకాశం ఉంటుందని కలిశెట్టి ముమ్మర ప్రచారం చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందు సర్వశక్తులూ ఒడ్డారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గంలో రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, విజయనగరం, నెల్లిమర్ల నియోజక వర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజక వర్గాలు కలుపుకొని ఏడు నియోజక వర్గాలున్నాయి. ఈ ఏడు నియోజక వర్గాలలో మొత్తం ఓటర్లు 15,67,039 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 7,85,642 మంది, మహిళా ఓటర్లు 7,81,373 మంది ఉన్నారు. 12,84,876 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 6,36,609 మంది కాగా 6,48,267 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే పార్లమెంటు పరిధిలో కూడా మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరంతా ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలకు ఆకర్షితులై ఓటు తమకే వేశారని వైసిపి వర్గాలు చెబుతుండగా, చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలు నచ్చి తమకే ఓటు వేశారని కూటమి నాయకులు అంచనా వేసుకుంటున్నారు. అయితే ఈ సారి ఎవరికి పట్టం కట్టారో జూన్‌ నాలుగు వరకూ వేచి చూడాల్సిందే.

➡️