సాలూరు పోరులో విజేతలెవరో?

May 10,2024 20:52

ప్రజాశక్తి – సాలూరు : సాలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నిక రసదవత్తరంగా మారింది. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న రాజన్నదొర ఐదుసారి కూడా విజయం సాధించేందుకు తహ తహలాడుతున్నారు. మూడుసార్లు పోటీ చేసి ఓటమి చెందిన టిడిపి అభ్యర్థి సంధ్యారాణి ఈసారైనా తనకు సానుభూతి కలిసొస్తుందని భావిస్తున్నారు. మరోవైపు ఇండియా వేదిక బలపర్చిన కాంగ్రెస్‌ అభ్యర్థి పుష్పారావు పోటీలో ఉన్నారు. టిడిపి అభ్యర్థి సంధ్యారాణి వైసిపి అభ్యర్థి రాజన్నదొరను ఢకొీట్టి విజయం సాధిస్తానన్న అతి విశ్వాసం ఆమెలో కనిపిస్తోంది. తన సొంత పార్టీనాయకులను దూరం పెడుతుండడంతో, అధిష్టానం పెద్దలు చెప్పినా అసమ్మతి నాయకులను కలుపుకుపోయే ప్రయత్నం చేయకపోవడం ఆమెకు మైనస్‌లుగా కనిపిస్తున్నాయి. మక్కువ మండలానికి చెందిన సీనియర్‌ నాయకులు పెంట తిరుపతిరావును ఇంతవరకూ ఆమె కలుపుకు పోయే ప్రయత్నం చేయలేదు. టిడిపి అగ్రనేతలు కొద్దిరోజుల క్రితం విశాఖపట్నంలో టిడిపి అభ్యర్థి సంధ్యారాణి, సీనియర్‌ నాయకులు పెంట తిరుపతిరావుతో చర్చలు నిర్వహించారు. ఇద్దరి మధ్య సమన్వయం కుదర్చడానికి ప్రయత్నించారు. సీనియర్‌ నాయకులు పెంట తిరుపతిరావు ఇంటికి వెళ్లి మండలంలో ఆధిక్యత కోసం ఆయన సహకారం తీసుకోవాలని పార్టీ పెద్దలు సూచించారు. పార్టీ పెద్దల సలహా మేరకు ఆమె తిరుపతిరావు నివాసానికి వెళ్లారు. రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కలిసి పని చేద్దామనుకున్నారు. కానీ ఆయన్ను ఉద్దేశపూర్వకంగానే దూరం పెడు తున్న తీరు టిడిపి నాయ కులను సైతం విస్మయానికి గురి చేస్తోంది. మండలంలో మాజీ ఎంపిపి స్థాయి నాయకుడు, బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడ్ని దూరం పెడు తుండడం చర్చ నీయాంశ మవుతోంది. తిరుపతిరావు విషయం లోనే కాదు సాలూరు మండలానికి చెందిన మరో సీనియర్‌ నాయకుడు చోడవరపు గోవిందరావు విషయం లోనూ ఆమె అదే వైఖరి ప్రదర్శిస్తున్నారు. పార్టీ ఇన్‌ఛార్జిగా ఆమె తయారు చేసుకున్న నాయకులను తప్ప మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌ గ్రూపునకు చెందిన నాయకులెవరినీ విశ్వసించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రాజన్నదొరపై కూడా కొంతమంది నాయకుల్లోనూ అసంతృప్తి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయన నాలుగుసార్లు ఎన్నికైనప్పటికీ, ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన సంక్షేమశాఖా మంత్రి పదవులు చేపట్టినప్పటికీ గిరిజన సమస్యలు పెద్దగా పరిష్కరించలేదన్న వాదన గిరిజనుల్లో ఉంది. అయినప్పటికీ గడప గడపకూ కార్యక్రమం ద్వారా ఆయన నియోజకవర్గం అంతటా చుట్టుముట్టారు. మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధితో తన గెలుపు నల్లేరుపై నడకేనని రాజన్నదొర భావిస్తున్నారుర. కీలక వ్యవహారాలకు భంజ్‌దేవ్‌ దూరం టిడిపి ఆవిర్భావం నుంచి యువ నాయకుడిగా అడుగు పెట్టి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్‌పి భంజ్‌ దేవ్‌ నేటి ఎన్నికల్లో అంతా చురుగ్గా పనిచేయడం లేదన్న చర్చ జరుగుతోంది. ఆయన నివాసంలో నాయకులు, కార్యకర్తల సందడి లేదు. ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ నుంచి ప్రచారం వరకు ఆయన పాత్ర నామమాత్రంగానే ఉన్నారు. భంజ్‌దేవ్‌తో పార్టీ అభ్యర్థి సంధ్యారాణి అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ నియోజకవర్గంలో చూసుకుంటే భంజ్‌ దేవ్‌ను గాని,ఆయన అనుచరులను గాని సంధ్యారాణి నమ్మడం లేదన్న చర్చ కేడర్‌లో జరుగుతోంది. రానున్న రెండు రోజుల్లో తాజా పరిణామాలు పార్టీని ఎటు తీసుకెళతాయోనని కార్యకర్తలు అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

➡️