మన్యం జిల్లాపై మంత్రి పట్టు బిగిస్తారా?

Jun 24,2024 21:42

ప్రజాశక్తి – సాలూరు : పార్వతీపురం మన్యం జిల్లాపై గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పట్టు బిగిస్తారా? లేదా? అన్న చర్చ మొదలైంది. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సాలూరు ఎమ్మెల్యే గుమ్మిడి సంధ్యారాణికి సిఎం చంద్రబాబునాయుడు కీలకమైన రెండు శాఖలు అప్పగించారు. గిరిజన సంక్షేమ, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా సంధ్యారాణి మన్యం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత ఆమె మూడో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. గత వైసిపి ప్రభుత్వం హయాంలో ఇద్దరు ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, రాజన్నదొర గిరిజన సంక్షేమ శాఖ మంత్రులుగా పని చేశారు. వీరిద్దరూ జిల్లా రాజకీయాలను శాసించే స్థాయిలో పని చేయలేదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఆవిర్భవించిన పార్వతీపురం మన్యం జిల్లాను నడిపించే స్థాయిలో వైసిపి మంత్రులు పని చేయలేదు. అప్పటి ఉమ్మడి జిల్లా అగ్రనాయకుల కనుసన్నల్లో వారు పని చేశారనే ప్రచారం జరిగింది. జిల్లా అధికార యంత్రాంగంపై కూడా గతంలో పని చేసిన మంత్రులిద్దరూ పట్టు సాధించిన దాఖలాల్లేవు. జిల్లా స్థాయి అధికారులతో నిర్వహిం చిన సమీక్ష సమావేశా ల్లోనూ గిరిజన మంత్రుల ఆధిపత్యం ఎక్కడా కనిపించలేదు. ఒకవిధంగా చెప్పాలంటే వైసిపి ప్రభుత్వ హయాంలో గిరిజన సం క్షేమ శాఖ మంత్రు లిద్దరూ వారి నియోజక వర్గాలకే పరిమిత మయ్యారు. ఇలాంటి పరిస్థి తుల్లో మన్యం జిల్లా నుంచి గుమ్మడి సంధ్యారాణి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆమె కీలకపాత్ర పోషించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విజయనగరం జిల్లా నుంచి మంత్రిగా ఎంపికైన కొండపల్లి శ్రీనివాస్‌ కంటే సంధ్యారాణి సీనియర్‌ నాయకులు కావడంతో ఉమ్మడి జిల్లా రాజకీయాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యురాలిగా, అరుకు పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలిగా ఆమెకు అనుభవం ఉంది. మన్యం జిల్లాలో ఇప్పుడున్న టిడిపి ఎమ్మెల్యేలందరి కంటే మంత్రి సంధ్యారాణి సీనియర్‌ నాయకురాలు కావడం, గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఆమెకు కలిసొచ్చే అంశాలుగా వున్నాయి. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే. దీంతో మన్యం జిల్లాలో మంత్రి సంధ్యారాణి కీలకపాత్ర పోషించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లా అధికారయంత్రాంగంపై కూడా ఆమె పట్టు బిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఐటిడిఎకి జవసత్వాలు తీసుకొస్తారా?మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత పార్వతీపురం ఐటిడిఎ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఒకరకంగా చెప్పాలంటే వైసిపి ప్రభుత్వం ఐటిడిఎని ఉత్సవ విగ్రహంగా మార్చేసింది. గిరిజన సమస్యల పరిష్కారానికి కనీస స్థాయిలో నిధులు ఖర్చు చేయగలిగిన ఆర్థిక స్తోమత కూడా లేని పరిస్థితి ఏర్పడింది. గడచిన ఐదేళ్లలో ఐటిడిఎ పాలకవర్గ సమావేశాలు ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో గిరిజన సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఏమేరకు ఐటిడిఎకి పూర్వవైభవం తీసుకొస్తారనే చర్చ జరుగుతోంది.

➡️