దేశ రక్షణకు ఇండియా వేదికను గెలిపించండి

May 10,2024 18:29

బిజెపి దాని పొత్తు తొత్తు పార్టీలను సాగనంపండి

నేను కోరుకునే మనుషులకు ఒక్కసారి అవకాశమివ్వండి

కేంద్ర మాజీ మంత్రి వైరచర్ల కిషోర్‌ చంద్ర దేవ్‌

ప్రజాశక్తి – కురుపాం :  బిజెపి పాలనలో దేశానికి, ప్రజలకు ప్రమాదమని, కావున దేశ రక్షణకు ఇండియా వేదిక బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ పిలుపునిచ్చారు. సిపిఎం అరకు పార్లమెంట్‌ అభ్యర్థి పి.అప్పలనర్సకు, కురుపాం అసెంబ్లీ అభ్యర్థి మండంగి రమణకు తాను మద్దతు ప్రకటిస్తున్నానని, ప్రజలు కూడా తాను కోరుకునే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. శుక్రవారం కురుపాం కోటలో సిపిఎం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి ఎన్‌డిఎ కూటమిలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని, తాను రాజకీయాలు చేయడానికి రాజకీయాలలో లేనని, సిద్ధాంతపరమైన రాజకీయాలు తనకు అవసరమని చెప్పారు. తనకు పదవులు అవసరం లేదన్నారు. బిజెపి మత విధ్వంసాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నదన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత పెద్దనోట్లు రద్దుచేసి పేదలను అనేక ఇబ్బందులకు గురిచేసిందని, పేద మధ్యతరగతి ప్రజలు చితికిపోయారని గుర్తు చేశారు. బిజెపి ప్రభుత్వం ఆదివాసులను అడవులకు, అటవీ ఫలసాయాలకు దూరం చేసి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నదని అన్నారు. ఇందుకోసం గిరిజనులకు రక్షణగా ఉన్న చట్టాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. గిరిజన విద్యార్థుల కోసం ఏకలవ్య పాఠశాలలను తను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు నిధులు మంజూరు చేసి నిర్మించామన్నారు. బొబ్బిలి, పార్వతీపురం, మానాపురం రైల్వే బ్రిడ్జిలను అప్పటి రైల్వే శాఖ మంత్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌ దగ్గరికి వెళ్లి తానే స్వయానా మంజూరు చేయించి తీసుకొచ్చానని, అటువంటిది మోడీ, చంద్రబాబు వారు చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. ఇందిరాగాంధీ పాలన సమయంలో చేసిన పనులు కూడా వీరే చేసినట్టు చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో గుమ్మడిగెడ్డ మినీ రిజర్వాయకు రెండుసార్లు ప్రణాళిక తయారు చేసి అసెంబ్లీకి పంపిస్తే తిరస్కరించారని, వైసిపి ప్రభుత్వం వచ్చాక ఉప ముఖ్యమంత్రి చేసిన పుష్పశ్రీవాణి ఈ పనులు చేయలేకపోయారని అన్నారు. గ్రామాల్లో తిరుగుతున్నామంటే సరిపోదని, పనులు ఏమి జరిగాయో తెలుసుకోవాలని అన్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలు ఇచ్చి ఎన్నికల అనంతరం వాటిని తుంగలో తొక్కుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రులపై సైతం లేనిపోని కేసులు పెట్టి కక్షపూరిత రాజకీయాలతో అరెస్టులు చేస్తున్నారని, సామాన్య ప్రజలకు మోడీషా ప్రభుత్వంలో ఏమి న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. అటువంటి పార్టీకి మన రాష్ట్రంలో వైసిపి, టిడిపి పోత్తులుగా కొనసాగుతున్నాయని తెలిపారు. మన సమస్యలు పరిష్కరించాలంటే తాను కోరుకున్న ఇండియా కూటమి అభ్యర్థులైన రమణ, అప్పలనర్స యొక్క సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాను కోరుకునే మనుషులకు ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.సుబ్బరావమ్మ, సీనియర్‌ నాయకులు ఎం, కష్ణమూర్తి, మన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు తదితరులు పాల్గొన్నారు.

➡️