ఇప్పటికీ వర్తించే లెనిన్‌ దార్శనికత

Jan 23,2024 07:18 #Editorial

లెనిన్‌ అనేక కీలకమైన సైద్ధాంతిక, ఆచరణాత్మక రచనలు అందించాడు. అవేమంటే, కార్మిక వర్గ పార్టీ సవివర సూత్రీకరణలు వ్యవస్థాగత నిర్మాణం, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలు, విప్లవ దశలు, సామ్రాజ్యవాద గొలుసులో అత్యంత బలహీనమైన లింకును తెగ్గొట్టడం, ఒక దేశంలో సోషలిజం సిద్ధాంతం అభివృద్ధి స్థిరీకరణ, అందులో భాగమైన నూతన ఆర్థిక సిద్ధాంతం, పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాదంగా పెరగడం, కొమింటర్న్‌ ద్వారా కమ్యూనిస్టుల అంతర్జాతీయ కృషి ప్రాధాన్యత, అతివాద సంస్కరణవాద పెడధోరణులపై పోరాటం, పార్టీ కార్యక్రమాన్ని ప్రజలను ఉత్తేజపర్చే నినాదాలుగా మలచి భూమి, శాంతి, ఆహారం వంటి పిలుపివ్వడం చూస్తాం. సోవియట్లకే సమస్త అధికారం అన్న పిలుపు ఆఖరుదైనా చాలా ముఖ్యమైందే.

                కారల్‌ మార్క్స్‌ 30వ వర్ధంతి సందర్భంగా 1913లో లెనిన్‌ ఒక వ్యాసం రాశాడు. బోల్షివిక్‌ పార్టీ నడిపే ‘ప్రాశ్చేవెనియే’ (చైతన్యం) పత్రికలో ఆ వ్యాసం ప్రచురితమైంది. ‘మార్క్సిజం మూడు మూలాలు, మూడు అంతర్భాగాలు’ అన్న ఆ వ్యాసం చాలా ప్రసిద్ధమైంది. లెనిన్‌ సూత్రీకరణల్లో ఒక శాశ్వత సత్యంలా స్థిరపడిపోయింది. ‘మార్క్సిజం సర్వశక్తివంతమైంది. ఎందుకంటే అది సత్యం గనక” అనే ఆయన ప్రసిద్ధ ఉల్లేఖన ఈ వ్యాసంలోనిదే. లెనిన్‌ శత వర్ధంతి సందర్భంలో మనం ఆయన గురించి కూడా తప్పక చెప్పుకోవలసి వుంటుంది.

ఇంకా 30 ఏళ్లు కూడా నిండని లెనిన్‌ ప్రచురించిన ఒక సూత్రీకరణను మనం గుర్తు చేసుకోవాలి. ”మేము మార్క్స్‌ సిద్ధాంతాన్ని అనేది సర్వసంపూర్ణమైన అనుల్లంఘనీయమైనదిగా పరిగణించం. అందుకు భిన్నంగా మేము దాన్ని ఒక శాస్త్రానికి పునాది రాయి వేసిందని మాత్రమే భావిస్తాం. సోషలిస్టులు జీవిత వేగంతో పోటీ పడాలంటే ఆ విజ్ఞానాన్ని అన్ని దిశల్లోనూ అబివృద్ధి చేయవలసిందే. మరీ ముఖ్యంగా రష్యన్‌ సోషలిస్టులు మార్క్స్‌ సిద్ధాంతాన్ని స్వతంత్రంగా విస్తృతపర్చడం అత్యంత అవసరం. ఎందుకంటే ఈ సిద్ధాంతం సాధారణ మార్గదర్శక సూత్రాలను మాత్రమే చెబుతుంది. ఆ సూత్రాలను ఇంగ్లాండులో అన్వయించే తీరు ఫ్రాన్స్‌కు భిన్నంగా వుంటుంది. ఫ్రాన్స్‌లో జర్మనీకి భిన్నంగా, జర్మనీలో రష్యాకు భిన్నంగా వాటిని అన్వయిం చాల్సి వుంటుంది. అందువల్ల మా పత్రికలో సైద్ధాంతిక సమస్యలపై వ్యాసాలకు సంతోషంగా చోటు కల్పిస్తాము. వివాదాస్పద అంశాలను నిర్మొహమాటంగా చర్చించ వలసిందిగా కామ్రేడ్లను ఆహ్వానిస్తున్నాము” (లెనిన్‌ రచనల కూర్పు, నాల్గవ సంపుటం, పేజీలు 211, 212).

పై ఉల్లేఖన లెనిన్‌ 1998-99 పార్టీ కార్యక్రమం లోనిది. 1913లో కారల్‌ మార్క్స్‌కు నివాళిగా రాసిన వ్యాసంలోని వాక్యాలు 1917 అక్టోబర్‌ విప్లవానికి కేవలం నాలుగేళ్ల ముందటివి. మొదట చూడగానే ఇవేవో వైరుధ్య భరితంగా కనిపించవచ్చు. మార్క్సిజం సత్యం గనకే సర్వశక్తివంతమైంది అని 1913 వ్యాసం నొక్కిచెబుతోంది. మార్క్స్‌ సిద్ధాంతంలో భాగంగా కారల్‌ మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌లు రూపొందించిన ప్రతిదీ వేదవాక్యం లాంటిదనే భావనకు ఇది దారితీయొచ్చు.

మరోవైపున లెనిన్‌ ఆరవ సంపుటంలోంచి తీసుకున్న రెండవ ఉల్లేఖనం ‘మార్క్స్‌ సిద్ధాంతం సర్వసంపూర్ణమైనదీ అనుల్లంఘనీయమైనదీ కాదు అంటున్నది. ఈ వాక్యాలను ఊరికే పైపైన చూస్తే కేవలం పదిహేనేళ్ల కాల వ్యవధిలోనే లెనిన్‌ పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యానాలు చేశాడనిపించవచ్చు. లెనిన్‌ సైద్ధాంతికంగా అస్తిమితంగా వున్నాడని కూడా ఆరోపించవచ్చు.

ముందు నిలిచిన లెనిన్‌

                అయితే గతితర్క సిద్ధాంతం, ఆచరణ బాగా తెలిసిన వారెవరైనా అలాంటి విమర్శతో ఏకీభవించరు. మార్క్స్‌ సూత్రీకరణలూ వాటికి అనుబంధంగా చెప్పినవి కూడా గతితార్కిక చారిత్రిక భౌతికవాదం పరిణామశీలతను, శాస్త్రీయ స్వభావాన్ని నొక్కి చెప్పేవే.

వాస్తవం ఏమంటే మార్క్స్‌ సిద్ధాంతం ఒక శాస్త్రానికి పునాదిరాయి మాత్రమే. సోషలిస్టులు, కమ్యూనిస్టులు ఆ పునాదిని అన్ని దిశల్లోనూ నిరంతరాయంగా అభివృద్ధిపరచాల్సి వుంటుంది. ఒక్కో దేశానికి అనుగుణంగా మార్క్స్‌ సిద్ధాంతాన్ని విశదపర్చుకోవడం రష్యన్‌ విప్లవానికి చాలా అవసరమని అదే విభాగంలో లెనిన్‌ గట్టిగా చెప్పాడు. ఆ విధంగా సైద్ధాంతిక అవగాహనకు పదును పెట్టుకోవడానికే మన పత్రికలో నిర్మొహమాటంగా చర్చలు జరగాలనీ, వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించాడు. ఈ విధమైన సైద్ధాంతిక సాహసం, విశ్వాసం వున్నందువల్లనే లెనిన్‌ ఆయన నాయకత్వంలోని బోల్షివిక్‌ పార్టీలు రష్యాలో సైన్యం సహకారంతో కార్మిక, కర్షక కలయికతో విప్లవానుకూల పరిస్థితులను సద్వినియోగపర్చుకోగలిగారు. ఆ విధంగానే అక్టోబరు విప్లవం జయప్రదం కాగలిగింది. లెనిన్‌ రాసిన ఏప్రిల్‌ థీసిస్‌ రూపుదిద్దుకుంటున్న విప్లవ పరిస్థితులను నిర్దిష్టంగా విశ్లేషించగల సమర్థతకు నిదర్శనం, ఆ విధంగానే ఆయన వింటర్‌ ప్యాలెస్‌ ముట్టడికి సరైన సమయంలో సరైన దిశానిర్దేశం చేయగలిగాడు.

రష్యాలో మార్క్సిజానికి పితృ సమానుడుగా పరిగణించబడే జార్జి ప్లెఖనోవ్‌ (1856-1918) పిడివాదాలపై కూడా ఈ క్రమంలో లెనిన్‌ ఎదుర్కొనవలసి వచ్చింది. ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌ శిష్యుడుగా పరిగణించబడే కారల్‌ కాట్‌స్కీ (1854-1938)తో కూడా అదే విధంగా తలపడవలసి వచ్చింది. అక్టోబరు విప్లవానికి, కార్మిక వర్గ నియంతృత్వానికి వ్యతిరేకంగా కాట్‌స్కీ చాలా తీవ్రమైన రివిజినిస్టు వాదనలను ఎదుర్కొనాల్సి వచ్చింది. ‘శ్రామికవర్గ విప్లవం విద్రోహి కాట్‌స్కీ’ అన్న తన ప్రసిద్ధ రచనలో లెనిన్‌ ఆయన వాదనలను తిప్పికొట్టాడు. లెనిన్‌ అనేక కీలకమైన సైద్ధాంతిక ఆచరణాత్మక రచనలు అందించాడు. అవేమంటే, కార్మిక వర్గ పార్టీ సవివర సూత్రీకరణలు వ్యవస్థాగత నిర్మాణం, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలు, విప్లవ దశలు, సామ్రాజ్యవాద గొలుసులో అత్యంత బలహీనమైన లింకును తెగ్గొట్టడం, ఒక దేశంలో సోషలిజం సిద్ధాంతం అభివృద్ధి స్థిరీకరణ, అందులో భాగమైన నూతన ఆర్థిక సిద్ధాంతం, పెట్టుబడిదారీ విధానం సామ్రాజ్యవాదంగా పెరగడం, కొమింటర్న్‌ ద్వారా కమ్యూనిస్టుల అంతర్జాతీయ కృషి ప్రాధాన్యత, అతివాద సంస్కరణవాద పెడధోరణులపై పోరాటం, పార్టీ కార్యక్రమాన్ని ప్రజలను ఉత్తేజపర్చే నినాదాలుగా మలచి భూమి, శాంతి, ఆహారం వంటి పిలుపివ్వడం చూస్తాం. సోవియట్లకే సమస్త అధికారం అన్న పిలుపు ఆఖరుదైనా చాలా ముఖ్యమైందే.

సిద్ధాంత పటిష్టతలో వెనకబాటు

                  అయితే లెనిన్‌ 54 ఏళ్లు కూడా నిండకుండానే కన్నుమూయడం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ఒక పెద్ద విషాదం. ఆయన మరణానంతరం కూడా సోవియట్‌ యూనియన్‌లో చెప్పుకోదగిన విజయాలు సాధించబడ్డాయి. వ్యవసాయం, పరిశ్రమలు, ఆరోగ్యం, విద్య, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక శాస్త్రం, మహిళా సమానత సాధికారత, సంస్కృతి, గృహ నిర్మాణం, దారిద్య్రం, నిరక్షరాస్యతా నిర్మూలన తదితర రంగాల్లో సాధించిన ఘన విజయాలు బాగా తెలిసినవే. ఫాసిజాన్ని నాజీయిజాన్ని ఓడించడంలో సోవియట్‌ ఎర్రసైన్యం వీరోచిత పాత్ర ఒక మహా సంచలనాత్మక వాస్తవం. జాతీయ విముక్తి ఉద్యమాలకు నూతన స్వతంత్ర దేశాలకు సోవియట్‌ యూనియన్‌, సోషలిస్టు దేశాల కూటమి ఇచ్చిన తోడ్పాటును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. యుగ ప్రాధాన్యతగల ఈ పరిణామాలకు పునాది వేసింది లెనినే. దోపిడీ వ్యవస్థల నుంచి దోపిడీ రహితమైన ప్రయోగాల వైపు సమానతా సమాజం, సోషలిజం ఆ తర్వాత దశల వైపు వెళ్లేందుకు బాట వేసింది అవే.ఏమైనా లెనిన్‌ మరణించిన 67 ఏళ్ల తర్వాత సోవియట్‌ తూర్పు యూరప్‌ సోషలిస్టు ప్రయోగాలు విచ్ఛిన్నమైనాయి. లెనిన్‌ స్థాపించిన సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీకి ఆ స్థితి ఎందుకు వచ్చిందనేది ఇక్కడ ప్రశ్న. 1992లో మద్రాసులో జరిగిన సిపిఐ(ం) 14వ మహాసభ ఇందుకు గల కారణాలను విశ్లేషించేందుకు ఒక ప్రయత్నం చేసింది. ఇప్పుడు మనం దాన్ని మరో రూపంలో చెప్పుకోవచ్చు. లెనిన్‌ చెప్పినట్టుగా చేయడంలో సోవియట్‌ కమ్యూనిస్టు పార్టీ విఫలమైంది. మార్క్స్‌ సిద్ధాంతం పునాది వేసిన శాస్త్రం పునాదిపై అన్ని దిశల్లో అభివృద్ధి చేయలేకపోయింది.

‘శాస్త్రీయ సిద్ధాంతాన్ని నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించడం’ అనే లెనిన్‌ సృజనాత్మక వైఖరి ప్రత్యక్ష ప్రభావం ఈ నాటి ప్రపంచంలో కూడా మనం చూడొచ్చు. చైనా ఆర్థిక రంగంలోనూ, విపరీత దారిద్య్రం నిర్మూలనలోనూ గణనీయమైన సాధారణ అభివృద్ధి సాధిస్తున్నది. మొత్తం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడంలో సానుకూల ఫలితాలు ఇంకా వున్నాయి. ఇవన్నీ లెనిన్‌ నూతన ఆర్థిక విధానం ప్రయోగాలను చైనాకు నిర్దిష్టంగా అన్వయించిన ఫలితాలే. వియత్నాం, క్యూబా వంటి దేశాల గురించి కూడా ఇదే చెప్పొచ్చు.

కేరళలో అనుభవాలు

                 కేరళలో 1957 కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మేము చేయడానికి ప్రయత్నిస్తున్నది కూడా కొంత పరిమితమైన అర్ధంలో ఈ విధంగానే చూడవలసి వుంటుంది. ఎందుకంటే బూర్జువా భూస్వామ్య వ్యవస్థ వున్న దేశంలో కేరళ ఒక చిన్న రాష్ట్రం మాత్రమే. ఏమైనా భూ సంస్కరణలతో మొదలుపెట్టి ప్రజా పంపిణీ వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, శ్రమ జీవులకు ఉపయోగకరంగా వుండేలా సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా అమలు పర్చడం, స్థానిక సంస్థల వరకూ అధికారాల వికేంద్రీకరణ, ప్రజా ప్రణాళికలు ఇవన్నీ లెనిన్‌ చూపిన మార్గంలో ఉత్తేజం పొంది చేపట్టిన చర్యలే. కేరళలోని ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్రాన్ని విజ్ఞానాధారిత సమాజంగా ఆర్థిక వ్యవస్థగా పెంపొందించేందుకు ప్రపంచంలోని మధ్య తరహా ఆర్థిక వ్యవస్థల స్థాయికి చేర్చేందుకు ఉద్దేశించబడ్డాయి. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో దుర్భర దారిద్య్రాన్ని పూర్తిగా తొలగించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఈ క్రమంలో చెప్పుకోదగిన మరో అంశం. దేశంలో నయా ఉదారవాద విధానాలు ప్రబలంగా అమలు జరుగుతున్న రీత్యా ఈ చర్యలు ఒక సమూలమైన మార్పునకు దారి తీస్తాయి.

మారిన ప్రపంచంలో మన కర్తవ్యం

             అనేక కారణాల వల్ల నేటి ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సాంకేతిక ఆధారిత గూఢచర్యం, కృత్రిమ మేధ (ఎ.ఐ) పరికరాలు పనిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి దేశంలోని కమ్యూనిస్టులు వస్తున్న మార్పులను లోతుగా విశ్లేషించవలసి వుంది. వివిధ తరగతుల ప్రజల జీవితాలపై, ప్రజాస్వామిక ఉద్యమాలపౖౖె, ఆ మార్పుల తీరుతెన్నులు ప్రభావం ఎలా వుంటున్నదీ పరిశీలించాలి. అప్పుడు మాత్రమే విప్లవోద్యమాన్ని ముందకు తీసుకుపోవడానికి సరైన వైఖరి రూపొందించుకోవడం సాధ్యమవుతుంది. తన సహచరుల సాయంతో లెనిన్‌ ఒక్క చేత్తో చేసిన ఆ పని ఇప్పుడు శ్రామికవర్గ పార్టీ, పార్టీలూ మొత్తంగా సమిష్టిగా చేపట్టవలసి వుంటుంది.

అభివృద్ధి చెందిన ఇతర యూరప్‌ పెట్టుబడిదారీ దేశాలన్నిటికంటే ముందుగా రష్యాలో విప్లవ వెల్లువ అవకాశాలను మార్క్స్‌, ఏంగెల్స్‌ దార్శనికతతో గ్రహించగలిగారనేది ఆసక్తికరమైన విషయం. ఆ దేశ విప్లవోద్యమం నుంచి కొంతమంది చాలా ప్రతిభావంతులైన కామ్రేడ్లు ముందుకు రావచ్చని కూడా వారు చెప్పగలిగారు.

1882లో వెలువడిన ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ రష్యన్‌ ముద్రణకు మార్క్స్‌, ఏంగెల్సు ఉభయులూ ముందు మాట రాశారు (దాన్ని జార్జి ప్లెఖనోవ్‌ జెనీవాలో అనువదించాడు). రష్యన్‌ గ్రామసీమలలో ఉమ్మడి భూయాజమాన్య పద్ధతులు వున్న కారణంగా ఆ దేశం ఒకేసారి సోషలిస్టు సమాజంగా మారే అవకాశం గురించి వారు దాని చివరి పేరాగ్రాఫులో చర్చించారు. అయితే దీనికన్నా దశాబ్ది ముందే ఏంగెల్సు 1872లో జర్మన్‌ విప్లవకారుడు ఫిలిప్‌ బెకర్‌కు రాసిన లేఖలో ఈ అంశం ప్రస్తావించాడు. జర్మన్‌ భాషలో వెలువడిన ‘పెట్టుబడి’ మొదటి అనువాదం ఇంగ్లీషులో ఫ్రెంచిలో కన్నా ముందే రష్యన్‌ భాషలో వచ్చింది. ఆ గ్రంథం మొదటి సంపుటంలో రష్యన్‌ విప్లవావకాశాలపై చర్చ వుంటుంది. దానికి రష్యన్‌ ప్రజల్లో విస్తారమైన ఆదరణ లభించింది. అది చూసిన తర్వాతనే ఏంగెల్సు తన లేఖలో ఇలా రాశాడు: ”మొత్తంగా రష్యన్లను తీసుకుంటే గతంలో యూరప్‌కు వచ్చిన కులీనులు రాజవంశీకులకూ ఇప్పుడు వస్తున్న వారికి మధ్య చాలా తేడా కనిపిస్తోంది. వీరంతా మామూలు ప్రజలు. వారి ప్రతిభను, నడతనూ బట్టి చూస్తే వారిలో కొందరు మన పార్టీలో వున్న అత్యుత్తమ శ్రేణికి చెందిన వారి కోవకు చెందుతారు. కష్ట సహిత, గుణవంతమైన సమర్థత, అదే సమయంలో సిద్ధాంతంపై పట్టు కనిపిస్తున్నాయి. ఇవి ప్రశంసనీయమైన లక్షణాలు.

” మార్క్స్‌, ఏంగెల్సులు రష్యన్‌ విప్లవ భవిష్యత్తు గురించిన ఏ మేధాశకలాలుగా భావించారో అదే మహా ప్రతిభావంతుడైన లెనిన్‌ విప్లవ సిద్ధాంతం, ఆచరణగా రూపుదాల్చిందన్నమాట.

/ వ్యాసకర్త సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు /ఎం.ఎ. బేబి
/ వ్యాసకర్త సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు /ఎం.ఎ. బేబి
➡️