‘అచ్చే దిన్‌’ పదేళ్లలో ఆవిరైన సంతోషం 

Mar 28,2024 04:31 #editpage

‘వికసిత భారత్‌’ అంటూ బిజెపి చేస్తున్న ప్రచార గాలి తీస్తూ రెండు నివేదికలు తాజాగా వెలువడ్డాయి. ఒకటి ప్రపంచ సంతోష సూచికలో మన దేశ స్థానం గత పది సంవత్సరాల్లో దిగజారింది తప్ప జనానికి అచ్చేదిన్‌ జాడలేదని స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి రూపొందిస్తున్నది గనుక సంతోష సూచికను మేం అంగీకరించం అని బిజెపి ఠలాయిస్తే కుదరదు. తలసరి జిడిపి, సామాజిక మద్దతు, ఆరోగ్యం, జీవన విధానాన్ని ఎంచుకొనే స్వేచ్ఛ, ఉదారత, ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలో అవినీతిని జనం ఎలా చూస్తున్నారనే ప్రాతిపదికల మీద ప్రతి దేశం తెచ్చుకొనే మార్కులను బట్టి సూచికలను ప్రకటిస్తారు. ప్రతి ఏడాది సూచిక అంతకు ముందు రెండు సంవత్సరాల తీరుతెన్నుల ప్రాతిపదిన ఉంటుంది. కొన్ని సార్లు పరిగణనలోకి తీసుకొనే దేశాల సంఖ్యలో తేడాలు ఉండవచ్చు. అందువలన మార్కులను బట్టి దిగజారిందా మెరుగుపడిందా అన్నది కూడా చెప్పవచ్చు. మన ఇరుగు పొరుగు దేశాల వివరాలను చూద్దాం. 1.సూచిక, మార్కులు అంటే 2014-16 పంవత్సరాలకు సంబంధించి 2017వ సంవత్సర నివేదిక, 2 సూచిక, మార్కులు అంటే 2021-23కు సంబంధించి 2024 నివేదిక వివరాలని (పట్టిక) గమనించాలి.

నరేంద్ర మోడీ అధికారానికి వచ్చినపుడు ప్రపంచ జిడిపిలో పదవ స్థానంలో వున్నదానిని ఐదవ స్థానానికి చేర్చారని గొప్పలు చెప్పుకుంటారు. త్వరలో చైనాను అధిగమించి పోతామని అందుకే వికసిత భారత్‌ అని చెబుతున్నారు. గడచిన పదేళ్లలో చైనాకు పోటీగా దేశాన్ని నిలబెడతానని చెప్పిన మోడీ దానితో పోలిస్తే దేశాన్ని ఎక్కడ ఉంచారో పైన పేర్కొన్న సంతోష సూచికల్లోనే డొల్లతనం వెల్లడైంది. ఉన్నదాన్ని ఉన్నట్లుగా కూడా ఉంచటంలో విఫలమయ్యారు. పదేళ్ల క్రితం ప్రపంచ జిడిపిలో చైనా వాటా 13.1 శాతంగా ఉన్నదాన్ని 2023లో 17.7 శాతానికి పెంచుకోగా మన వాటా 2.6 నుంచి 3.73కు పెరిగింది. పాకిస్తాన్‌ జిడిపి 2014లో 271.4 బిలియన్‌ డాలర్ల నుంచి మధ్యలో ఒక ఏడాది 374.66 బి.డాలర్లకు పెరిగి 2023లో 340.64 బి.డాలర్ల వద్ద ఉంది. జిడిపి పెరిగినా సంతోష సూచిక పతనంలో మనకూ పాకిస్తాన్‌కూ తేడా ఏముంది? బిజెపి వారు చెబుతున్నట్లు మనకు అన్నీ ఉన్నా జనాలు ఎందుకు సంతోషంగా లేకపోతున్నారు?
నాటి బ్రిటీష్‌ వలస పాలనలో కంటే నేటి స్వతంత్ర పాలనలో ఆర్థిక అసమానతలు ఎక్కువగా పెరిగినట్లు తాజాగా ప్రపంచ అసమానతల ప్రయోగశాల (వరల్డ్‌ ఇనీక్వాలిటీ లాబ్‌) 2024 మన దేశం గురించి ప్రకటించిన విశ్లేషణలో పేర్కొన్నది. నాడు మన జనాన్ని విదేశీ దొరలు దోచుకుంటే నేడు స్వదేశీ దొరలు ఆపని చేస్తున్నారు. అనేక అంశాల మీద అందుబాటులో ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి ఆర్థికవేత్తలు నితిన్‌ కుమార్‌ భర్తీ, లూకాస్‌ ఛాన్సెల్‌, థామస్‌ పికెట్టీ, అన్‌మోల్‌ సోమాంచీ ఒక పత్రాన్ని రూపొందించారు. దానిలో పేర్కొన్న ప్రధాన అంశాలేమిటి? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1980 దశకం వరకు అసమానతలు తగ్గాయి. తరువాత ముఖ్యంగా 1990 దశకంలో సంస్కరణలు ప్రారంభించిన పదేళ్ల తరువాత విపరీతంగా పెరిగాయి. నరేంద్ర మోడీ ఏలుబడిలో అది మరింత ఎక్కువైంది. 1982 నాటికి దేశంలోని ఎగువ ఒక శాతం మంది రాబడి 6.1 శాతం, అది 2014-15 నుంచి 2022-23 వరకు పరిశీలించినపుడు 22.6 శాతం ఉంటే వారి దగ్గర పోగుబడిన సంపదలు 40.1 శాతంగా ఉన్నాయి. ఎగువ పది శాతం మంది వద్ద 2022 నాటికి దేశ సంపదల్లో 60 శాతం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు. అంతరాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, అమెరికాలలో కూడా ఆదాయ రాబడి వాటా ఇంతగా లేదు. పన్నుల విధానం, ప్రపంచీకరణ దీనికి కారణం. ధనికులుగా ఉన్న 167 కుటుంబాల సంపదపై రెండు శాతం పన్ను విధిస్తే జాతీయ ఆదాయం 0.5 శాతం పెరుగుతుందని అంచనా వేశారంటే సంపద ఎలా గుట్టలుగా పడి ఉందో అర్ధం చేసుకోవచ్చు. సక్రమంగా లేని సమాచారం మేరకే తాము అసమానతల గురించి చెబుతున్నామని, నాణ్యమైన, సమగ్ర సమాచారం ఉంటే అసమానతలు ఇంకా ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ధనికుల్లో ఉన్న ఎగువ తరగతిలో కూడా మిగతావారితో పోలిస్తే వారిలో 0.1 శాతం మంది పది శాతం రాబడిని పొందారు. ప్రస్తుతం రెండు భారత దేశాలు కనిపిస్తున్నాయని కొందరు చెప్పిన మాటలను నరేంద్ర మోడీ నిజం చేస్తున్నారు. అందుకే కార్పొరేట్‌ మీడియా, ధనికుల ప్రతినిధులు మోడీని కోరుకుంటున్నారు.
నేటి పాలకులు అధిక జనాభా మన దేశానికి వరం అని ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా మారటానికి అవసరమైన చౌక శ్రామిక శక్తి అందుబాటులో ఉందని తమ జబ్బలను తామే చరుచుకుంటున్నారు. మరోవైపు గత పదేళ్లుగా కేంద్రంలో, వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాషాయ దళాలు ముస్లిం జనాభా పెరిగి హిందువుల కంటే మెజారిటీగా మారనున్నదనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అది నిజమా, సంతోషం ఆవిరి అవుతున్న స్థితిలో ఏ మతానికి చెందిన వారైనా ప్రతి కుటుంబమూ పరిమితం చేసుకొనేందుకు చూస్తున్నాయని ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. జననామరణాల రేటును ప్రాతిపదికగా తీసుకున్నపుడు జననాల రేటు 2.1గా ఉండాలని ఆ రంగ నిపుణులు పేర్కొన్నారు. కానీ తాజా సర్వ ప్రకారం రెండు శాతమే ఉన్నందున రానున్న రోజుల్లో జనాభా తగ్గుతుంది తప్ప పెరగదని చెబుతున్నారు. జనాభాలో పదిహేనేళ్ల లోపు వారు 2015ా16లో 28.6 శాతం ఉండగా 2019ా21లో 26.5 శాతానికి తగ్గారు. అంటే కుటుంబాల్లో పిల్లల సంఖ్య తగ్గుతోంది. జమ్మూాకాశ్మీరు జనాభాలో 68 శాతం ముస్లింలే ఉన్నారు. అక్కడ జననాల రేటు దేశ సగటు కంటే తక్కువగా 1.4 శాతమే ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ముస్లిం జననాల సగటు కంటే కూడా ఇది తక్కువ. విద్య, ఉపాధి, వైద్య, ఆరోగ్య రంగాల్లో కేటాయింపులు ఎక్కువగా ఉండి జనాల పరిస్థితి మెరుగుపడితే కులం, మతంతో నిమిత్తం లేకుండా కుటుంబ నియంత్రణ ఎవరికి వారు పాటిస్తారన్నది అందరికీ తెలిసిన సత్యం.
రెండు సంవత్సరాల క్రితం ఆక్స్‌ఫామ్‌ ఇండియా సంస్థ వెల్లడించిన విశ్లేషణ ప్రకారం కేవలం 98 మంది ధనికులైన భారతీయులు రూ.49.15 లక్షల కోట్ల సంపదలను అదుపు చేస్తుండగా పేదల్లోని 55.5 కోట్ల మంది దగ్గర అంత ఉందని పేర్కొన్నది. 2021లో ఒక వ్యక్తి జాతీయ ఆదాయ సగటు రూ.2,04,200గా లెక్కించగా దిగువ 50 శాతం మంది ఆదాయం రూ.53,610 ఉంది. ఎగువ పదిశాతం మంది జనాల సగటు రాబడి రూ.11,66,520గా ఉంది. కరోనా తరువాత పేదలలో 20 శాతం మంది రాబడి 2020-21లో 53 శాతం తగ్గగా ఇదే సమయంలో ఎగువ 20 శాతం మంది రాబడి 39 శాతం పెరిగింది. కరోనా కారణంగా ఆరు కోట్లుగా ఉన్న పేదలు 13.4 కోట్లకు పెరిగారు. వైద్య ఖర్చుల కారణంగా 2017లో 5.5 కోట్ల మంది పేదరికంలోకి దిగజారారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా దిగువ తరగతి జనాల రాబడి పెరగకపోతే వారి జీవితాలు అతలాకుతలం అవుతాయి. విద్య, వైద్య రంగాల నుంచి ప్రభుత్వాలు తప్పుకుంటూ ప్రయివేటు వారిని ప్రోత్సహిస్తున్నాయి. రుణగ్రస్తులు కావటానికి వీటి మీద పెట్టే ఖర్చు కూడా ఒక అంశంగా మారింది. జిడిపిలో విద్య మీద ఆరు శాతం ఖర్చు పెట్టాలన్నది లక్ష్యం. కానీ నరేంద్రమోడీ తొలి ఐదు సంవత్సరాలలో మూడు శాతానికి మించలేదు, ఏటేటా తగ్గుతున్నది. జిడిపిలో ఐదవ స్థానానికి దేశాన్ని చేర్చామని గొప్పలు చెప్పుకోవటం కాదు. మన కంటే ఎంతో తక్కువగా ఉన్న బ్రెజిల్‌ విద్యకు 6.1, వైద్యానికి 9.5 శాతం, రష్యా 4.7-5.3 చొప్పున దక్షిణాఫ్రికా 6.8-8.2 శాతాల చొప్పున కేటాయిస్తున్నాయి. సంతోష సూచికలో సామాజిక రంగాల మీద పెట్టే ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటారని గమనించాలి. వాటి కేటాయింపులు సరిగా లేకపోతే, తగ్గుతుంటే సంతోషం ఆవిరి అవుతుంది. గడచిన పదేళ్లలో సూచికలో దిగజారటానికి కారణం ఇదే.
– శారద

➡️