ఉద్యమాంధ్ర

anganwadi workers strike in ap editorial

రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కొద్ది రోజుల క్రితం వరకు వైసిపి, టిడిపిల రాజకీయ వ్యూహ, ప్రతి వ్యూహాలకే పరిమితమైన రాష్ట్ర ముఖ చిత్రం అనూహ్యంగా కొత్తరూపు నంతరించుకుంది. విమర్శలు, ప్రతి విమర్శలు, అరెస్టులు, బెయిళ్ల వార్తలు, యాజమాన్యాల సొంత అజెండాలతో నిండిపోయిన దినపత్రికలు, టివి ఛానళ్లలో ఒక్కసారిగా బడుగుజీవుల వెతలు ప్రత్యక్షమయ్యాయి. పెరుగుతున్న ధరలు, చాలీచాలని జీతాలు, పేదలకు అందని విద్య, వైద్యం తదితర అంశాలు చర్చనీయాంశంగా మారాయి. సామాన్యుల నిరసనలు, నినాదాలు వార్తాంశాలుగా మారాయి. పరస్పర దాడులకే పరిమితమై ప్రజల సమస్యలను విస్మరించిన అధికార, ప్రధాన ప్రతిపక్షాలు అనివార్యంగా వాటి గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆడిందే ఆటగా సాగిన అధికార పక్షానికి ఒక్కసారిగా ఉక్కపోత ప్రారంభమైంది. పదిహేను రోజుల క్రితం అంగన్‌వాడీల సమ్మెతో ప్రారంభమైన ఈ పరిస్థితి రోజురోజుకీ ఉధృతమౌతోంది. ధరాభారం, ఆదాయ పంపిణీలో అసమానతలు సామాన్యులు భరించలేని స్థితికి చేరిన విషయం అంతకు కొద్ది రోజుల ముందునుండే కనిపిస్తున్నప్పటికీ పిల్లికి గంట కట్టిన ఘనత మాత్రం అంగన్‌వాడీలదే! ఇప్పుడు ఒకరి తరువాత ఒకరుగా సామాన్యులు గళం విప్పుతున్నారు. ఇన్నాళ్లు పంటిబిగువున భరించిన కష్టాలను ఇంకా మోయడం తమ వల్ల కాదని తేల్చి చెబుతున్నారు. సమస్యల చిట్టాను సర్కారు ముందు పెట్టి పరిష్కరించి తీర్చాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రం ఇప్పుడు సమ్మె జెండాను ఎత్తింది. ఆందోళనా ప్రదేశ్‌గా, ఉద్యమాంధ్రగా మారింది.

అంగన్‌వాడీలు, వారి తరువాత సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు, ఇప్పుడు మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి దిగారు. వీరి ఆందోళనలు రోజురోజుకీ తీవ్రమౌతున్నాయి. అదే సమయంలో వివిధ తరగతులకు చెందిన చిరుద్యోగులు, కార్మికులు కూడా పోరాట పథం వైపు అడుగులు వేస్తున్నారు. ఆశా, విద్యుత్‌, కెజిబివి, పంచాయతీ రాజ్‌ ఉద్యోగులు ఈ జాబితాలో ఉన్నారు. వివిధ విభాగాలకు చెందిన పనిని తమకే అప్పగించి మోపలేని భారాన్ని మోపుతున్నారన్న అసంతృప్తిలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఉన్న సంగతి తెలిసిందే. సమ్మెలో ఉన్న అంగన్‌వాడీల బాధ్యతలను తమకు అప్పగించడాన్ని వారు బాహాటంగానే తప్పుపట్టారు. అనేక చోట్ల ఆ పనులను చేయడానికి నిరాకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. వీరిలో నెలకొన్న అసంతృప్తి ఎప్పుడు బద్దలవుతుందో తెలియని స్థితి నెలకొంది. గత ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పాత పెన్షన్‌ స్కీమ్‌ అమలు విషయంలో మారిన ప్రభుత్వ వైఖరిపట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆగ్రహాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. వీరందరి విషయం ఒక తీరైతే వాలంటీర్ల అంశం మరోతీరు. ముఖ్యమంత్రి నుండి మంత్రులు,ఎంఎల్‌ఏల వరకు వాలంటీర్లకు తమ పార్టీ కార్యకర్తలుగా పదేపదే సర్టిఫికేట్లు ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ వాలంటీర్లపై ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసిందంటే వారిపై వైసిపి ముద్ర ఎంతో అర్ధం చేసుకోవచ్చు. ఆ వాలంటీర్లే ఇప్పుడు తిరుగుబావుటా ఎగురవేస్తూ సమ్మె నోటీసులు ఇస్తున్నారు.

వివిధ తరగతులకు చెందిన శ్రమజీవుల సమస్యలను అర్ధం చేసుకుని పరిష్కరించడానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం భిన్నమైన వైఖరి తీసుకుంటుండటం ఆందోళనకరం. అంగన్‌వాడీలతో తాజాగా జరిపిన చర్చలు, బుధవారం నాటి ఆందోళనల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు వ్యవహరించిన తీరు, విజయవాడలో నిరసన శిబిరాన్ని కూల్చివేసిన వైనం తీవ్ర అభ్యంతరకరం. చర్చల సందర్భంగా అంగన్‌వాడీల సమస్యలు ముఖ్యమంత్రికి తెలియవని మంత్రులు చెప్పడం బాధ్యతారాహిత్యం! ఉష్ట్రపక్షుల మాదిరి నటించాలని ప్రభుత్వ పెద్దలు అనుకుంటే అనుకోవచ్చు. కానీ, ప్రజలు అమాయకులు కారు. వారు ప్రతివిషయాన్ని గమనిస్తూనే ఉంటారు. ధరాఘాతానికి దుర్భరమౌతున్న జీవితాలను వారు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. అందుకే అంగన్‌వాడీల పట్ల ఆ సౌహార్ధ్రత, సంఘీభావం వ్యక్తమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సమస్యలు పరిష్కరిస్తారో… తెగేదాకా లాగి సామూహిక ఆగ్రహానికి గురవుతారో ఏలినవారే తేల్చుకోవాలి.

➡️