అంగన్‌వాడీలపై బెదిరింపులు మానండి

article on anganwadi strike problems ch narasingarao

డిసెంబర్‌ 12 నుంచి రాష్ట్రంలోని 1,03,000 మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు నూరు శాతం 55,605 సెంటర్లలో, 257 ప్రాజెక్టులలో సమ్మె చేస్తున్నారు. ఇది ఐక్య పోరాటం. అన్ని యూనియన్లు కలసి ఐక్యంగానూ, సమరశీలంగానూ ఈ పోరాటం చేస్తున్నాయి. గత నాలుగున్నర సంవత్సరాల జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో అంగన్‌వాడీలు ప్రత్యక్షంగా నిరవధిక సమ్మెకు దిగడం ఇదే మొదటిసారి. గత నాలుగు సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అనేక విజ్ఞప్తులు చేసింది. గత ఆరు మాసాల నుండి 2023 మార్చి 20 చలో విజయవాడ, జులై 10, 11 కోర్కెల దినం, సెప్టెంబర్‌లో మరలా చలో విజయవాడలు నిర్వహించాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా పట్టించుకోలేదు. సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పరుగులు తీస్తున్నది. లబ్ధిదారులకు ప్రతి నెలా 7వ తేదీలోగా పోషక పదార్థాలు పంపిణీ అవుతాయి. అనంతరం డిసెంబర్‌ 8 నుండి నిరవధిక సమ్మె జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి 20 రోజులకు ముందే మూడు యూనియన్లూ ఐక్యంగా నోటీసు ఇచ్చాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోయింది. డిసెంబర్‌ 6న చర్చలకు పిలిచి ఈ నెల పౌష్టికాహారం సప్లరు చేయలేకపోయామని లబ్ధిదారుల శ్రేయస్సు దృష్ట్యా డిసెంబర్‌ 11వ తేదీ వరకూ వాయిదా వేయమని కోరారు. ఆ రోజే డిసెంబర్‌ 12 నుండి సమ్మె చేస్తామని ముందే అధికారులకు యూనియన్‌ నాయకత్వాలు స్పష్టం చేశాయి. డిసెంబర్‌ 11న చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి యూనియన్‌ సిఐటియు నాయకులు జి.బేబీరాణి, కె.సుబ్బరావమ్మ, ఏఐటియుసి నాయకులు లలితమ్మ, ఐఎఫ్‌టియు నాయకులు భారతితో చర్చలు జరిపారు. ప్రధానమైన వేతన పెంపు, గ్రాట్యూటీ చేయలేమని చెప్పారు. సమ్మెను విరమించమని కోరారు. దీన్ని ట్రేడ్‌ యూనియన్లు పూర్తిగా తిరస్కరించాయి. డిసెంబర్‌ 12 నుండి నిరవధిక సమ్మె సాగుతున్నది.

రాష్ట్ర ప్రభుత్వం ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు సమస్యల పరిష్కారం చేతకాక అంగన్‌వాడీలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది. డిసెంబర్‌ 12వ తేదీన రాష్ట్ర అధికారులు సమ్మె కొనసాగిస్తే ఉద్యోగం నుండి తొలగిస్తామని చర్చల్లో బెదిరించారు. డిసెంబర్‌ 13న జిల్లా కలెక్టర్లు కొన్ని జిల్లాల్లో అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగలగొడుతున్నారు. జంగారెడ్డి గూడెంలో ఒకటి, మండవల్లిలో మూడు సెంటర్లకు, ఏలూరు జిల్లాలోనూ తాళాలు పగలగొట్టారు. మన్యం జిల్లాలో సాలూరులో మూడు సెంటర్లకు అధికారులు తాళాలు పగలగొట్టారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ అంగన్‌వాడీ కేంద్రాలను నడపాలని ఇతర శాఖలకు బాధ్యత అప్పగించారు. ‘ఈ బెదిరింపులతో మన ఉద్యమం ఆగదు. రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు మాని తక్షణం సమస్యలు పరిష్కరించాల’ని సిఐటియు డిమాండ్‌ చేస్తున్నది.

సమ్మె ఎందుకు?

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా ఐసిడిఎస్‌ సేవలు అందుతున్నాయి. వెనకబడిన ప్రాంతాలు, మురికివాడలు, గిరిజన ప్రాంతాలకు ఈ సేవలు చాలా ముఖ్యమైనవి. ఆరు సంవత్సరాల్లోపు పిల్లలకు పౌష్టికాహారం, చదువు అందిస్తున్నారు. బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. మానవ అభివృద్ధి సూచికలో ఆరోగ్య అభివృద్ధిలో వీరి పాత్ర అతి ముఖ్యం. ఇటువంటి ముఖ్య సేవలు గత 30 సంవత్సరాలకు పైగా అంగన్‌వాడీలు లక్షల మంది దేశమంతా ప్రజలకు అందిస్తున్నారు. అయినా అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్ల జీవితాలు ‘గొర్రె తోక బెత్తెడు చందం’గా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులుగా పనిచేస్తున్న వీరికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. రాష్ట్రంలో గత పిఆర్‌సి ప్రకారం ఆఖరు గ్రేడ్‌ ఉద్యోగులకు నెలకు రూ. 20 వేలు బేసిక్‌గా చెల్లిస్తున్నారు. అదే జీతాన్ని అంగన్‌వాడీ హెల్పర్‌కు చెల్లించాలి. వర్కర్‌కు ఇంకా అదనంగా చెల్లించాలి. అంగన్‌వాడీలకు ఎంత తక్కువగా జీతం పెంచినా ఉన్న జీతంమీద 20 శాతం అదనంగా ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం జీతాన్ని ఒక్క రూపాయి కూడా పెంచకపోవడం చాలా దుర్మార్గం. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కానీ జీతాలు పాతాళానికి నెట్టివేయబడుతున్నాయి. ఈ కాలంలో కరువు భత్యం 469 పాయింట్లు పెరిగాయి. విడిఏ లెక్క ప్రకారం పాయింట్‌కు రూ. 7.74 చొప్పున పెంచాలి. దీని ప్రకారం కేవలం కరువు భత్యం నెలకు రూ. 3,630 అదనంగా పెంచాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ చెల్లించనని మొండి వాదన చేస్తున్నది. 2022 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు అంగన్‌వాడీ కార్మికుల గురించి తీర్పునిచ్చింది. అంగన్‌వాడీలు కార్మికులా? కాదా? కార్మికులు అయితే వీరికి గ్రాట్యూటీ చెల్లించాలా? లేదా? ఈ రెండు విషయాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని సిఐటియు డిమాండ్‌ చేస్తున్నది. ఐసిడిఎస్‌ ఒక ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థలో పనిచేస్తున్న అంగన్‌వాడీలకు సర్వీసు కండిషన్లు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు 15 రకాల పనులు చేయాలని స్పష్టంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. వారికి చెల్లించే జీతం గౌరవ వేతనం అని పేరు పెట్టినా చట్ట ప్రకారం వేతనమే అవుతుంది. ఏ విధంగా చూసినా అంగన్‌వాడీలు కార్మికులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయకపోవడం కోర్టు తీర్పును ధిక్కరించడమే. అంగన్‌వాడీలను కార్మికులు అని గుర్తిస్తే గ్రాట్యూటీ, పి.ఎఫ్‌, ఇఎస్‌ఐ, బోనస్‌, పెన్షన్‌ తదితర చట్టపరమైన హక్కులన్నీ అమలు చేయాలి. వీటికి ఎగనామం పెట్టడానికి కార్మికులుగా గుర్తించకుండా దొడ్డిదారిన కొన్ని సౌకర్యాలు మాత్రమే కల్పిస్తామని చర్చల్లో అధికారులు చెప్పారు. గ్రాట్యూటీ చెల్లించకుండా రిటైర్మెంట్‌ బెనిఫిట్‌గా వర్కర్‌కు లక్ష రూపాయలు, హెల్పర్‌కు రూ.నలభై వేలు చెల్లిస్తామంటున్నారు. అంగన్‌వాడీలకు దయాదాక్షిణ్యంగా చెల్లించనక్కర్లేదు. 30 సంవత్సరాలు సర్వీసు చేసిన వారికి ప్రస్తుత జీతం ప్రకారమే సుమారు రూ. 2 లక్షలు చెల్లించాలి. చట్టాల్ని అమలు చేయాలని, చట్టాల్ని ధిక్కరించొద్దని సిఐటియు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది.

కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఐసిడిఎస్‌ను ప్రైవేట్‌పరం చేయడానికి పలు ప్రయత్నాలు చేసింది. స్వచ్ఛంద సంస్థలు అక్షయ పాత్ర, వేదాంత, జిందాల్‌ లాంటి కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టాలని అనేక రాష్ట్రాల్లో చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో ఐసిడిఎస్‌ కేటాయింపు రూ. 25 వేల కోట్ల నుండి రూ. 15 వేల కోట్లకు తగ్గించింది. కేంద్ర ప్రాజెక్టు అయిన ఐసిడిఎస్‌లో అంగన్‌వాడీలకు ఖర్చును 80 శాతం కేంద్ర ప్రభుత్వం, 20 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. కానీ మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తమ ఖర్చును 60 శాతానికి తగ్గించింది. అంగన్‌వాడీలకు నేటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న జీతం నెలకు రూ. 2,700 మాత్రమే. బిజెపి అంగన్‌వాడీలకు వ్యతిరేకమైన తప్పుడు విధానాలను పాటిస్తున్నది. కార్పొరేట్ల కంపెనీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భజన చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ కంపెనీలు బ్యాంకుల నుండి తీసుకుని చెల్లించని రూ.15.2 లక్షల కోట్ల రుణాన్ని మాఫీ చేయగలిగింది. ఇందులో ఒక్క శాతం ఐసిడిఎస్‌ సంస్థకు కేంద్ర ప్రభుత్వం చెల్లించినా కార్మికుల జీతాలు రెట్టింపు చేయొచ్చు. అంగన్‌వాడీ కేంద్రాలను అద్భుతంగా నడపవచ్చు. రాష్ట్రంలోని గంగవరం పోర్టును జగన్‌ ప్రభుత్వం అదానీకి అప్పగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా అంగన్‌వాడీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. లేకుంటే ఈ పోరాటం మరింత ఉధృతం అవుతుంది. మొత్తం కార్మికుల్లో 90 శాతం అంగన్‌వాడీ కార్మికులు సిఐటియు సంఘంలో సభ్యులుగా ఉన్నారు. వీరికి రాష్ట్ర సిఐటియు సంఘాలన్నీ సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరుతున్నాము.

Ch. Narasinga Rao
PIC FOR VIZAG METRO- —
The CITU State leader, Ch. Narasinga Rao..
—-PHOTO/C_V_SUBRAHMANYAM.[digital14/04/05.

– వ్యాసకర్త : సిహెచ్‌. నరసింగరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

➡️