అప్రమత్తత అవసరం

Dec 21,2023 07:10 #Covid Cases, #Editorial
covid cases increase in india

జెఎన్‌.1 కోవిడ్‌ సబ్‌ వేరియంట్‌ దేశంలో విస్తరిస్తోందన్న వార్త కలకలం రేపుతోంది. అయితే, బుధవారం నాటికి ఈ వేరియంట్‌కి సంబంధించి దేశంలో 21 కేసులే ఉన్నాయని, వాటిలో 19 మంది, గోవా రాష్ట్రంలోను, మహారాష్ట్ర కేరళల్లో చెరొకరు చొప్పున బాధితులున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి స్పష్టం చేయడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. కాని, కోవిడ్‌-19 రెండవ దశ విజృంభణ నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటే ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలు, ప్రభుత్వాలూ కృషి చేయాల్సిన ఆవశ్యకత స్పష్టమవుతుంది. ఉదాశీనతకు పాల్పడకుండా పాలకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బుధవారం నాడు కోవిడ్‌ కొత్త కేసులు 614 నమోదైనాయని, గత మే 21 తరువాత ఇదే అత్యధిక సంఖ్యని కేంద్ర మంత్రి పేర్కొనడం అప్రమత్తత ఎంత అవసరమో విదితం చేస్తోంది. గడచిన రెండు వారాల్లో 16 మంది కోవిడ్‌ బాధితులు మరణించినా వారు ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారేనని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జెఎన్‌.1ను వేరియంట్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌గా వర్గీకరించింది. ప్రస్తుతం ప్రజారోగ్య పరంగా ఈ వేరియంట్‌ వల్ల స్వల్ప ప్రభావమే ఉంటుందని మంగళవారంనాడు ప్రకటించింది. అయితే, ఉత్తరోత్తరా ఈ వేరియంట్‌ జన్యుపరమైన మ్యుటేషన్‌కు గురియై వేగంగా విస్తరించగలిగే శక్తిని పొందడం, వ్యాక్సిన్‌లకు లొంగకుండా పోయే పరిస్థితి కూడా ఏర్పడే ప్రమాదం ఉండవచ్చు కనుక ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావాన్ని పరిశీలిస్తుండాలి. ప్రస్తుత వ్యాక్సినత్లో జెఎన్‌.1 నుండి రక్షణ పొందవచ్చునని డబ్ల్యుటిఓ పేర్కొంది. కాబట్టి అనవసర భయాలకు పోకుండా జాగ్రత్తగా ఉండాల్సిందే.కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశంలోనే ఆదర్శవంతమైన కృషి చేసిన ఘనమైన చరిత్ర కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వానికుంది. అయినా జెఎన్‌.1 గురించిన వార్తలు వచ్చిన వెంటనే ఏదో అయిపోతోందన్న చందంగా అక్కడి యుడిఎఫ్‌ కూటమి, బిజెపి దుష్ప్రచారానికి దిగడం, కార్పొరేట్‌ మీడియా వారికి వంత పాడడం దారుణం. కానీ కేరళ ఆరోగ్య మంత్రి వాస్తవ వివరాలు ప్రకటించడమేగాక సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ నివేదికలే ఆ రాష్ట్రంలో కేవలం ఒక్క కేసు గుర్తించగా, బిజెపి పాలిత రాష్ట్రాల్లో 20 కేసులున్నట్లు పేర్కొనడంతో విమర్శకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఏమైనా వైరస్‌ వ్యాప్తి చెందకుండాను సోకినా సమర్ధవంతమైన వైద్య సేవలను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. క్రిస్మస్‌, నూతన సంవత్సరాది, ఆ తరువాత వచ్చే సంక్రాంతి వంటి సందర్భాల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడవచ్చు. అటువంటి సందర్భాల్లోనే వైరస్‌ వ్యాప్తి జరిగిందని గతానుభవాలు చెబుతున్నాయి. కాబట్టి సంతోషాలను మానుకోనక్కరలేదు కానీ మాస్క్‌లు వాడడం, సామాజిక దూరాన్ని పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతతో మెలగడం ఎంతో అవసరం. అదే అందరికీ రక్ష! ప్రజల్లో ఆ చైతన్యాన్ని పెంచేందుకు ప్రభుత్వాలు, సంస్థలు పూనుకోవాలి. దేశమంతటా మంగళవారంనాడు 772 పరీక్షలు మాత్రమే చేశారు. ఆ సంఖ్య భారీగా పెరగాలి. తగినన్ని ఆర్‌టిపిసిఆర్‌ కిట్లను సమకూర్చుకోవాలి. అవసరమైనన్ని టీకా డోసులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయాలి. ఈలోగా వైరస్‌ విజృంభిస్తే అవసరానికి తగిన విధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఐసియు, ఆక్సిజన్‌ బెడ్లు, ఇతర సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికపై రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేయాలి. కరోనా రెండవ దశలో ప్రజలెదుర్కొన్న దుస్థితి పునరావృతం కారాదు. కేంద్ర ప్రభుత్వం నుండి టీకాలు, నిధులను సాధించడంతోపాటు రాష్ట్రంలో వైద్య మౌలిక సౌకర్యాల కల్పన, మందుల సరఫరా, డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది నియామకాల వంటివి చేపట్టవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఆ దిశగా కార్యాచరణకు సర్కారు సన్నద్ధం కావాలి. ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి.

➡️