సుప్రీం ఆదేశాలతోనైనా..

May 18,2024 03:38 #editpage

రాష్ట్రంలో బరితెగించి సాగిస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందన స్వాగతించదిగినది. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి), సుప్రీం ఆదేశాలకు వ్యతిరేకంగా జరుగుతున్న చట్ట విరుద్ధ ఇసుక అక్రమ మైనింగ్‌ నిరోధానికి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో వివిధ సర్కారీ విభాగాల అధికారులు సభ్యులుగా కమిటీలు ఏర్పాటు కావాలని, అవి సుప్రీం వేసిన కమిటీల్లా పని చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే కోర్టు ధిక్కరణతో పాటు క్రిమినల్‌ చర్యలూ ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులివ్వడం మంచిదే. కమిటీలు నాలుగు రోజుల్లో అన్ని ఇసుక రీచ్‌లనూ సందర్శించి అక్రమ తవ్వకాలను ఆపించాలని ఆదేశించింది. కాగా కేసు విచారణ సందర్భంగా ఇసుక అక్రమాలపై వెలుగులోకి వచ్చిన విషయాలు కోర్టులపైనా, చట్టాలపైనా, వ్యవస్థలపైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం గౌరవం లేదని తెలియజేస్తున్నాయి. నిషేధిత ప్రాంతాల్లో భారీ యంత్రాలతో మైనింగ్‌ వద్దని గతేడాది మార్చి 23న ఎన్‌జిటి ఇచ్చిన తీర్పును రాష్ట్ర సర్కార్‌ నేలకేసి కొట్టి తన పని తాను చేసుకుపోయిందని సాక్ష్యాధారాలతో సహా సుప్రీం దృష్టికొచ్చింది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖల ప్రత్యక్ష తనిఖీల్లోనూ ఉల్లంఘనలు బయట పడ్డాయని ఆ విభాగాలు కోర్టుకు నివేదిక సమర్పించాయి. ఇసుక అక్రమాలు ప్రభుత్వ అండతోనే జరిగాయనడానికి ఇంతకంటే ఏం కావాలి? అందుకే సుప్రీం అంతలా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం చెందాల్సి వచ్చింది.
ఎ.పి.లో అక్రమ ఇసుక దందా కొంత మంది రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కాంట్రాక్టర్లకు, అధికారులకు కాసులు కురిపిస్తోందన్నది పచ్చి నిజం. వైసిపి సర్కారు వచ్చీరాగానే ఇసుక మైనింగ్‌ను కొన్ని నెలలపాటు నిలిపేసింది. టిడిపి హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని, తాము వాటిని సరిచేసి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం తెస్తామని తొలుత ఆన్‌లైన్‌ సిస్టం ప్రవేశపెట్టింది. తదుపరి అక్రమాలు ఆగలేదన్న పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రెండు ప్రైవేటు కంపెనీలకు మైనింగ్‌ కాంట్రాక్టులిచ్చింది. ఈ చర్యతో గుత్తాధిపత్యం నెలకొంది. ఇసుక ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఒకప్పుడు ట్రాక్టర్‌ ఇసుక ఇంటికి చేర రూ.1,500-2,000 ఉన్నది కాస్తా ఐదారు వేలు దాటింది. సామాన్యులు ఇసుక కొనలేని పరిస్థితి నెలకొంది. ఇసుకను కొన్ని నెలలు ఆపడం వలన సుమారు కోటి మందికిపైగా ఉన్న భవన నిర్మాణ కార్మికులకు, నిర్మాణరంగంపై ఆధారపడ్డ ఇతర కార్మికులకు పనుల్లేక పస్తులుండాల్సిన దుర్గతి పట్టింది. కొన్ని చోట్ల కార్మికులు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డ హృదయవిదారక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ సక్రమంగా ఇసుక అందుబాటులో లేక ప్రజలు నానా ఇబ్బందులూ పడుతున్నారు.
ఈ కాలంలో అనుమతుల్లేని అక్రమ ఇసుక తవ్వకాలకు హద్దూ పద్దూ లేదు. సుప్రీంకు గనుల శాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం చూసినా.. 30 వేలకుపైన ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయానకమో అర్థమవుతుంది. ఎఫ్‌ఐఆర్‌లపై తీసుకున్న చర్యలు శూన్యం. గతంలో ఎన్‌జిటి ఆదేశాలపై కలెక్టర్లు ఇసుక రీచ్‌లను పరిశీలించి అక్రమాలేవీ లేవని అబద్ధపు రిపోర్టులిచ్చారు. కళ్లముందు విచ్చలవిడి ఇసుక దోపిడీ జరుగుతున్నా వ్యవస్థలు కళ్లు మూసుకున్నాయి. ఇక ఇసుక మాఫియా దాష్టీకాలకు, దౌర్జన్యాలకు, దాడులకు లెక్కే లేదు. ప్రశ్నించిన వారిని హతమార్చిన దారుణాలూ ఉన్నాయి. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు లేకుండా ఇటువంటి అరాచకాలు జరగవు. రాజ్యం మద్దతుతో సాగుతున్న అక్రమ ఇసుక మైనింగ్‌ ఆగాలంటే న్యాయస్థానాల జోక్యం తప్ప మరో గత్యంతరం లేదు. సుప్రీం ఆదేశాలను అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమే. కోర్టు నిరంతర పర్యవేక్షణ ఉంటే తప్ప అక్రమాలకు ముకుతాడు పడదు. ఇసుకాసురులపై కఠిన చర్యలు తీసుకుంటేనే వ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. సహజ వనరులు ప్రకృతి మానవాళికి ఇచ్చిన వరం. అవసరాలకనుగుణంగా పరిమితంగా వాడుకోవాలి. లాభాపేక్ష, కార్పొరేటీకరణలతో విచ్చలవిడిగా తోడేస్తే నీటి వనరుల గమనానికి, పర్యావరణానికి హానికరం. ఈ విధ్వంసాన్ని కట్టడి చేసి భావి తరాల కోసం సహజ వనరులను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. సుప్రీం ఉత్తర్వులతోనైనా ప్రభుత్వం, అందరూ ఆ వైపు కదలాలి.

➡️