మోసపూరిత ప్రచారం

Jan 17,2024 07:20 #Editorial

               ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు… నాగులో నాగన్న… అని సగటు జీవి ఈసురోమంటుంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు, దళారీలకు సూపర్‌ లాభాలు సాధించి పెట్టే పనిలో నిమగమైంది. ఆర్థిక వ్యవస్థ 2027 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, వృద్ధి రేటు పరవళ్లు తొక్కుతోందన్నట్టుగా మోడీ సర్కార్‌, దాని అధీనంలోని ప్రచార బాకాలు మోత మోగిస్తున్న తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితికి దర్పణం పట్టే కొన్ని చేదు నిజాలు బయటకొస్తున్నాయి. గత సంవత్సరం నవంబరులో దేశ పారిశ్రామికాభివృద్ధి ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి అంటే 2.4 శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం గత డిసెంబరులో నాలుగు నెలల గరిష్ట స్థాయికి అంటే 5.69 శాతానికి ఎగబాకింది. ముఖ్యంగా ఆహార ధాన్యాలు, కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సగటు జీవి చేసే ఖర్చులో ఎక్కువ భాగం ఆహారంపైనే వెచ్చిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బియ్యం, వంట నూనెలు, పప్పులు, కూరగాయలు, గుడ్లు వంటి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుని నడ్డి విరుస్తున్నాయి. వినియోగదారుల ధరల సూచీ ప్రాతిపదికన అంచనా వేసిన ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది. ధరల రిటైల్‌ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 14 బేసిక్‌ పాయింట్లు పెరిగి 5.69 శాతానికి చేరింది. గత నవంబరులో 8.70శాతంగా ఉన్న ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం, డిసెంబరు నాటికి 9.53%కి పెరిగింది. జాతీయ సగటుతో పోలిస్తే గత డిసెంబరులో తొమ్మిది రాష్ట్రాలలో అధిక ద్రవ్యోల్బణ రేటు నమోదైంది. 2022తో పోలిస్తే భారతీయుల సగటు జీవన వ్యయం (ద్రవ్యోల్బణం) 5.69 శాతానికి చేరుకుంది. ఒడిషాలో 8.73 శాతం, గుజరాత్‌లో 7.07 శాతం, రాజస్థాన్‌లో 6.95 శాతం పెరిగింది. పప్పుల ధరలు 43 నెలల గరిష్టస్థాయికి 20.7 శాతానికి పెరిగాయి. 2022 డిసెంబర్‌తో పోలిస్తే ప్లేట్‌ (థాలీ) భోజనం ధర 12 శాతం పెరిగిందని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. బిజెపి ప్రభుత్వం వర్గ నైజాన్ని తెలుసుకోడానికి ఇదొక తిరుగులేని ఉదాహరణ.

పారిశ్రామిక రంగం విషయానికొస్తే గత నవంబర్‌లో పారిశ్రామిక వృద్ధి 1.2 శాతమే నమోదైంది. వినియోగ వస్తువుల ఉత్పత్తి 5.4 శాతం తగ్గింది. కోవిడ్‌ మహమ్మారి రెండోసారి విరుచుకుపడిన 2021 జూన్‌ తర్వాత ఇంత దారుణమైన వృద్దిరేటు ఇదే. ఈ పరిణామాలకుతోడు కేంద్రం ఉపాధి హామీ చట్టం అమలులో సవాలక్ష నిబంధనలు పెడుతూ ఉసురుతీస్తోంది. పట్టణాల్లోనూ ఉపాధి దొరక్క కాయకష్టం చేసుకునే కూలీలు తిరిగి పల్లెలకు వలస వచ్చే పరిస్థితి, ఈ రివర్స్‌ వలసలతో గ్రామాల్లో ఉపాధి హామీపై ఒత్తిడి పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు తగినట్టుగా ఉపాధి హామీకి కేంద్రం నిధులు పెంచాల్సింది పోయి, ఎడాపెడా కోతలు పెడుతున్నది. ఫలితంగా నిరుద్యోగిత గత నలబై ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరింది. కుటుంబాల నికర ఆర్థిక పొదుపు మొత్తాలు గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా జిడిపిలో 5.1 శాతానికి పడిపోయాయి. రిటైల్‌ రుణాలు గత ఆరేళ్లలో పెరిగి గత ఏడాది మార్చికి 51.7 లక్షల కోట్లకు చేరాయి. ఇది మొత్తం బ్యాంకు రుణాల్లో 30 శాతంగా ఉన్నాయి.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోందని మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలోని డొల్లతనాన్ని ఈ గణాంకాలు బట్టబయలు చేశాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి దేశంలో విదేశీ పెట్టుబడులు 3,800కోట్ల డాలర్ల నుండి 1300కోట్ల డాలర్లకు క్షీణించాయి. జి-20 కూటమిలో తలసరి ఆదాయం అతి తక్కువగా ఉన్న దేశం భారత్‌ అన్న విషయాన్ని మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాచిపెడుతోంది.

మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్లలో 25 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు పన్నుల మినహాయింపు రూపంలో కట్టబెట్టింది. కార్పొరేట్లకు పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల దేశంలోకి పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా వస్తాయని, ఉపాధి పెరుగుతుందని ప్రభుత్వం చేసే వాదనలో ఏమాత్రం పసలేదని క్షేత్ర స్థాయిలో అనుభవం తెలియజేస్తున్నది. అయినా ప్రభుత్వ ధోరణిలో మార్పు లేదు. ప్రభుత్వం బడా కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చే బదులు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూతనిస్తే ఆర్థిక వ్యవస్థకు అది ఎంతో మేలు చేకూర్చుతుంది. సరుకుల ఉత్పత్తి ప్రధానంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో జరుగుతుంది. ఆ చిన్న పరిశ్రమల యజమానులు తమ వద్దకు వచ్చిన సొమ్మును మళ్లీ పెట్టుబడి రూపంలోనో, ఖర్చు రూపంలోనో మార్కెట్‌లోకి పంపిస్తారు. ఆ విధంగా శ్రామిక ప్రజలకు నేరుగా అందేలా ప్రభుత్వం ఖర్చు చేస్తే అది రెండు, మూడింతలు మార్కెట్‌లో సరుకులకు గిరాకీ పెరగడానికి దోహదపడుతుంది. అదే బడా కార్పొరేట్లకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తే అందులో ఎక్కువభాగం కార్పొరేట్ల దగ్గర మిగులు రూపంలో ఉండిపోతుంది. మార్కెట్‌లో డిమాండ్‌ పెరగడానికి అది ఏ విధంగానూ దోహదపడదు. ధరలను అరికట్టడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇందుకు అది అనుసరిస్తున్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాలే కారణం. కార్పొరేట్‌, కమ్యూనల్‌ అనుకూల విధానాలు అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలి.

➡️