నీటి విలువ తెలుసుకో!

Mar 31,2024 03:50 #Editorial

భూమికి/ పురుడు పోసింది నీరే కదా/ జలజలలాడే గుండెను గట్టిపరుచుకొని/ కాళ్లకు నేలను తొడిగింది నీరే/ హిమఖండాలైనా/ గట్టిబండలైనా/ అవి ఘనీభవించిన నీటిస్వప్నాలే/ ఆకాశం నుంచి దూకుతూ వచ్చిన నీరు/ అమృతకలశాన్ని వెంట తెచ్చింది’ అంటారు డాక్టర్‌ ఎన్‌.గోపి తన ‘జలగీతం’లో. ఈ ప్రపంచంలో దేనికైనా విశ్రాంతి వుంటుందేమో గానీ, నీటికి వుండదు. ప్రకృతిలో అనుక్షణం మేల్కని వుండేది నీరు. ప్రతి క్షణం ఎక్కడోకచోట ప్రవహిస్తూనే వుంటుంది. ‘నీటి పేరు వింటేనే నిలువునా తడిసిపోతాం/ నీరంటేనే జలజలలాడిపోతాం/ నీటితనంతో ప్రాణులం/ నిత్యజీవన తేజో విరాజితులమౌతాం’ అంటారు డాక్టర్‌ గోపి. వాగులు, వంకలు, చెలమలతో పెదవులు తడుపుకున్నాయి నదులు. నదుల నడకలతో నీటికి కొత్త మార్గాలు సమకూరాయి ధరిత్రిలో. నాగరికత తరుమూలాలను తడివేళ్లతో సేచనం చేసింది నది. నీరు ఒక సంస్కృతి… ఒక చారిత్రక కృతి. సకల జీవ విన్యాసాల ఆవిష్కృతి నీరు. భూమిపై లభ్యమౌతోన్న మొత్తం నీటిలో 97 శాతానికిపైగా సముద్రజలం. కాగా, మరో రెండు శాతానికిపైగా మంచురూపంలో వుంది. మిగిలిన ఒక్క శాతంకన్నా తక్కువగా వున్న మంచినీరే జీవకోటికి పనికొచ్చేది. ఇప్పుడా మంచినీటికి పెద్ద ముప్పు ఏర్పడింది. అధిక జనాభా, పర్యావరణం వంటివి ఒక కారణమైతే, రెండోది కాలుష్యం. దీంతో మంచినీటికి గడ్డుకాలం ఏర్పడింది. ఈ పరిస్థితిని ఉపయోగించుకొని కార్పొరేట్లు నీటిని ఓ సరుకుగా మార్చేస్తున్నాయి.
మరికొన్నేళ్లలో చమురు నిల్వలు అంతరించిపోతాయని అనేక నివేదికలు చెబుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాలు ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారిస్తున్నాయి. చమురుకు ప్రత్యామ్నాయంగా సౌరశక్తి, పవన విద్యుత్తు, అణు ఇంధనం వంటివి కనిపిస్తున్నాయి. కానీ అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు ప్రత్యామ్నాయం ఏముంది? యావత్‌ ప్రాణికోటికి జీవాధారమైన నీటిని సంరక్షించుకోకపోతే మనిషి మనుగడకే ముప్పు. దేశంలో దాదాపు 30 నగరాలు నీటి సమస్య ప్రమాదపుటంచున వున్నాయి. సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా పిలిచే బెంగళూరు ఇప్పుడు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. చివరకు రేషన్‌ మాదిరిగా నీటిని కొలతలు వేసి పంచాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది భారతదేశానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు, యావత్‌ ప్రపంచమే నీటి ఎద్దడిని ఎదుర్కోనే కాలం ఎంతో దూరంలో లేదని, 2050 నాటికి ప్రపంచంలో చాలా భాగం తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కోనుందని వరల్డ్‌ రిసోర్సెస్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనం వెల్లడించింది. ప్రపంచ జనాభాలో 31 శాతం నీటి కొరత ప్రభావానికి గురికానుంది. గత డెబ్బై ఏళ్లలో ప్రపంచ జనాభా మూడు రెట్లు పెరగగా, నీటి వాడకం ఆరు రెట్లు పెరిగింది. నీతి అయోగ్‌ నివేదిక ప్రకారం… 2030 నాటికి 40శాతం మంది భారతీయులకు తాగునీరు అందుబాటులో వుండదు. ముఖ్యంగా నీటి వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతోంది. బహుళజాతి సంస్థలు ప్రభుత్వాల నుంచి హక్కులు పొంది, నీటి వ్యాపారం ద్వారా వేల కోట్ల రూపాయలు తరలించుకుపోతున్నాయి. తద్వారా సహజ నీటి వనరులపై ప్రజలు తమ హక్కును కోల్పోతున్నారు. ‘ఒక్కడే/ నీటికుప్ప మీద కూచొని/ కరువును వినోదిస్తాడు/ కరువును వ్యాపారం చేసే విద్యలో/ ఘనుడు వాడు’ అంటారు కవి ఎన్‌.గోపి. ప్రకృతిసిద్ధమైన తాగునీరు, సాగునీరు ప్రజలందరి హక్కు. రక్షిత మంచినీటిని అందించాల్సిన ప్రభుత్వాలు… భూమిని పీల్చి పిప్పి చేస్తున్న కార్పొరేట్‌ సంస్థల దోపిడీకి అప్పగించాయి. తద్వారా భూగర్భజలాలు అడుగంటిపోయి… మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.
‘నీరు విలువ తెలుసుకో/ నీరు నిలువ చేసుకో/ నీటితోనే భూతల్లి నిత్యము బాలింత/ ఆ నీరు వృధా చేస్తే బాధలే బతుకంతా…’ అంటాడో కవి. మనుషులు పెరిగినట్టు నీళ్లు పెరుగుతాయా? ప్రకృతిని విధ్వంసం చేస్తూ జలవనరులను హరిస్తున్న మనిషి… ఇప్పటికైనా మేలుకోవాలి. నీటిని పొదుపు చేయాల్సిన తక్షణావసరాన్ని ప్రభుత్వాలు సైతం గుర్తించాలి. మానవ దుర్వినియోగం కారణంగా మనుగడ కోల్పోతున్న సరస్సులు, నదులు, సముద్రాలు, జలపాతాలు, వాగులు, వంకలను పరిరక్షించుకోవాలి. నీటికి ఆపన్నహస్తం అందించాలి.

➡️