దేశాన్ని చీల్చేందుకు మోడీ కుట్ర  

Apr 24,2024 05:02 #editpage

రాజస్థాన్‌ బాన్స్‌వారాలో మోడీ చేసిన విద్వేషపూరిత ప్రసంగం బిజెపిలో ఓటమి భయాన్ని తెలియజేస్తున్నది. కాంగ్రెస్‌కు ఓట్లేస్తే హిందువుల ఆస్తుల్ని ముస్లింలకు పంచేస్తారని, హిందూ మహిళల మెడలోని తాళిబట్లను కూడా తెంచేస్తారని చెప్పడం చూస్తుంటే అబద్ధాలు ఆడడంలో ఎంతగా బరితెగించారో అర్థమవుతుంది. గత 10 సంవత్సరాల్లో చెప్పుకోవడానికి ఏ ఘనకార్యమూ లేనందువల్లే ప్రజల్ని మభ్యపెట్టి ఏమార్చి ఓట్లు గుంజుకునేందుకు దింపుడు కళ్ళెం ఆశతో ప్రయోగించిన పనికిమాలిన అస్త్రం ఇది. 19వ తేదీన జరిగిన లోకసభ ఎన్నికలు మొదటి దశలో బిజెపి దారుణంగా దెబ్బతింటుందన్న సర్వేలు రావడంతో మోడీ, బిజెపిలను నిస్పృహ ఆవహించింది. అందుకే రూటు మార్చి తమ అసలు రంగును బయటపెట్టుకున్నారు. హిందువుల్లో భయాందోళనలు సృష్టించి, విద్వేషాలు రగిల్చి గెలుపొందాలనే దురాశతో చేసిన జాతి వ్యతిరేక ప్రసంగం ఇది. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించి దేశ ఐక్యతను కాపాడాలి. దానికి బదులుగా ప్రజల్లో మత విద్వేషాలు రగిల్చి దేశాన్ని నిట్టనిలువునా చీల్చే ప్రయత్నం చేయడం నీతిమాలిన చర్య.
మోడీ వైఫల్యాల నుండి పక్కదారి పట్టించే యత్నం
మొడీ తప్పుడు వాగ్దానాలతో కళ్ళు తెరిచిన వివిధ తరగతుల ప్రజలు ఆందోళనలతో రోడ్డెక్కారు. ఈ కాలంలో ఢిల్లీ రైతాంగ పోరాటం, కార్మికుల సమ్మెలు, దళితులు, ఆదివాసీలపై దాడులకు వ్యతిరేకంగా తీవ్ర ప్రతిఘటనా ఉద్యమాలు జరిగాయి. మణిపూర్‌లో మత విద్వేషాలు పెంచి రక్తపాతాన్ని సృష్టించడం, మహిళలను నగంగా ఊరేగించడం, దేశ ప్రజల ఈసడింపుకు గురైంది. కేజ్రీవాల్‌ అరెస్టుతో ప్రజల్లో బిజెపి కక్షపూరిత రాజకీయాలు బట్టబయలయ్యాయి. నిరుద్యోగం, అధిక ధరలు అరికట్టడానికి మోడీ సర్కార్‌ పూర్తిగా విఫలమైంది. ఈ వైఫల్యాలు ప్రజలకు అర్థమయ్యేకొద్దీ అభివృద్ధి, ఉగ్రవాదాన్ని ప్రక్కన పడేసి ముసుగు తొలగించి మతోన్మాదాన్ని నిస్సిగ్గుగా ప్రజలపై ప్రయోగిస్తున్నది. మెజారిటీ మతస్థులైన హిందువుల్లో తమ ఉనికి దెబ్బ తింటుందన్న భయాందోళనలను సృష్టించి లంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నది. రామజన్మభూమి నిర్మాణాన్ని ఒక గొప్ప ఘనతగా చూపెట్టుకుంటున్నది. అరేబియా మహాసముద్రంలో మునిగి ద్వారకను చూశాననడం, వారణాసిలో జ్ఞానవాపి వివాదాన్ని రేపడం, సిఎఎ నియమ నిబంధనలు రూపొందించి పౌరసత్వ చట్ట సవరణను ముందుకు తీసుకురావడం, ఏకరూప పౌరస్మృతి తెస్తాననడం, క్రిమినల్‌ చట్టాలకు హిందీ పేర్లు పెట్టి మార్చడం వగైరా చర్యలన్నీ ఈ కోవలోవే. ముస్లిం మైనారిటీలకు చొరబాటుదార్లుగా, అధిక సంతానాన్ని పుట్టించే వారిగా చూపడం హిందువులలో మతపరమైన భావోద్రేకాలను రెచ్చగొట్టడానికే.

నాటి బ్రిటీషు ఏజెంట్లే నేటి మతోన్మాదులు
1946-47లో దేశం విడిచి వెళ్ళక తప్పదని గ్రహించిన బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు వెదజల్లిన విషాన్ని ఇప్పటికీ ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి మతోన్మాదులు కాపాడుతూ వస్తున్నారు. స్వాతంత్య్రోద్యమంలో బ్రిటీష్‌వాళ్ళ అడుగులకు మడుగులత్తి వారికి ఏజెంట్లుగా పనిచేసిన వారు, జాతిపిత మహాత్మా గాంధీ హంతకుల వారసుల నుండి దేశం ఇంతకు మించి ఏమి ఆశించగలదు. నాడు మత ఘర్షణలతో దేశం రెండుగా విడిపోతే అదే మత విద్వేషాలు పెంచి దేశాన్ని మరోసారి చీల్చి ఏ అమెరికాకో తాకట్టు పెట్టే దుష్ట పథకంతో బిజెపి ఇలా బరితెగించి వ్యవహరిస్తున్నది. బిజెపి చేతిలో దేశ సమైక్యత, సమగ్రత బలయ్యే ప్రమాదం కళ్ళ ముందు కనిపిస్తున్నది. మత సామరస్యాన్ని, జాతీయ ఐక్యతను కాపాడుకొంటేనే బలమైన భారతదేశం నిర్మితమవుతుంది. దేశాన్ని బలహీనపర్చే మోడీ వాఖ్యలను ప్రతి భారతీయుడూ ఖండించాలి. ఇది ముస్లింల సమస్య కాదు. హిందువులను ఉద్ధరించేది అంతకన్నా కాదు. హిందూ ముస్లిం ఘర్షణలు పెంచి రాజకీయ లబ్ధి పొందాలన్న బిజెపి దుష్ట పథకం. దాని పేరే హిందూత్వ అని ముద్దుగా పెట్టుకున్నారు. బిజెపి హిందూత్వ సిద్ధాంతానికి హిందువులకు ఏ సంబంధం లేదు. హిందూత్వ, హిందూయిజం రెండూ వేర్వేరని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులే ప్రకటించుకున్నారు. హిందూత్వ అనే పదాన్ని ప్రవేశపెట్టిన సావర్కర్‌ కూడా అదే చెప్పాడు. హిందూత్వ బిజెపికి అధికారాన్ని సాధించి పెట్టే రాజకీయ పథకం. ఏ హిందువైనా ఈ దుష్ట వ్యూహం వలలో పడితే అది దేశాన్ని బలహీనపరుస్తుందని గుర్తించాలి.

వైసిపి టిడిపిల అసలు రంగు
ప్రధాని ఓట్ల కోసం ఇంత దారుణంగా జాతి వ్యతిరేక ప్రకటనలు చేసినా మన రాష్ట్రంలోని రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు-వైఎస్సార్‌సిపి, తెలుగుదేశం-స్పందించకపోవడం మరింత దారుణం. కేవలం మోడీకి భయపడి ఇంతకాలం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టినవారు ఇప్పుడు ఏకంగా జాతి ప్రయోజనాలనే పణంగా పెడుతున్నారు. మైనారిటీలను వంచిస్తున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం మౌనంగా వుండడమంటే తన లౌకికత్వానికి నీళ్ళదలడమే. వైసిపి, టిడిపిల్లో ఉండే లౌకికవాదులు, దేశభక్తులు మోడీ వ్యాఖ్యలను తిరస్కరించాలి. మోడీని, ఆయన పార్టీ బిజెపిని ఆ బిజెపికి వంత పాడుతున్న మన రాష్ట్రంలోని పార్టీలను ఓడించేందుకు ఇప్పటికైనా ముందుకు రావాలి. మన రాష్ట్రంలో బిజెపి ప్రమాదం లేదని తక్కువ అంచనా వేస్తున్నవారు కళ్ళు తెరవాలి. ఒకసారి దేశం తగలబడితే ఆంధ్రప్రదేశ్‌ అందుకు అతీతంగా ఉండలేదు.

ఎన్నికల కమిషన్‌ నిర్జీవమైందా ?
మోడీ వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌ (ఎంసిసి)కు వ్యతిరేకంగా ఉన్నా ఎన్నికల కమిషన్‌ స్పందించకపోవడం మరింత ఆందోళన కలిగించే విషయం. ప్రతి చిన్న వ్యాఖ్యకు ప్రతిపక్షాలపై విరుచుకుపడే ఎన్నికల కమిషన్‌ దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదకరమైన ప్రధాని ప్రసంగంపై స్పందించకుండా మౌనంగా వుండడం దారుణం. ఇది ఎన్నికల కమిషన్‌ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. సిపిఐ(యం) ఢిల్లీ శాఖ, బృందాకరత్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టినా నమోదు చేయకపోవడం చట్ట ధిక్కరణే. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలన్నీ మోడీ ముందు మోకరిల్లడం రానున్న ప్రమదానికి హెచ్చరిక.

గాలికి కొట్టుకుపోయిన అభివృద్ధి ఎజెండా అవినీతిలో బిజెపి
2014లో మొదటిసారి మోడీ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రధాని పదవికి అంగలు సాచినరోజు ”అభివృద్ధి” అనే మంత్రదండంతో యువతను ఆకర్షించారు. రెండు కోట్ల ఉద్యోగాలస్తాయని, విదేశాల నుండి దొంగ డబ్బు తెచ్చి పంచుతారని, అవినీతిని అరికడతారని, ధరలు తగ్గిస్తారని ఆశించిన జనం మొదటి ఐదేళ్ళలోనే తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ వైఫల్యం నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి 2019లో పుల్వామా ఘటన ఆసరా చేసుకొని పాకిస్తాన్‌ మీద సర్జికల్‌ స్ట్రైక్‌ పేరుతో ఉగ్రవాదాన్ని నిర్మూలించామన్న భ్రమలు సృష్టించి ప్రజల భావోద్రేకాలను ఓట్లుగా మల్చుకున్నారు. కాని ఉగ్రవాదం నిర్మూలించబడలేదు, ఆ పేరుతో కాశ్మీర్‌ 370 ఆర్టికల్‌ రద్దు చేశారు. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి మరింత దిగజారింది. పేద రైతుల భూముల్ని అదానీ, అంబానీలకు కట్టబెట్టేస్తున్నారు. చిన్న వ్యాపారస్థులు, యువత ఆధారపడి జీవిస్తున్న టూరిజాన్ని బడా కంపెనీల పరం చేసేశారు. దీంతో ప్రజల్లో అభద్రతాభావం పెరిగి ఉగ్రవాదం వైపు మళ్ళుతున్నారు. ఆనాడు జమ్మూ కాశ్మీర్‌ గవర్నర్‌గా పనిచేసిన బిజెపి నాయకుడు సత్యపాల్‌ మాలిక్‌ సైనికులను రోడ్డు మార్గాన పంపవద్దని విమానాల ద్వారా రవాణా చేయమని చెప్పినా వినకుండా మోడీ ప్రభుత్వం 40 మంది వీర జవాన్‌లను బలితీసుకుంది. ఈ వాస్తవాన్ని ఆ తరువాత అదే గవర్నర్‌ దేశ ప్రజల దృష్టికి తీసుకురావడంతో ఖంగుతిన్న బిజెపి ఆయనపైనా ఇ.డి అస్త్రాన్ని ప్రయోగించి బెదిరింపులకు దిగింది. 2019-24 మధ్య దేశం అభివృద్ధికి నోచుకోకపోగా గత 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగం ప్రబలింది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎన్నికల బాండ్ల పేరుతో బిజెపి దిగమింగిన వేల కోట్ల స్కామ్‌ మోడీ అసలు రూపాన్ని బట్టబయలు చేసింది.

ముంగిట్లో నిరంకుశత్వ ప్రమాదం
ప్రతిపక్షాలపైనా, తనను ప్రశ్నించినవారిమీద, వాస్తవాలు రాసే జర్నలిస్టులమీద ఇ.డి, ఐ.టి, సిబిఐ, ఎన్‌ఐఏ, ఉపా చట్టాలను ప్రయోగించి వారి గొంతు నొక్కుతున్నది. ఎన్నికలను ఒక తంతుగా మార్చేందుకు ఎలక్షన్‌ కమిషన్‌ను నియమించే హక్కు తన చేతిలో పెట్టుకుంది. ప్రజాస్వామ్యం గొంతు నులిమి నిరంకుశత్వాన్ని దేశంపై రుద్దుతున్నది. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మోడీ వైఫల్యాల నుండి దృష్టి మళ్ళించేందుకే ఒక పథకం ప్రకారం రాజస్థాన్‌లో ప్రసంగం చేసి తమ స్వార్థపూరిత రాజకీయ ఎజెండాను ప్రజలపై రుద్దుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ దుష్ట పథకాన్ని ఓడించి దేశ భవిష్యత్తును, రాజ్యాంగాన్ని, ప్రజల ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత ఓటర్లపై ఉంది.

వి. శ్రీనివాసరావు

/ వ్యాసకర్త సిపిఎం ఎ.పి రాష్ట్ర కార్యదర్శి /

➡️