మున్సిపల్‌ కార్మికుల సమ్మె – కొన్ని అంశాలు

Jan 13,2024 07:15 #Editorial

కార్మిక వర్గంలో ఉన్న చీలికను ఉపయోగించుకొని సమ్మెను దెబ్బతీసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయోగాలు చేసింది. పోటీ కార్మికులకు రోజుకి రూ.850 నుండి రూ.1000 వరకు, జె.సి.బి, ప్రొక్లెయినర్ల కాంట్రాక్టర్లకు రూ.50 నుండి రూ.60 వేలు ఇచ్చి పని చేయించేందుకు ప్రయత్నిస్తే కార్మికులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల సమ్మెలో లేని సంఘాల నాయకులే దళారులుగా మారి పోటీ కార్మికులను సరఫరా చేశారు. ప్రభుత్వం సైతం కార్మికులు పూర్తిగా నిద్ర మత్తులో వుండే సమయాన….అంటే తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య పని చేయించేందుకు వేసిన ఎత్తుగడలను కార్మికులు చిత్తు చేశారు.

             రాష్ట్రంలో ఎన్నికల గోదాలోకి దిగిన అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యక్తిగత దూషణలతో రాజకీయాలంటేనే సామాన్య మధ్య తరగతి ప్రజల్లో ఏహ్యభావం కలుగుతున్న తరుణమిది. ఈ పరిస్థితుల్లో మొదలైన అంగన్‌వాడీ, సమగ్రశిక్ష అభియాన్‌, మున్సిపల్‌ కార్మికుల సమ్మెలు ప్రజలందరి దృష్టిని ఆకర్షించే రీతిలో రాష్ట్ర రాజకీయ కలుషిత వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశాయి. ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఈ సమ్మెల చుట్టూ ఆలోచించాల్సి వచ్చింది. ప్రజలు కూడా జుగుప్సాకరమైన రాజకీయ వాతావరణం నుండి కొంత ఊరట పొందగలిగారు. కార్మిక వర్గానికి ఉన్న శక్తి అటువంటిది.

కార్మికుల్లో కూడా రాజకీయ చైతన్యం పెరుగుతోంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు గద్దెనెక్కేందుకు రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపించడం, గద్దెనెక్కాక వాగ్దానాలను విస్మరించడం పరిపాటిగా మారిపోతోంది. ఈ పూర్వ రంగంలోనే మున్సిపల్‌ కార్మికులు 2023 డిసెంబర్‌ 26 నుండి ఎ.పి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఈ సమ్మెలో కొన్నిచోట్ల ఎఐటియుసి, ఐఎఫ్‌టియు, టిఎన్‌టియుసి, ఎంఆర్‌పిఎస్‌ సంఘాలు కూడా గొంతులు విప్పాయి. వైఎస్‌ఆర్‌టియుసి కార్మికులు కూడా విజయవాడ, తాడేపల్లి లాంటి చోట్ల తోటి కార్మికులతో సమ్మెలోకి వచ్చారు.

సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వ కుట్రలు

             కార్మిక వర్గంలో ఉన్న చీలికను ఉపయోగించుకొని సమ్మెను దెబ్బ తీసేందుకు ప్రభుత్వం అన్ని రకాల ప్రయోగాలు చేసింది. పోటీ కార్మికులకు రోజుకి రూ.850 నుండి రూ.1000 వరకు, జె.సి.బి, ప్రొక్లెయినర్ల కాంట్రాక్టర్లకు రూ.50 నుండి రూ.60 వేలు ఇచ్చి పని చేయించేందుకు ప్రయత్నిస్తే కార్మికులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల సమ్మెలో లేని సంఘాల నాయకులే దళారులుగా మారి పోటీ కార్మికులను సరఫరా చేశారు. ప్రభుత్వం సైతం కార్మికులు పూర్తిగా నిద్ర మత్తులో వుండే సమయాన….అంటే తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య పని చేయించేందుకు వేసిన ఎత్తుగడలను కార్మికులు చిత్తు చేశారు. చలిలో, దోమల్లో రాత్రి వేళల్లోనూ టెంట్లలోనే వుంటూ దళాలుగా ఏర్పడి గస్తీ చేసి మరీ పోటీ కార్మికులను, పోలీసులను ఎదుర్కొని సమ్మె పోరాటాన్ని కొనసాగించారు. నెల్లూరు, విశాఖ, అనంతపురం, తాడిపత్రి, ఒంగోలు, పుట్టపర్తి, ధర్మవరం, నర్సరావుపేట, ఏలూరు తదితర చోట్ల కార్మికులపై పోలీసు కేసులు నమోదు చేశారు. మున్సిపల్‌ అధికారులు బెదిరింపు నోటీసులు ఇచ్చారు. అయినా కార్మికులు బెదరలేదు.

అధికార పార్టీ నాయకుల దౌర్జన్యం

               సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అధికార పార్టీ నాయకులు నేరుగా రంగంలోకి దిగారు. అమలాపురం, తాడిపత్రి, పుట్టపర్తి, నర్సరావుపేట, విశాఖ, నెల్లూరులలో వారి అనుయాయులను, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను దించడమేగాక, పెద్ద సంఖ్యలో జెసిబిలు, ట్రాక్టర్లను దించారు. ఈ ప్రయత్నాలను ఎదుర్కొనేందుకు కార్మికులు మురిగిపోయిన చెత్త మధ్య నిద్రపోయారు. పోటీ కార్మికులకు, పోలీసులకు దండాలు, దస్కాలు పెట్టి తమ పోరాటాన్ని విచ్ఛిన్నం చేయొద్దని వేడుకున్నారు. ఇంటింటికి లక్షలాది కరపత్రాలు పంచి ‘మా న్యాయమైన పోరాటాన్ని బలపర్చండి’ అని ప్రజలను అభ్యర్ధించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని, బెదిరింపులను ఎదుర్కొంటూ రకరకాల వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగడం, ఇంజనీరింగ్‌ విభాగంలోని కొత్త కొత్త సెక్షన్లు సమ్మెలో చేరడం, వేలాది మంది కార్యక్రమాల్లోకి రావడంతో సమ్మెకు దూరంగా ఉన్న కొన్ని సంఘాలు జనవరి 6న కాకుండా 3వ తేదీ నుండే సమ్మెలోకి రావడంతో సమ్మె పోరాటం మరింత విస్తరించింది.

ప్రభుత్వం తొలి నుండి పారిశుధ్య ఇంజనీరింగ్‌ కార్మికులను కలవనివ్వకుండా విభజించి పాలించు సిద్ధాంతాన్ని ప్రయోగిస్తోంది. 2019లో గద్దెనెక్కాక పారిశుధ్య కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ పేరుతో రూ.6000 ఇచ్చింది. నాటి నుండి ఇంజనీరింగ్‌ కార్మికులకు కూడా ఇవ్వాలని సిఐటియు సంఘం పోరాడుతూ వస్తోంది. జిఓ ఆర్‌టి నెం.30లో వేతనాలు తక్కువుగా నిర్ణయించిన వాటర్‌ సప్లరు, టౌన్‌ ప్లానింగ్‌, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు మొదలగు 8 కేటగిరీలకు స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ జీతాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నది. దీని ఫలితంగానే జిఓ ఆర్‌టి నెం.30 సవరణ ఫైలు ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పెండింగ్‌లో ఉందని ప్రభుత్వం చెప్పింది. సర్టిఫికెట్లు లేక గత 20-25 ఏళ్లుగా నైపుణ్యంతో కూడిన విధులు నిర్వహిస్తున్న వారికి అన్‌స్కిల్డ్‌ జీతాలు ఇవ్వడాన్ని సిఐటియు సంఘం వ్యతిరేకించడమే కాదు. 3 లేదా 5 ఏళ్లు సీనియారిటీ ఆధారంగా స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌ జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం ససేమిరా అంటున్నది. సర్టిఫికెట్‌ లేకుండా టెక్నికల్‌ జీతాలు చెల్లించం అంటూ గత ఎనిమిదేళ్లుగా కాలయాపన చేస్తున్నది. వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా శిక్షణనిచ్చి సర్టిఫికెట్లు ఇవ్వాలని, నైపుణ్యానికి అనుగుణంగా జీతాలు చెల్లించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఫలితంగా ప్రభుత్వం అంగీకరించింది. జీతాల పెంపులో ప్రభుత్వం మొండి వైఖరి ప్రస్తుతం జీతాలు పెంచే విషయం గురించి చర్చల సందర్భంగా 2022 జనవరిలో ఆప్కాస్‌ వారందరికి జీతాలు పెంచారు. మరలా ఐదేళ్ల దాకా జీతాలు పెంచేది లేదంటూ ప్రభుత్వం మొండి పట్టు పట్టింది. మొండిగా ఉన్న ప్రభుత్వాన్ని దారికి తెచ్చేదాకా ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్నవారికి నెలకు రూ.5-6 వేలు చొప్పున రిస్క్‌ అలవెన్స్‌ ఇవ్వాలని పట్టుబట్టాం. ”ఇక నుండి ఎవరికీ ఏ విధమైన అలవెన్స్‌లు ఇచ్చేది లేద”ంటూ గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ కరాఖండిగా చెప్పారు. అలాంటప్పుడు వీరికి కూడా 11వ పిఆర్‌సి కమిటీ సిఫార్సులకు అనుగుణంగా కనీస వేతనాలు రూ.20 వేలు ఇవ్వండి అనడిగాము. ఒక్క రూపాయి పెంచేది లేదంటూ ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది.

సమ్మె ప్రారంభమై 16 రోజులు గడుస్తున్న పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికుల్లో రూ.21 వేలు జీతంపైన ఎంతో కొంత పెంచితే మంచిది. లేదంటే తర్వాత చూసుకుందాం అనే చర్చ ప్రారంభం కావడం, కార్మికులు 123 మున్సిపాల్టీలలోని ఇంజనీరింగ్‌ కార్మికులు సమ్మెలోకి రాకపోవడంతో…కొంత విరామం తీసుకోవాలి. మరలా ఊపిరి పీల్చుకున్న తర్వాత మరో దశ పోరాటాన్ని కొనసాగించవచ్చు. అనే ఉద్దేశంతోనే సమ్మెను వాయిదా వేయడం జరిగింది.సర్టిఫికెట్లు లేనివారికి శిక్షణ, సర్టిఫికెట్ల మంజూరు, పని ఆధారంగా జీతాల చెల్లింపు, స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌, జీతాల చెల్లింపు సమస్యలపై 9 మంది అధికారులతో కూడిన కమిటీని 10వ తేదీనే ప్రకటించడం జరిగింది.

శానిటేషన్‌ మరియు ఇంజనీరింగ్‌ విభాగ కార్మికులందరికీ మొదటిసారిగా రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ కింద 10 సంవత్సరాలు సర్వీసు ఉన్నవారికి రూ.75,000, ఎక్స్‌గ్రేషియో, సాధారణ మృతికి 2 లక్షలు, ప్రమాద మృతికి 5 లక్షల నుండి 7 లక్షల రూపాయలు, దహన సంస్కారాలకు 15 వేల నుండి 20 వేల రూపాయలకు పెంపుదలకు ప్రభుత్వం అంగీకరించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక్కో కార్మికుడికి రూ.1000 చెల్లిస్తారు. అలాగే సమ్మెకాలం జీతాల చెల్లింపుకు, కార్మికులపై నమోదు చేసిన పోలీసు కేసులు ఉపసంహరించేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 11వ పిఆర్‌సి బేసిక్‌ రూ.20,000 కంటే శానిటేషన్‌ కార్మికులకు రూ.21,000, శానిటేషన్‌ డ్రైవర్లు, యుజిడి కార్మికులకు 18,500 నుండి రూ.24,500 బేసిక్‌ జీతంగా మారింది. కార్మిక వర్గం సమిష్టిగా పోరాడితే ఎంతటి నిర్బంధాన్నైనా, విచ్ఛిన్నానైనా ఎదుర్కొని పోరాడి విజయం సాధించగలరని రుజువైంది.

/ వ్యాసకర్త ఎ.పి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి / కె. ఉమామహేశ్వరరావు
/ వ్యాసకర్త ఎ.పి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి / కె. ఉమామహేశ్వరరావు
➡️